అమరావతికి ‘రియల్’ బూమ్
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:55 AM
రాజధాని అమరావతికి రియల్ బూమ్ తీసుకొచ్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. దేశీయంగా టాప్-10లో ఉన్న రియల్ ఎస్టేట్ అండ్ డెవలపింగ్ సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా ఇండియాలో సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులోని టాప్-5 రియల్ ఎస్టేట్ అండ్ డెవలపింగ్ సంస్థలకు సీఆర్‌డీఏ అధికారులు తాజాగా ఆహ్వానం పలికారు.

- బెంగళూరు టాప్-5 కంపెనీలకు ఆహ్వానం
- ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, గోద్రేజ్, మంథన్ ఎస్టేట్స్‌లకు సీఆర్‌డీఏ ఆఫర్
- హైరైజ్ , రెసిడెన్షియల్, కమర్షియల్, వర్క్ ప్లేసెస్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి
- అమరావతికి రావటానికి సిద్ధమన్న సదరు కంపెనీలు
- స్టాంప్ డ్యూటీ మినహాయింపు కోరిన సంస్థలు
- త్వరలో ఇండియా టాప్-10 రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థలతో సీఎం భేటీ
- దేశవ్యాప్తంగా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోని సంస్థలకూ ఆహ్వానం
- అదాని ఇన్ర్ఫా, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్స్, డీఎస్‌ఆర్ గ్రూపు సంస్థల ఆసక్తి
విజయవాడ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతికి రియల్ బూమ్ తీసుకొచ్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. దేశీయంగా టాప్-10లో ఉన్న రియల్ ఎస్టేట్ అండ్ డెవలపింగ్ సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా ఇండియాలో సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులోని టాప్-5 రియల్ ఎస్టేట్ అండ్ డెవలపింగ్ సంస్థలకు సీఆర్‌డీఏ అధికారులు తాజాగా ఆహ్వానం పలికారు. దేశంలోనే అగ్రశేణి రియల్ ఎస్టేట్ మార్కెట్లలో బెంగళూరు కూడా ఒకటి కావటంతో సీఆర్‌డీఏ అధికారులు ముందుగా దీనిని ఎంచుకున్నారు. ఇటీవలే బెంగళూరు వెళ్లిన మునిసిపల్ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబులు అక్కడ టాప్-5 సంస్థలతో భేటీ అయ్యారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో వివరించి.. అక్కడ పెట్టుబడులు పెడితే తాము భూములు ఇస్తామని ఆఫర్ చేశారు. అమరావతిలో హైరైజ్ , రెసిడెన్షియల్, కమర్షియల్, వర్క్ ప్లేసెస్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. బెంగళూరులోని టాప్-5 కంపెనీల్లో ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, గోద్రేజ్, మంథన్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా విలక్షణమైనవి. ఇందులో ప్రెస్టీజ్ గ్రూప్.. భారీ బహుళ అంతస్థుల భవనాలను నిర్మించటంలో అందెవేసిన చేయిగా ఉంది. ప్రెస్టీజ్ ట్రాన్స్‌ఫీల్డ్, ప్రెస్టీజ్ సాంగ్ హైట్స్ ఇటీవల దీని ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నాయి. లగ్జరీ అపార్ట్‌మెంట్స్, కమర్షియల్ స్పేస్, ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వంటివి చేపట్టడంలో ఈ సంస్థ మంచి పేరుంది. శోభ లిమిటెడ్ సంస్థ తాజాగా సోభా హెరిటేజ్, సోభా హార్ట్లాండ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. ఈ సంస్థ హై ఎండ్ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్, సస్టెయిన్‌బుల్ డిజైన్స్ చేయటంలో ప్రత్యేకతను కలిగి ఉంది. బ్రిగేడ్ గ్రూప్ కంపెనీ.. బ్రిగేడ్ మెట్రోపోలిస్, బ్రిగేడ్ ఎన్‌క్లేవ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. మల్టీయూజ్ డెవలప్‌మెంట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను నిర్మించటంలో ఈ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే తాజాగా గోద్రేజ్ పార్క్, గోద్రేజ్ ట్రిబెకా వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ప్రీమియం రెసిడెన్షియల్ స్పేస్ వంటివి కల్పించటంలో ఈ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉంది. మంథన్ ఎస్టేట్స్.. తాజాగా మంథన్ అవనీ, మంథన్ స్మార్ట్ వరల్డ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. స్మార్ట్ హోమ్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయటంలో ఈ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ సంస్థల యాజమాన్యాలతో మంత్రి, సీఆర్‌డీఏ కమిషనర్ చర్చలు జరిపి అమరావతికి ఆహ్వానించారు. రాజధాని అమరావతిలో రూ.60 వేల కోట్లతో సీఆర్‌డీఏ, ఏడీసీలు అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల్లో సింహభాగం గవర్నమెంట్ కాంప్లెక్స్, అధికారులు, జడ్జిల అపార్ట్‌మెంట్లు, భవనాలు, ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా, ట్రంక్ ఇన్ర్ఫా వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే అమరావతికి ఓ రూపు వస్తుంది. ఇవికాకుండా మహానగరంగా విస్తరించాలంటే అమరావతిలో యాక్టివిటీని పెంచాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఊపందుకుంటే తప్ప వివిధ రంగాల కార్యకలాపాలు వేగవంతమయ్యే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రియల్ బూమ్‌కు కేంద్రస్థానంగా మార్చాలని భావిస్తోంది. రియల్ బూమ్ కోసం ఇండియా టాప్-10 రియల్ ఎస్టేట్ కంపెనీలకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఇండియా టాప్-10లో బెంగళూరులో టాప్-5 ఉన్నాయి. కాబట్టి బెంగళూరులో ఆయా సంస్థల ప్రాజెక్టులను మంత్రి, కమిషనర్‌లు అధ్యయనం చేశారు. రాజధాని అమరావతిలో కూడా ఆ స్థాయి ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానం పలికారు. అమరావతిలో అవసరమైన భూములు ఇస్తామని, 60:40 విధానంలో హైరైజ్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, వర్క్ ప్లేసెస్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బెంగళూరు టాప్-5 రియల్ ఎస్టేట్ సంస్థలు సీఆర్‌డీఏ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించాయి. తాము అమరావతి రావటానికి సిద్ధంగానే ఉన్నామన్న ఆసక్తిని తెలిపాయి. కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేశాయి. అమరావతి నిర్మాణం జరుగుతున్న దశలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వెంటనే డిమాండ్ ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దటానికి అన్ని కార్యక్రమాలను చేపట్టామని, అమరావతి చుట్టూ రియల్ బూమ్ కేంద్రీకృతమైందని, తప్పకుండా ప్రాజెక్టులు విజయవంతమవుతాయని మంత్రి, కమిషనర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టాంప్ డ్యూటీ వంటి కొన్ని మినహాయింపులు కూడా కోరినట్టు తెలిసింది. ఇలాంటి మినహాయింపులపై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వారిరువురూ చెప్పారు.
టాప్-10 రియల్ ఎస్టేట్ సంస్థలతో సీఎం భేటీ
త్వరలో దేశంలోని టాప్-10 రియల్ ఎస్టేట్ అండ్ డెవలపింగ్ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో భేటీ కానున్నారు. దేశంలోని టాప్-10 సంస్థలను అమరావతికి ఆహ్వానించి ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో చూపించనున్నారు. ఆ తర్వాత సీఎం స్థాయిలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశానికి ముందే అమరావతిలో ఎలాంటి ప్రాజెక్టులను చేపట్టాలన్న దానిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటారు.
అదానీ, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్స్ ఆసక్తి
అమరావతి రాజధానిపై అదానీ, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్స్ వంటి బడా నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన డీఎస్‌ఆర్ గ్రూపు కూడా అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తోంది.