Greenko Office : మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:54 AM
మచిలీపట్నంలోని గ్రీన్‌కో కార్యాలయం, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

‘గ్రీన్‌కో, ఏస్ నెక్ట్స్ జెన్’ కార్యాలయం నుంచి రికార్డులు స్వాధీనం
‘ఫార్ములా-ఈ రేస్’ వ్యవహారంలో చిక్కుకున్న సంస్థ
బీఆర్‌ఎ్‌సకు రూ.41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినట్లు అభియోగం
మచిలీపట్నం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలోని గ్రీన్‌కో కార్యాలయం, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇక్కడ గ్రీన్‌కో సంస్థ ఎండీ, వైసీపీకి చెందిన చలమలశెట్టి సునీల్‌కు చెందిన గృహంలోనే గ్రీన్‌కో, ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయాలను నడుపుతుండగా, స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా తెలంగాణాకు చెందిన ఏసీబీ అధికారులు వచ్చారు. రికార్డులను, కంప్యూటర్లను, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఫార్ములా-ఈ రేస్ ఒప్పందానికి ముందు గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు భారత రాష్ట్ర సమితి పార్టీకి రూ.41 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చాయని, ఈ అంశంపై విచారణలో భాగంగా మచిలీపట్నం వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై రెండు రాష్ర్టాల్లోని గ్రీన్‌కో అనుబంధ సంస్థల కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడ ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. మచిలీపట్నానికి చెందిన చలమలశెట్టి సునీల్ గ్రీన్‌కో సంస్థ ఎండీగా ఉండి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నా రు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణలో ఫార్ములా-ఈ రేస్ వ్యవహరంలో చిక్కుకున్న గ్రీన్‌కోలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం సంచలనం కలిగించింది.