Actor Posani Krishna : డాక్టర్‌.. గుండెనొప్పి అమ్మా.. కడుపునొప్పి

ABN, Publish Date - Mar 02 , 2025 | 03:23 AM

వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ నానా ‘ఆపసోపాలు’ పడ్డారు. గుండెలో నొప్పి అని ఒకసారి.. కడుపునొప్పి అంటూ ఇంకోసారి.. కేన్సర్‌ కావచ్చునని మరోసారి వైద్యులను టెన్షన్‌ పెట్టారు.

Actor Posani Krishna : డాక్టర్‌.. గుండెనొప్పి అమ్మా.. కడుపునొప్పి
  • సార్‌.. కేన్సర్‌ ఉందేమో..

  • కడప రిమ్స్‌లో పోసాని ‘ఆపసోపాలు’

  • మూడు గంటలపాటు పరీక్షలు

  • ఏమీ లేదని తేల్చిన వైద్యులు

  • ఆస్పత్రిలో ఉంచనక్కర్లేదని వెల్లడి

రాజంపేట/కడప, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కడప రిమ్స్‌లో నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ నానా ‘ఆపసోపాలు’ పడ్డారు. గుండెలో నొప్పి అని ఒకసారి.. కడుపునొప్పి అంటూ ఇంకోసారి.. కేన్సర్‌ కావచ్చునని మరోసారి వైద్యులను టెన్షన్‌ పెట్టారు. చివరకు.. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తేల్చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ను, వారి కుటుంబసభ్యులను తీవ్ర పదజాలాలతో దూషించిన కేసులో పోసానికి కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించింది. తనకు గుండెలో నొప్పిగా ఉందని శనివారం మధ్యాహ్నం జైలు సూపరింటెండెంట్‌ మల్‌రెడ్డికి తెలియజేశారు. వెంటనే పోసానిని రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో స్వల్ప తేడా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ గుండెలో నొప్పిగా ఉన్నదంటే పరీక్షలు చేశారు. అంతా నార్మల్‌గా ఉందని తేలింది. స్కానింగ్‌లో కిడ్నీలో చిన్న సైజు రాయి ఉన్నట్టు గుర్తించారు. అది మాత్రలతో కరిగిపోతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల కేన్సర్‌ ఉందనే అనుమానంతో టెస్ట్‌ చేయించుకున్నానని, మళ్లీ చెకప్‌ చేయాలనగా, వైద్యులు టెస్ట్‌లు చేసి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని తేల్చారు. ఇలా మూడు గంటలకుపైగా పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఉంచి వైద్యసేవలు అందించాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చడంతో.. తిరిగి రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. కడుపునొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటే కడప రిమ్స్‌కు తీసుకువెళ్లామని, అతనికి ఆరోగ్య సమస్యలేమీ లేవని వైద్యులు చెప్పారని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కేవలం నాటకం ఆడారని విమర్శించారు. కాగా, శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సబ్‌జైలుకు వచ్చి పోసానిని ములాఖత్‌లో కలిశారు. రెండు ములాఖత్‌ల పరిమితి ముగియడంతో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులును అనుమతించలేదు. దీంతో ఆయన సబ్‌జైలు వద్ద హల్‌చల్‌ సృష్టించారు.

Updated Date - Mar 02 , 2025 | 03:23 AM