COLLECTORATE: కలెక్టరేట్‌లో కలకలం
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:02 AM
సమస్యపై అధికారులు పదేపదే ఫిర్యాదు చేస్తున్నా.. పరిష్కరించకపోవడంతో విసిగిపోయిన బాధితులు కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఓ యువకుడు ఒంటిపై కిరోసిన పోసుకుని, నిప్పంటించుకునేందుకు యత్నించాడు.

పురుగు మందు డబ్బాతో వృద్ధ దంపతుల రాక..
అడ్డుకున్న పోలీసులు
పుట్టపర్తిటౌన, జనవరి27(ఆంధ్రజ్యోతి): సమస్యపై అధికారులు పదేపదే ఫిర్యాదు చేస్తున్నా.. పరిష్కరించకపోవడంతో విసిగిపోయిన బాధితులు కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఓ యువకుడు ఒంటిపై కిరోసిన పోసుకుని, నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు అడ్డుకుని, స్టేషనకు తరలించారు. వృద్ధ దంపతులు పురుగు మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చారు. తనిఖీ చేస్తున్న పోలీసులు గుర్తించి, అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలకలం రేగింది.
ఒంటిపై కిరోసిన పోసుకుని..
పరిగి మండలం గౌరవహళ్లి గ్రామానికి చెందిన సోముశేఖర్.. తల్లి గంగమ్మను వెంటబెట్టుకుని కలెక్టర్ టీఎస్ చేతనకు ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. కార్యాలయం బయటే ఒంటిపై కిరోసిన పోసుకున్నాడు. పోలీసులు అప్రమత్తమై సోముశేఖర్‌ను వారించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి పరిస్థితి వివరించారు. బాధితులు మాట్లాడుతూ.. తమకు తెలియకుండా తమ భూమిని గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా రికార్డుల్లో ఎక్కించుకున్నారని, ఇందుకు స్థానిక రెవెన్యూ అధికారులు సహకరించారని కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
పురుగు మందు డబ్బాతో..
ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లికి చెందిన పెద్దన్న, ఆయన భార్య తమ భూమిని బంధువులు కబ్జా చేశారని ఫిర్యాదు చే యడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. కార్యాలయం బయట తనిఖీ చేస్తున్న పోలీసులకు వృద్ధ దంపతుల సంచిలో పురుగు మందు డబ్బా దొరికింది. తమకు న్యాయం చేయకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చామని వారు తెలిపారు. కలెక్టర్ వద్దకు పోలీసులు వారిని తీసుకెళ్లారు. వారి సమస్య విన్న కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
196 అర్జీలు..
ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 196 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి, పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డీపీఓలో..
పుట్టపర్తిరూరల్: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 67 అర్జీలు అం దాయి. వాటిని ఎస్పీ రత్న స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోనలో మాట్లాడి చట్టపరిధిలో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.