Share News

Deo Office : పరీక్షల విభాగం భ్రష్టు..!

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:31 AM

జిల్లా విద్యాశాఖలోని పరీక్షల విభాగం భ్రష్టుపట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. డీఈఓను బేఖాతరు చేస్తూ.. ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి పరీక్షల విభాగాన్ని స్వతంత్ర వ్యవస్థలాగా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన మోనార్క్‌ వైఖరి, అడ్డగోలు వ్యవహారాలు, ఇష్టారాజ్య నిర్ణయాలు, గ్రూప్‌ రాజకీయాలతో పరీక్షల విభాగం నిర్వీర్యమైందని అంటున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజిలేటర్లు, సీఎస్‌, డీఓల నియామకం, స్పాట్‌ డ్యూటీలు.. ఇలా ప్రతి అంశంలోనూ ఏటా వివాదాలు ...

Deo Office : పరీక్షల విభాగం భ్రష్టు..!
The old DEO office where the examinations department was located

విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం

సీనియర్లను కాదని.. జూనియర్లకు..

గ్రూపు రాజకీయాలు.. అక్రమాలు

ఓ ఉన్నతాధికారి

వ్యవహారంతో సమస్యలు

కమిషనరేట్‌..

ఆర్జేడీ లోతైన దర్యాప్తు..?

అనంతపురం విద్య, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖలోని పరీక్షల విభాగం భ్రష్టుపట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. డీఈఓను బేఖాతరు చేస్తూ.. ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి పరీక్షల విభాగాన్ని స్వతంత్ర వ్యవస్థలాగా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన మోనార్క్‌ వైఖరి, అడ్డగోలు వ్యవహారాలు, ఇష్టారాజ్య నిర్ణయాలు, గ్రూప్‌ రాజకీయాలతో పరీక్షల విభాగం నిర్వీర్యమైందని అంటున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజిలేటర్లు, సీఎస్‌, డీఓల నియామకం, స్పాట్‌ డ్యూటీలు.. ఇలా ప్రతి అంశంలోనూ ఏటా వివాదాలు తలెత్తుతున్నాయి. అనుభవజ్ఞులైన హెచఎంలను కాకుండా జూనియర్ల నియమించడం వల్లే పరీక్షలు పరిహాసంగా మారుతున్నాయి. రాయదుర్గంలో


పది ఓపెన పరీక్షల్లో హిందీ ప్రశ్నాపత్రం గల్లంతు కావడం దీనికి నిదర్శం. ఈ వ్యవహారాలపై కమిషనరేట్‌, ఆర్‌జేడీ లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆ విభాగం ప్రక్షాళన ఖాయమని పలు ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

గ్రూప్‌ రాజకీయాలు

జిల్లా పరీక్షల విభాగాన్ని కొన్నేళ్లుగా గ్రూప్‌ రాజకీయాలు శాసిస్తున్నాయి. ఆ విభాగంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి తన చెప్పు చేతుల్లో ఉన్న టీచర్లకు పెద్ద పీట వేస్తున్నారు. వారికి కీలకమైన పరీక్షల విధులు వేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొందరిని గ్రూపులుగా విభజించి, చక్రం తిప్పుతున్నారని ప్రచారం ఉంది. ప్రతిచోటా తనవాళ్లు ఉంటే.. ఎక్కడ ఏం జరిగినా బయటకు పొక్కదని ఆయన ఆలోచన అంటున్నారు. పరీక్షల డ్యూటీలు వేసే క్రమంలో విద్యాశాఖను పక్కకు నెట్టేసి తన సొంత నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఫలితంగా ఇన్విజిలేటర్ల డ్యూటీల్లో గందరగోళం నెలకొంటోంది. అంధులు, విశ్రాంత ఉపాధ్యాయులకూ విధులు కేటాయించిన చరిత్ర ఉంది. డబుల్‌ ఆర్డర్లు కూడా ఇచ్చారు. ఈ డ్యూటీ వేసే ఫైల్‌ సైతం డీఈఓ ఆఫీ్‌సలో సంబంధిత సెక్షనకు వెళ్లకుండా పై స్థాయిలోనే నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగంలోని ఒక ఉన్నతాధికారి పరీక్షల విభాగంలో ఇతరుల ప్రమేయం ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అంతా తానే అంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

జూనియర్లకే పగ్గాలు

విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకం. అలాంటి ముఖ్యమైన పరీక్షల విధులకు సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను సీఎస్‌, డీఓలుగా నియమించాలి. ఇతర విధుల్లో సైతం వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ కొంతకాలంగా పరీక్షల విభాగానికి సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను దూరం చేశారు. జూనియర్లను, అనుభవం లేని టీచర్లను సీఎస్‌, డీఓలుగా నియమించారు. రాయదుర్గంలో ప్రశ్నాపత్రాల బండిల్‌ మిస్సింగ్‌కు ఇదే కారణమని స్పష్టమవుతోంది. రాయదుర్గంలో నాలుగు ఓపెన పరీక్ష కేంద్రాలు ఉండగా.. సీఎస్‌, డీఓ, సిట్టింగ్‌ స్క్వాడ్‌గా సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను వేయకుండా ఎస్‌జీటీలు, పీడీలు, లాంగ్వేజ్‌ పండిట్లను నియమించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

డీఈఓ దృష్టి పెట్టకుంటే..

పరీక్షల వ్యవహారాన్ని ఆ విభాగం ఉన్నతాధికారికే వదిలేసినా.. పది పరీక్షలపై డీఈఓ శ్రద్ధ పెట్టకుంటే ఇబ్బందులు తప్పేలా లేవని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు ఆది నుంచి అంటున్నారు. 2019లో ఇష్ట్టారాజ్యంగా 10వ తరగతి డ్యూటీలు వేయడంతో అప్పటి కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. ఒక జాయింట్‌ డైరెక్టర్‌తో విచారణ చేయించడంతో అక్రమాలు నిజమని తేలాయి. తెరవెనుక వ్యవహారం నడిపించి, పరీక్షల విభాగంలోని ఒక అధికారి తెలివిగా తప్పించున్నారు. కానీ అప్పటి డీఈఓ బలి అయ్యారు. అప్పటి డీఈఓను నాటి కమిషనర్‌ సరెండర్‌ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి అక్రమాలు, పొరపాట్లే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా విద్యాశాఖ కమిషనరేట్‌, ఆర్‌జేడీ క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నారు. పరీక్షల విభాగంలోని ఓ ఉన్నతాధికారి వైఖరిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల విభాగం ప్రక్షాళన ఖాయమని భావిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2025 | 12:31 AM