AP Drone Surveillance: నేరాలపై డ్రోన్ కన్ను
ABN, Publish Date - Apr 07 , 2025 | 04:04 AM
నేరాల నిరోధం, ట్రాఫిక్ పర్యవేక్షణలో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని పోలీసులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. విజయవాడలో విజయవంతమైన ప్రయోగంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం

ఇప్పటికే బెజవాడ సహా పలుచోట్ల వినియోగం
రాష్ట్రవ్యాప్త విస్తరణకు పోలీసు శాఖ ప్రణాళిక
ట్రాకింగ్, నావిగేషన్, సెన్సర్లు వంటి ఆధునిక
సాంకేతికతతో నేరాల కట్టడిలో సహకారం
ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుల్లోనూ..
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం
గత జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 75 వేలు ఏర్పాటు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో నేరాల కట్టడికి పోలీసు శాఖ నడుం బిగించింది. ఇందుకు అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలో చెప్పుకోవాల్సింది.. డ్రోన్ డేగ! ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణ నుంచి బహిరంగంగా మద్యపానం సేవించడం, పేకాట, అనుమానాస్పద కార్యకలాపాలు వంటి నేరాల కట్టడికి, శాంతి భద్రతల నిర్వహణకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో అమలవుతున్న దీన్ని.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా 187 డ్రోన్లను వినియోగిస్తోంది. 4,489 బందోబస్తు డ్యూటీల్లో ఇవి సేవలందించాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెజవాడ పోలీసులు ట్రాఫిక్ పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగంలోకి తెచ్చారు. ట్రాకింగ్‌తోపాటు అధునాతన నావిగేషన్ వంటి టెక్నాలజీతో కూడిన ఈ వ్యవస్థ.. మంచి ఫలితాలను అందిస్తోంది. 4 నెలల క్రితం విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు డ్రోన్లను ప్రారంభించి, కమిషనరేట్ పరిధిలోని 28 పోలీసుస్టేషన్లకు అందించారు. నగరంలో ఏ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అయినా వెంటనే ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలోని డ్రోన్లు గాల్లోకి లేస్తాయి. ఆ ప్రాంతానికి చేరుకుని ఏదైనా వాహనం బ్రేక్ ఫెయిలైందా.? లేదా యాక్సిడెండ్ జరిగిందా? వానకు చెట్టు కూలి రోడ్డుపై పడిందా? అనేది గుర్తించి.. ఆ దృశ్యాలను విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్‌కు పంపుతుంది. తక్షణమే ట్రాఫిక్ పోలీసుల్ని రంగంలోకి దించి వాహనాలను దారి మళ్లించి మార్గం చూపిస్తారు. దీంతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని ప్రతి రోజూ పదుల సంఖ్యలో గుర్తించి చలానాలు రాస్తున్నారు. పదేపదే ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయించేలా ఆర్టీవోకు సిఫారసు చేస్తున్నారు.
పరుగులు పెట్టినా.. వదలదు!
నేరం జరిగాక పోలీసులు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కన్నా ముందస్తు అప్రమత్తతతో నేరాల్ని నివారించడంలో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఊరి చివర పాడుబడ్డ భవనాలు, పండ్ల తోటల్లో చేరి ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, పేకాట ఆడుతున్నా.. ఇతర అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నా.. సమాచారం అందిన నిమిషాల్లోనే డ్రోన్లు ఆ ప్రాంతాలకు చేరుకుంటాయి. వాటిని చూసి పరుగులు పెట్టినా వారి ముఖాల్ని డ్రోన్లు గుర్తిస్తాయి. మాస్క్‌లు, ముసుగులు వేసుకుని కొందరు అతి తెలివితో పరుగులు పెట్టినా జేబులో ఉన్న మొబైల్ నెంబర్‌ను ట్రాక్ చేసి పట్టేస్తున్నారు.
తాగుబోతుల వీరంగంపై నిఘా
కొందరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ.. అటువైపు వెళ్లే వారికి అసౌకర్యం కలిగిస్తుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత 3 నెలల్లోనే విజయవాడ, విశాఖపట్నంలో ఏకంగా 2,151 కేసులు దీనిపై నమోదవడం డ్రోన్ల పనితీరు ఫలితాలకు నిదర్శనం. పబ్లిక్ న్యూసెన్స్, ఈవ్ టీజింగ్, డ్రగ్స్ వినియోగం, ఇతరత్రా నేరాలకు సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి.
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలే లక్ష్యం
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది పోలీసు వ్యవస్థ లక్ష్యం. గత జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 75,749 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. జూన్ నాటికి లక్ష ఏర్పాటు చేయాలనేది టార్గెట్. ప్రతి గ్రామంలో కనీసం మూడు సీసీ కెమెరాలు పెట్టాలని భావిస్తోంది. ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో హోంమంత్రి అనిత సీసీ కెమెరాలు ప్రారంభించారు.
గతంలో లాఠీ.. ఇప్పుడు డేటా.. ఇకపై ఏఐ
పోలీసింగ్‌లో ప్రధానంగా వినిపించే మాట లాఠీ. అయితే ఇప్పుడు డేటా ప్రధాన పాత్ర పోషిస్తోంది. డ్రోన్లు అందించే దృశ్యాల నుంచి సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించడం తేలికవుతోంది. ఇటీవల మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో 100 మందికి పైగా 7 నుంచి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. రానున్న కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెంచుతాం. ఇప్పటికే ఏలూరులో ప్రారంభమైంది. దీన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం.
- హరీశ్ కుమార్ గుప్తా, డీజీపీ
Updated Date - Apr 07 , 2025 | 04:07 AM