AP Justice Rank: న్యాయాన్ని అందించడంలో టాప్-2లో ఏపీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:23 AM
న్యాయ సేవల అందుబాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచి గొప్ప ప్రదర్శన కనబరిచింది కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది

అగ్రస్థానంలో నిలిచిన కర్ణాటక
మూడు, నాలుగు స్థానాల్లో తెలంగాణ, కేరళ
వెల్లడించిన ఇండియా జస్టిస్ రిపోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మెరుగైన పోలీస్ వ్యవస్థ, జైళ్ల నిర్వహణ, న్యాయాన్ని అందించడంలో మన రాష్ట్రం.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. తెలంగాణ, కేరళ, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శాంతిభద్రతలు, మెరుగైన న్యాయవ్యవస్థ, జైళ్ల యాజమాన్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్ చివరి స్థానంలో ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడించింది. గత సర్వేలో 11వ స్థానాన్ని పొందిన తెలంగాణ, ఈ ఏడాది మూడో స్థానం దక్కించుకుంది. గతంలో ఐదో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు రెండో స్థానానికి వచ్చింది. కర్ణాటకకు 1-10 స్కోరులో 6.78 దక్కగా, ఏపీ 6.32, తెలంగాణ 6.15 స్కోర్ దక్కించుకున్నాయి. కింది కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ న్యాయమూర్తుల నియమాకాల్లో ఏపీ ముందంజలో ఉంది. ఏపీ పోలీస్ సిబ్బందిలో 21.5 శాతం మహిళలు ఉండగా, జైలు సిబ్బందిలో 8.4 శాతం మంది ఉన్నారు. కింది కోర్టుల్లో 50.9 శాతం మహిళా న్యాయాధికారులు ఉండగా, హైకోర్టులో 16.7 శాతం ఉన్నారు. ఏపీ హైకోర్టులో 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులు 22.5శాతం, 10-20 ఏళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్న కేసులు 26.7 శాతం ఉన్నాయి.