Share News

AP CM: ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచండి

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:42 AM

ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం సమయంలో దరఖాస్తుదారుకు స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు

AP CM: ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచండి

పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు తెలియజేయాలి

పరిష్కరించిన వాటికి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి

గ్రీవెన్స్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

90 శాతం ఫిర్యాదులు మూడు శాఖల్లోనే..

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో వేగాన్ని పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం గ్రీవెన్స్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారునికి గ్రీవెన్స్‌ స్థితిని వివరించాలన్నారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తి చేయాలని, పరిష్కరించలేనివి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో దరఖాస్తుదారునికి స్పష్టంగా, సున్నితంగా, అర్థమయ్యేలా వివరించాలని నిర్దేశించారు. పరిష్కరించలేని వినతుల విషయంలో అధికారుల వ్యవహార శైలి సౌమ్యంగా లేనప్పుడు ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని గుర్తించాలన్నారు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరు తప్పనిసరిగా తీసుకోవాలని, తద్వారా నకిలీ ఫిర్యాదులను, అధికార యంత్రాంగాన్ని తపుదోవపట్టించేవాటిని నివారించవచ్చని స్పష్టం చేశారు. వ్యవస్థను దుర్వినియోగపరిచేలా, యంత్రాంగాన్ని దారి మళ్లించేలా చేసేవారిపై చర్యలు తీసుకునేలా వివరాలను సమీకరించాలని ఆదేశించారు. వినతులు పరిష్కరించిన తర్వాత దరఖాస్తుదారుని నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నారు. వారి సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకుని భవిష్యత్తులో అమలు చేయాలని నిర్దేశించారు. జిల్లా కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదుదారుతో మాట్లాడాలని, దీనిద్వారా జిల్లాలో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏమిటో కలెక్టర్లకు అర్థమవుతాయని చంద్రబాబు చెప్పారు.


90% రెవెన్యూ, పోలీసు, మునిసిపల్‌ శాఖల్లోనే..

రెవెన్యూ, పోలీసు, మునిసిపల్‌ శాఖల్లో 90 శాతం ఫిర్యాదులు ఉంటున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం రీ-సర్వేలో నిబంధనలను ఉల్లంఘించడంతో భూసంబంధిత ఫిర్యాదులు భారీగా పెరిగాయన్నారు. రికార్డుల్లో భూయజమాని పేరు మారిపోవడం, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో పేర్లను మార్చేయడం వల్ల సమస్యలు పెరిగాయని చెప్పారు. విస్తీర్ణంలో తేడాలు రీసర్వేలో బాగా కనిపించాయన్నారు. పోలీసు శాఖకు సంబంధించి ఆస్తి తగాదాలు, ఆర్థిక నేరాలతో కూడిన ఫిర్యాదులు అత్యధికంగా వస్తున్నాయని చెప్పారు. సైబర్‌ క్రైమ్‌ పెరిగిపోయిందని, ఈ మోసాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపల్‌ శాఖలో ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, అనధికార నిర్మాణాలు, ఆస్తి పన్నుల ఫిర్యాదులు అధికంగా ఉన్నాయన్నారు. వీటన్నింటిపైనా అప్రమత్తంగా వ్యవహరిస్తూ సాధ్యమైనంత త్వరగా వినతులు పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 05:42 AM