AP Deputy CM Pawan Kalyan : ఆర్నెల్లలోనే కేంద్రం భారీ సాయం
ABN, Publish Date - Jan 20 , 2025 | 03:11 AM
రాష్ట్రానికి ఆర్నెల్లలోనే భారీ సాయం అందించిందంటూ కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్రాన్ని ఎన్డీయే కూటమి కాపాడుతోంది
ప్రతి పంచాయతీలోనూ ‘విపత్తు’ బృందాలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే, ఎన్డీయే కూటమి రాష్ట్రాన్ని కాపాడుతోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చుంటే ఆ విపత్తును ఊహించుకోలేం.
- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఆర్నెల్లలోనే భారీ సాయం అందించిందంటూ కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబుతో కలసి ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణ గ్రామ స్థాయిలో జరగాలని, ప్రతి పంచాయతీ పరిధిలో అత్యవసర సమయంలో స్పందించే బృందాలు అవసరమన్నారు. అమిత్ షా సూచన మేరకు పంచాయతీరాజ్ దీనిపై పటిష్ఠ కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. విశాలమైన సముద్ర తీరం గల ఏపీలో కేంద్రం విపత్తుల నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో మన తీర ప్రాంతవాసులకు భరోసా దక్కినట్లేనన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో దుర్ఘటన, అచ్యుతాపురం సెజ్‌లో అమ్మోనియా లీకేజీ ప్రమాదం, విజయవాడను ముంచెత్తిన వరదల్లో ఎన్డీఆర్‌ఎఫ్ కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. మనుషులతో పాటు మూగజీవాలను సైతం కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ రెండు దశాబ్దాల్లో 18 వేల రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడ వరదల్లో సేవలందించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడ స్థలం కేటాయిస్తే, నరేంద్ర మోదీ నిధులిచ్చి భవనాల నిర్మాణంతో అభివృద్ధి చూపించారన్నారు.
Updated Date - Jan 20 , 2025 | 03:11 AM