Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:59 PM
Botsa Satyanarayana: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచారు. అలాగే ఎంపీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రజల మధ్యకు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇచ్చారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 02: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకో లేదని ఆయన విమర్శించారు. ఆదివారం విశాఖపట్నంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ తీరు చూస్తే.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఉందన్నారు.
రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలో సైతం కూటమి ప్రభుత్వమే కొలువు తీరిందని.. కానీ నిధులు కేటాయింపులో ఏపీకి మాత్రం అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన చెందారు.
గత వైసీపీ ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆ దిశగా అడుగులు వేశామని ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అలాగే నాడు - నేడు కార్యక్రమం కింద ఎన్నో పాఠశాలలను సైతం అభివృద్ధి పరిచామని వివరించారు. కానీ సంపద సృష్టిస్తామని సీఎం చంద్రబాబు మాటలు ఏమయ్యాయి? సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ? అంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ ఏడాదికి రైతు భరోసా, అమ్మకు వందనం లేనట్టే.. మూడు సిలిండర్లకు ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విరుచుకు పడ్డారు. అయితే వైఎస్ జగన్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని స్పష్టం చేశారు. కానీ ఒక నెల అటు, ఇటుగా ఆయన ప్రజల మధ్యకు వస్తారన్నారు. అంతే తప్పా.. అందులో ఇబ్బంది ఏమీ లేదన్నారు. గతంలో తాము కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇచ్చామని ఈ సందర్బగా ఆయన పేర్కొన్నారు.
Also Read: వసంత పంచమి.. ఇలా చేయండి చాలు
ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని విశాఖపట్నం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఎందుకు చెప్పలేదంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని బొత్స సూటిగా ప్రశ్నించారు. అయితే స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటించిన ప్యాకేజీపై తమకు పలు అనుమానాలున్నాయని ముందే చెప్పామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే విజయ సాయి రెడ్డి రాజీనామాపై బొత్స స్పందించారు. వ్యక్తులకు ఆలోచనలు ఉంటాయన్నారు.
ఆ ఆలోచన ప్రకారమే వారు చేస్తారని చెప్పారు. ఆ క్రమంలో ఆయన ఆలోచన ప్రకారం విజయసాయిరెడ్డి రాజీనామా చేశారన్నారు. అందులో తప్పేముందంటూ అధికార పార్టీ నేతలకు ఎదురు ప్రశ్నించారు. తన ఉద్దేశంలో విజయ సాయి రెడ్డి రాజీనామా మీద డిస్కషన్ చేయవలసినంత పెద్ద అంశం అయితే కాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆయనను తాను కించపరచడం లేదన్నారు. అలాగని తాను పొగడడం లేదంటూ బొత్స సత్యనారాయణ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
For Andhrapradesh News And Telugu News