Share News

శ్రీసిటీ పరిధిలో ఆస్తిపన్నుపై పంచాయతీలకు 50 శాతం వాటా

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:41 AM

శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. శ్రీసిటీ పరిధిలో ఇకనుంచి చేపట్టే ఆస్తిపన్ను వసూళ్లలో 50 శాతం వాటా సంబంధిత పంచాయతీలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

శ్రీసిటీ పరిధిలో ఆస్తిపన్నుపై పంచాయతీలకు 50 శాతం వాటా

15 గ్రామ పంచాయతీలకు తీపి కబురు

తిరుపతి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. శ్రీసిటీ పరిధిలో ఇకనుంచి చేపట్టే ఆస్తిపన్ను వసూళ్లలో 50 శాతం వాటా సంబంధిత పంచాయతీలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2004-09 నడుమ అప్పటి చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లాకు చెందిన తడ మండలాల పరిధిలో శ్రీసిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. సత్యవేడు మండలానికి చెందిన ఏడు, వరదయ్యపాలెం మండలానికి చెందిన ఆరు, తడ మండలానికి చెందిన రెండు చొప్పున మొత్తం 15 పంచాయతీల పరిధిలో శ్రీసిటీకి భూములు కేటాయించారు. ఆ గ్రామాలు, భూములకు సంబంధించిన రికార్డులు ఇతర అంశాల నియంత్రణ అధికారాలను 2009 ఫిబ్రవరి 21న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పంచాయతీల నుంచి తొలగించి శ్రీసిటీ ఐలాకు అప్పగించింది. ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీగా పిలిచే ఈ విభాగం ఏపీఐఐసీ పరిధిలో ఉండి సంబంధిత పంచాయతీల విధులు, బాధ్యతలు, అధికారాలు చెలాయిస్తుంది. ఆ సందర్భంగా శ్రీసిటీ పరిధిలో ఐలా వసూలు చేసే ఆస్తి పన్నులో పంచాయతీలకు ఎంత వాటా చెల్లించాలనే విషయాన్ని ప్రస్తావించలేదు. దీనిపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. శ్రీసిటీ పరిధిలో ఐలా వసూలు చేసే ఆస్తి పన్నులో 65 శాతం వాటా ఐలాకు, మిగిలిన 35 శాతం ఆయా పంచాయతీలకు కేటాయించాలని ఆ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 17న పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీసిటీ పరిధిలోని గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి, అభివృద్ధి కోసం ఆస్తి పన్నులో 50 శాతం వాటా కేటాయించాలని అభ్యర్థించారు. ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం శ్రీసిటీ ఐలా వసూలు చేసే ఆస్తిపన్నులో 50 శాతం ఐలాకు, 50 శాతం పంచాయతీలకు వాటాలుగా నిర్ణయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచీ శ్రీసిటీ పరిధిలోని 15 పంచాయతీలకు ఆర్థికంగా గణనీయమై లబ్ధి చేకూరనుంది. శ్రీసిటీ పరిధిలోని తడ, సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలు మూడు ఇపుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

లబ్ధి కలిగే పంచాయతీలు

సత్యవేడు మండలం: ఇరుగుళం, చెరివి, చిగురుపాలెం, ఆరూరు, అప్పాయపాలెం, మల్లావారిపాలెం ఈస్ట్‌, మాదనపాలెం

వరదయ్యపాలెం మండలం: చిలమత్తూరు, తొండూరు సొసైటీ, మత్తేరి మిట్ట, బత్తలవల్లం, అగ్రహారం, మోపూరుపల్లి

తడ మండలం: తడ, పూడి

Updated Date - Apr 12 , 2025 | 01:41 AM