TDP: అభివృద్ధి మంత్రం.. పార్టీ శ్రేణులకు దూరం!
ABN, Publish Date - Jan 09 , 2025 | 03:06 AM
‘నేను నాయకులను చూడడానికి రాలేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను.’ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో చెప్పిన ఈ మాటను ఆయన మూడ్రోజుల పర్యటనలో నిజం చేశారు. అభివృద్ధే అజెండాగా ఆయన పర్యటన ఆద్యంతం సాగింది. పర్యటనల్లోకంటే భిన్నంగా పార్టీ శ్రేణులను ఈసారి చంద్రబాబు దూరం పెట్టారు. ప్రభుత్వాధికారులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతోనే పూర్తిగా మమేకం అయ్యారు.

కుప్పం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా. ఆయన ఈ రెండు హోదాల్లో మాత్రమే ఈసారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. పేరుకు మూడ్రోజుల పర్యటన అయినా, ఆయన పాల్గొన్న కార్యక్రమాలు ఈనెల 6, 7 తేదీల్లోనే ముగిసిపోయాయి. మూడో రోజైన బుధవారం శాంతిపురం మండలం కడపల్లె వద్ద నిర్మాణంలో స్వగృహాన్ని పరిశీలించాలని, కుప్పం మున్సిపాలిటీలలో ఆకస్మిక తనిఖీలు చేయాలని అనుకున్నారు కానీ, అది సాగలేదు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరు.. అక్కడినుంచి విశాఖపట్టణం బయల్దేరి వెళ్లిపోయారు. ఈసారి తన పర్యటనలో పార్టీ నేతగాకాక పక్కా ప్రభుత్వాధినేతగానే వ్యవహరించారు. 6వ తేదీన అతి ముఖ్యమైన సౌర విద్యుత్తు ప్రాజెక్ట్‌ను నడిమూరులో ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం విస్తరించనున్న ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు ఉచిత విద్యుత్తు అందనుంది. స్వర్ణకుప్పం విజన్ డాక్యుమెంట్ 2029ను ఆవిష్కరించి, పది అంశాలతో కూడిన అభివృద్ధిని కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వాగ్దానం చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి, సంబంధిత రైతులతో మాట్లాడడమే కాకుండా ఆమేరకు విజన్ 2029ను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. 7వ తేదీన అసలైన కుప్పం అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. తొలుత టీడీపీ కార్యాలయంలో జన నాయకుడు పోర్టల్ ప్రారంభించడమేకాక, ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఏకంగా 550 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. అలీప్, మదర్ డెయిరీ, శ్రీజ డెయిరీ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు కుప్పం రానున్నాయి. అలాగే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. కుప్పం అభివృద్ధితోపాటు స్థానికుల ఆరోగ్యం, ఆదాయం, ఆనందమే ప్రధాన ధ్యేయంగా సాగిన ముఖ్యమంత్రి పర్యటన ఆ కోణంలో పూర్తిగా విజయవంతమైంది.
కడాకు ప్రశంసలు
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రెండోసారి కుప్పంలో సాగిన పర్యటన ఇది. అలాగే గత ఐదేళ్ల విధ్వంస పాలన తర్వాత కుప్పం అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి కుప్పం డెవల్‌పమెంట్ అథారిటీ (కడా) ఏర్పాటు చేశాక మొదటి పర్యటన కూడా ఇదే. యువ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను కడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈ పర్యటనలో రుజువైంది. పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు తమ పరిశ్రమలను కుప్పంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంలో కడా తరఫున పీడీ విశేష కృషి చేశారు. కలెక్టర్ మద్దతుతో, ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రతిష్ఠాత్మకమైన సంస్థల ప్రతినిధులను ఈ మారుమూల కుప్పానికి రప్పించి ఎంవోయూలు కుదర్చడంలో వికాస్ మర్మత్ పాత్ర గణనీయంగా ఉంది. పీడీ కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి.. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమ వేదిక మీదినుంచే ప్రశంసించారు. ‘కడా చాలా బాగా చేసింది. వారికి నా అభినందనలు’ అంటూ కితాబునిచ్చారు. ఈ ప్రశంసలు భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలను కుప్పం రప్పించి, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగపరచడానికి కడా పీడీ వికాస్ మర్మత్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
పార్టీ శ్రేణులకు కాస్త దూరం
చంద్రబాబు ఈసారి కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేతగా నేతలను మందలించడానికే పరిమితం అయ్యారు. సోలరైజేషన్ కార్యక్రమం సందర్భంగా కుప్పం మండలం నడిమూరులో ఏర్పాటు చేసిన సభలో పార్టీ కండువాలు, ట్యాగ్‌లు తీసేయమంటూ కుప్పం ఎంపీడీవో.. టీడీపీ కేడర్‌కు విజ్ఞప్తి చేయడం కార్యకర్తల్లో అసహనానికి దారితీసింది. రెండో రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీడీవో ప్రవర్తనను ముఖ్యమంత్రి ఖండించారు. కార్యకర్తలే తనకు ముఖ్యమని ప్రకటించారు. తొలిరోజున ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశమైనా.. రెండ్రోజులపాటు అభివృద్ధి కార్యక్రమాలలో వారికి విశేష ప్రాధాన్యం అయితే ఇవ్వలేదు.
అలుపెరగని నేత
సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ ఎప్పటిలాగే అర్ధరాత్రుళ్ల వరకు సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. తొలి రోజు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ద్రావిడ హెలిపాడ్‌కు చేరుకోగా.. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. రెండోరోజు కూడా అదే రీతిలో సాగింది. జన నాయకుడు పోర్టల్ ప్రారంభ సమయంలో అయితే ఒక్కో అంశాన్ని సిబ్బందిని అడిగి ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. సమస్యలున్నవారితో వ్యక్తిగతంగా మాట్లాడి న్యాయం చేశారు. ఎక్కడా కాసింత అలసట కూడా లేకుండా ఎప్పటిలాగే ఆయా అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆయన ఓపిక, ఆయా అంశాల మీద లోతుగా ఉన్న అవగాహన, వివరిస్తున్న తీరు, భవిష్యత్తుపై ఉన్న విజన్‌లను చూసి ఉన్నతాధికారులు, ఆయా కంపెనీల సీఈవోలు సైతం ఆశ్చర్యపోయారు. వారంతా అలసిపోతున్నా.. ఈయన మాత్రం అలుపు లేకుండా పర్యటించారు.
‘నామినేటెడ్’ సందడి
త్వరలో నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మడి జిల్లా నాయకులు ఎగబడ్డారు. ఫలానా నియోజకవర్గంలో.. ఫలానా ఏళ్లుగా కష్టపడుతున్నానని.. ఫలానా పదవి తనకు ఇవ్వాలని వినతులు అందించారు. తొలి రోజు ఇన్‌చార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్‌రెడ్డి, గురజాల జగన్మోహన్, గాలి భానుప్రకాష్, మురళీమోహన్, థామస్, ఆదిమూలం, పార్లమెంట్ అధ్యక్షుడు సీఆర్ రాజన్.. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఏఎస్ మనోహర్, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ తదితరులు కలిసి హెలిపాడ్‌లో సీఎంకు స్వాగతం పలికారు. తొలి రోజు తొలి కార్యక్రమం ‘స్వర్ణ కుప్పం విజన్- 2029’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన ఆయన.. జిల్లా ఎమ్మెల్యేల్ని వేదిక మీద కూర్చోబెట్టారు. సీఎం నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ ఎంపీ దగ్గుమళ్ల, ఎమ్మెల్సీ కంచర్ల వెంటే ఉన్నారు.
డీఐజీ, ఎస్పీసహా రెండు జిల్లాల పోలీసులు
సీఎం ప్రతి కార్యక్రమంలో ఆయన సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ప్రద్యుమ్న, కలెక్టర్ సుమిత్‌కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్ పక్కనే ఉన్నారు. అడుగడుగునా సీఎం వారిలో ఎవరినో ఒకర్ని పిలిచి ఆయా పనుల్ని అప్పగించేవారు. అనంతపురం డీఐజీ షెమోషి, ఎస్పీ మణికంఠ, ఏఎస్పీ రాజశేఖర్ రాజు సీఎం మూడు రోజుల పర్యటనలో అక్కడే ఉండి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి పెద్దఎత్తున పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 03:06 AM