Share News

పంటలపై గజరాజుల దండయాత్ర

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:39 AM

యాదమరి మండలంలోని దళవాయిపల్లె అటవీ ప్రాంతంలో తిష్ఠ వేసిన గజరాజుల గుంపు పంటలపై దండయాత్ర చేస్తోంది. ఆదివారం రాత్రి కూడా 14 ఏనుగుల గుంపు పొలాలపై పడింది.

పంటలపై గజరాజుల దండయాత్ర
ఏనుగులు తొక్కేసిన వరిపంట, ధ్వంసమైన ట్రాక్టర్‌

ట్రాక్టర్‌నూ ధ్వంసం చేశాయి

ఏనుగులను చూసి భయపడి బావిలోకి దూకిన దూడ

ఆందోళనలో రైతులు

యాదమరి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): యాదమరి మండలంలోని దళవాయిపల్లె అటవీ ప్రాంతంలో తిష్ఠ వేసిన గజరాజుల గుంపు పంటలపై దండయాత్ర చేస్తోంది. ఆదివారం రాత్రి కూడా 14 ఏనుగుల గుంపు పొలాలపై పడింది. దళవాయిపల్లె గ్రామానికి చెందిన గజేంద్ర, మనోహర, చిన్నదొరై, ప్రసాద్‌లకు చెందిన వరి, అరటి, మామిడి, రాగి పంటలపై దాడిచేశాయి. దిగుబడి వచ్చే దశలో పంటలను నాశనం చేశాయని రైతులు వాపోయారు. గజేంద్రకు చెందిన ఓ ట్రాక్టర్‌ను కూడా ధ్వంసం చేశాయి. మనోహరకు చెందిన పొలంలోకి ఏనుగుల గుంపు వచ్చినపుడు వాటిని చూసి భయపడిన ఓ పేయదూడ సమీపంలో నీళ్లు లేని 30 అడుగుల బావిలోకి దూకేసింది. ఏనుగులు వెళ్లిపోయాక గాయపడ్డ దూడను గ్రామస్తులు బావిలోనుంచి అతికష్టంపై బయటకు తీశారు. ఏనుగుల వరుస దాడులతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిద్రాహారాలు మాని పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గజరాజుల గుంపును అడవిలోకి మళ్లించడానికి బాణసంచా కాల్చుతూ అటవీశాఖ ట్రాకర్లు ప్రయత్నిస్తున్నారు. ధ్వంసమైన పంటలను ఎఫ్‌బీవో ప్రతాప్‌ తన సిబ్బందితో పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల దాడుల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:39 AM