ఆరు డ్రోన్లు వచ్చాయోచ్
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:38 AM
తిరుపతి జిల్లా పోలీసు శాఖకు ఆరు డ్రోన్లు వచ్చాయి. తిరుపతి నగరం, జిల్లా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ వెంకటేశ్వర్లు పోలీస్ శాఖకు రూ.30 లక్షలు ప్రత్యేకంగా విడుదల చేశారు. వీటిలో రూ.15 లక్షలు వెచ్చించి ఆరు డ్రోన్లు కొనుగోలు చేయగా.. మిగిలిన రూ.15 లక్షలతో సీసీ కెమెరాలు కొననున్నారు.

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు శాఖకు ఆరు డ్రోన్లు వచ్చాయి. తిరుపతి నగరం, జిల్లా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ వెంకటేశ్వర్లు పోలీస్ శాఖకు రూ.30 లక్షలు ప్రత్యేకంగా విడుదల చేశారు. వీటిలో రూ.15 లక్షలు వెచ్చించి ఆరు డ్రోన్లు కొనుగోలు చేయగా.. మిగిలిన రూ.15 లక్షలతో సీసీ కెమెరాలు కొననున్నారు. కాగా, ఆదివారం పోలీసు పరేడ్ మైదానంలో ఈ డ్రోన్ల పనితీరును ఎస్పీ హర్షవర్ధనరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిధులు విడుదల చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆరు డ్రోన్లలో.. నాలుగు మ్యాట్రిస్, ఒక థర్మల్ డ్రోన్స్ కెమెరా, మరొకటి మ్యావిక్ ఎయిర్ 3ఎస్-05 కెమెరా ఉన్నాయి.మ్యాట్రిస్-4 థర్మల్ డ్రోన్ కెమెరా ఒక కిలోమీటరు ఎత్తు వరకు ఎగురుతుంది. నగరాల పరిధిలో రెండు నుంచి మూడు కిలో మీటర్ల వరకు ఖాళీ ప్రదేశాల్లో 3-4 కిలోమీటర్ల దూరం వరకు వెళుతుంది. ఇందులో థర్మల్ ఇమేజింగ్ ఉంటుంది. దీంతో 48 మెగా ఫిక్సల్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి. నైట్ మోడ్ ఎఐ కెమెరా ద్వారా హెడ్ కౌంట్, వాహనాల రాకపోకలను కౌంట్ చేస్తుంది. ఽథర్మల్ కెమెరా ద్వారా అడవుల్లోని మనుషులను, జంతువులను గుర్తించవచ్చు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు థర్మల్ కెమెరాను ఉపయోగించి మనుషులు ఎవరైనా ఉన్నారా అని గుర్తించవచ్చు. సర్వేలెన్స్, మానటరింగ్ ఆఫ్ పబ్లిక్, ట్రాఫిక్ మానిటరింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్లను ఎలా ఉపయోగించాలి, అవసరాన్ని బట్టి డేటా ఎలా సేకరించాలి అనే విషయాలపై ఇప్పటికే 40 మంది పోలీసులకు శిక్షణ ఇప్పించినట్లు ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం సీఐ వినోద్‌కుమార్, ఆర్‌ఐ రమణారెడ్డి పాల్గొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు నిర్వహిస్తే చర్యలు
జిల్లాలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో బర్త్‌డే పార్టీలు, ఇతర నిషేధిత కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధనరాజు హెచ్చరించారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు ఉంటాయన్నారు. కొత్తగా వచ్చిన ఆరింటితో పాటు మొత్తం ఏడు డ్రోన్లు పోలీసు శాఖకు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో నేరాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఓపెన్ బూజింగ్, గంజాయి విక్రయాలు, వినియోగం వంటి వాటిని నియంత్రించడానికి ఉపయోగిస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీసు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాంగ్ రూట్ కేసులు 359
జిల్లా వ్యాప్తంగా మార్చి నుంచి ఏప్రిల్ 12వ తేది వరకు రాంగ్ రూట్‌లో వచ్చిన వారిపై 359 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు ఆదివారం తెలిపారు. తద్వారా రూ.12.40 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. ఓపెన్ బూజింగ్ ద్వారా 3145 కేసులు నమోదు కాగా వీటిలో 3202 మందికి జరిమానాలు విధించామన్నారు. 11 కేసులకు సంబంధించి 119.05 కిలోల గంజాయి సీజ్ చేసి.. 26 మందిని అరెస్టు చేశామన్నారు.