పశ్చిమం సరే.. తూర్పు మాటేమిటి?
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:36 AM
శ్రీకాళహస్తి పట్టణ శివారు రాజీవ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. రోడ్డుకు పడమర వైపున 120 అక్రమ నిర్మాణాలను ఏకకాలంలో కూల్చివేసి, తూర్పు వైపునకు వచ్చే సరికి దోబోచులాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది.

శ్రీకాళహస్తి పట్టణ శివారు రాజీవ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. రోడ్డుకు పడమర వైపున 120 అక్రమ నిర్మాణాలను ఏకకాలంలో కూల్చివేసి, తూర్పు వైపునకు వచ్చే సరికి దోబోచులాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్‌నగర్ కాలనీ 2005లో ఏర్పాటైంది. 7వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. అప్పట్లో సరైన అవగాహన లేకపోవడం, బిల్లులు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు ఎవరన్నది స్పష్టత లేకపోయింది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటి కలెక్టర్ పర్యవేక్షణలో సమగ్ర సర్వే నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు రాజీవ్‌నగర్‌లో నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో కబ్జాదారుల కళ్లు ఆ స్థలాలపై పడ్డాయి. టీడీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు వారి ఆటలు సాగలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అక్రమార్కులకు రాజీవ్‌నగర్ వరంగా మారింది. ఖాళీజాగా కనిపిస్తే పాగా వేసేశారు. అడ్డు వచ్చిన లబ్ధిదారులపై దాడులకు తెగబడ్డారు. ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో పిచ్చాటూరు రహదారికి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా భవిష్యత్తు అవసరాల కోసం విస్తారంగా స్థలం వదలిపెట్టారు. వైసీపీ నేతలు రోడ్డుకు పడమర వైపున ఖాళీ స్థలాలు ఆక్రమించి, అమ్మిసొమ్ము చేసుకున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలు తొలగిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే రోడ్డుకు పడమర వైపు దౌర్జన్యంగా నిర్మించిన 120 కట్టడాలను అధికారులు కూల్చివేశారు.
అటువైపు ఆక్రమణల మాటేమిటి?
రాజీవ్‌నగర్‌లో పిచ్చాటూరు రహదారికి ఆనుకుని తూర్పువైపున అక్రమార్కులు పెద్దయెత్తున కబ్జాలు చేశారు. రోడ్డు నుంచి ఇళ్ల స్థలాలకు మధ్యలో కొంత ప్రభుత్వ భూమిని వదిలిపెట్టారు. దీనిపై కన్నేసిన వైసీపీ నేతలు అప్పటి రెవెన్యూ అధికారుల అండతో ఖాళీ స్థలాల్లో పెద్దయెత్తున దుకాణాలు నిర్మించి, విక్రయించి ఽసొమ్ము చేసుకున్నారు. పైగా ఇళ్లు కట్టుకున్న వారిని భయబ్రాంతులకు గురిచేసి స్థలాలను స్వాహా చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.