Share News

Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ .. ఆ సేవలు మళ్లీ ప్రారంభం..

ABN , Publish Date - Feb 05 , 2025 | 08:24 AM

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారినీ బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ .. ఆ సేవలు మళ్లీ ప్రారంభం..
Tirumala

తిరుమల: టీటీడీ (TTD) అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త (Good News) చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారినీ (Sarvadarshan Tokens Issued) బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. రధసప్తమి వేడుకలు ముగియడంతో తిరిగి బుధవారం రాత్రి 10 గంటల నుంచి భక్తులకు టోకెన్స్‌ను టీటీడీ అధికారులు జారి చేయనున్నారు. కాగా సప్తవాహనసేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణలు, కర్పూరహారతులు, భజన, నృత్య, వాద్య బృందాల ప్రదర్శనలతో నాలుగు మాడవీధులు మారుమోగాయి. మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి.


ఏడు వాహనాలపై ఏడుకొండల స్వామి

సప్తవాహనసేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణలు, కర్పూరహారతులు, భజన, నృత్య, వాద్య బృందాల ప్రదర్శనలతో నాలుగు మాడవీధులు మారుమోగాయి. మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి. చీకటి తెరలు వీడకముందే తెల్లవారుజామునే ఏడుకొండల స్వామి సూర్యప్రభపై బయలుదేరాడు. ఒక్కో వాహనం మీద, ఒక్కో అలంకారంలో రాత్రి దాకా భక్తులకు కనువిందు చేశాడు. చలినీ, ఎండనూ లెక్కచేయకుండా లక్షలాది మంది భక్తులు మాడవీధుల్లో శ్రీనివాసుడి దర్శనం కోసం పరితపించారు.

రథసప్తమి సంబరాలతో మంగళవారం తిరుమల కొండ కిటకిటలాడింది. సప్త వాహన సేవలను తిలకించిన భక్తజనం తన్మయులయ్యారు. వేకువజాము 5.30 గంటలకు వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనంలో విశేష అలంకరణతో మలయప్ప స్వామి బయలుదేరాడు. వాయువ్య మూలలో వేంచేసి సూర్యోదయం కోసం ఎదురు చూశాడు. సరిగ్గా 6.48 గంటలకు రవి కిరణాలు స్వామిని తాకాయి. ఆ క్షణం కోసమే గ్యాలరీల్లో ఎదురు చూసిన భక్తజనం గోవిందనామస్మరణలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఆ తర్వాత ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య చిన్నశేషవాహనం,11-12మధ్య గరుడవాహనం, మధ్యాహ్నం 1-2 మధ్య హనుమంతవాహనం నిర్వహించారు. మధ్యాహ్నం 2-3 మధ్య పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు వరాహస్వామి ఆలయం వద్ద చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. అధికారులతో పాటు భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు. తిరిగి సాయంత్రం 4-5 మధ్య కల్పవృక్ష వాహనం, 6-7 మధ్య సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య చంద్రప్రభావాహనసేవలతో ఒక్క రోజు బ్రహ్మోత్సవాలు వేడుకగా ముగిశాయి.


మాడవీధులు కిటకిట

సోమవారం సాయంత్రం గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం మొదలైంది. అర్ధరాత్రి ఉత్తరమాఢవీధి పూర్తిస్థాయిలో నిండిపోగా, మంగళవారం వేకువజామునకు పడమర, దక్షణ, తూర్పు మాడవీధులు, శ్రీవారి ఆలయం ముందు భాగం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎండకు, చలికి ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోని గ్యాలరీలపై షెడ్లు వేయడంతో ముందు రోజు సాయంత్రం నుంచీ మంగళవారం రాత్రి దాకా భక్తులు ఒక్కో వాహనాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయారు. టీటీడీ అన్నప్రసాదాలు, తాగునీరు అందించడంతో ఇబ్బందిలేకుండా గడిపారు. రాంభగీచ అతిథిగృహాల వద్ద మాత్రం యాత్రికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ గేట్లకు తాళాలు వేయడంతో అగచాట్లు పడ్డారు.

కంగారు పెట్టిన గొడుగు

చిన్నశేష వాహనంలో గొడుగు జారడం అధికారు ల్లో కంగారు పుట్టించింది. వాహనమండపం, పుష్కరి ణి మధ్యలో వాహనబేరర్లు వాహనాన్ని పైకి, కిందకు ఊపుతూ వేగంగా నడవడంతో ఉత్సవమూర్తికి ఎడమ వైపునున్న అర్చకుడి చేతి నుంచి గొడుగు కిందకు జారింది. అయితే వెంటనే అర్చకుడు అప్రమత్తమై గొడుగును పైకి ఎత్తి దాని స్థానంలో ఉంచడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్యాంకులోకి పెట్రోల్ క్యాన్లతో వచ్చిన వ్యక్తి..

జగన్‌ చేసిన భూ గాయాలు

స్వర్ణం.. సులభ రుణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 08:24 AM