CM Chandrababu P4 Program: జన్మభూమిలా పీ4

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:25 AM

ప్రధానమంత్రి చంద్రబాబు పీ4 కార్యక్రమం కింద 41 బంగారు కుటుంబాలను గుర్తించి అభివృద్ధి చేసే బాధ్యతను పారిశ్రామిక వేత్తలకు అప్పగించారు. సామాజిక న్యాయం కోసం ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు

CM Chandrababu P4 Program: జన్మభూమిలా పీ4
  • నాడు గ్రామాల అభివృద్ధి.. నేడు పీ4తో పేదలకు అండ

  • సమాజంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి

  • సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేయాలి

  • ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్లలో చంద్రబాబు

  • సమస్యలు ఏకరువు పెట్టిన పేదలు

  • ఆదుకుంటామన్న పారిశ్రామికవేత్తలు

  • ఓ సామాన్యుడి ఇంటికి చంద్రబాబు

  • స్వయంగా కాఫీ అందజేసిన సీఎం

సమాజం మనకు ఎంత ఇచ్చిందో మనం కూడా సమాజానికి అంత అందించాలి. ఎంత శక్తి ఉంటే ఆ మేరకు మనస్ఫూర్తిగా సాయం చేసేందుకు ముందుకు రావాలి. నేను చేపట్టిన ఈ యజ్ఞానికి (పీ4 కార్యక్రమం) సహకరించే వారందరికీ కూటమి ప్రభుత్వం, సమాజం రుణపడి ఉంటుంది.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ/చందర్లపాడు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ పేదరిక నిర్మూలనకు చేయూతనందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో తాను జన్మభూమి కార్యక్రమం నిర్వహించి విజయం సాధించానని, తన పిలుపుతో పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు గ్రామాలను అభివృద్ధి చేశారని అన్నారు. ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలతో తాను ముందుకు సాగుతానని, ఈ క్రమంలోనే పీ4 కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. సమాజంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలను బట్టి ఈ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని, భవిష్యత్‌లో వారు సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేయాలని అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పీ4 కార్యక్రమం కింద ఎంపికైన కుటుంబాలు, పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 41 బంగారు కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేసే బాధ్యతను ఐదుగురు మార్గదర్శులకు అప్పగించే కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా బంగారు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడించారు. తమ సమస్యలను ఏకరువు పెట్టి, సాయం చేయాలని కోరారు. అనంతరం చంద్రబాబు మార్గదర్శులతో మాట్లాడించారు. క్రక్స్‌ బయోటెక్‌ అధినేత రవిచంద్ర మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం గర్వంగా ఉందన్నారు.


వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న తాను తృప్తిగా ఉన్నానని, బంగారు కుటుంబాలకు సాయం చేస్తే మరింత తృప్తి చెందుతానన్నారు. గ్రీన్‌వే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అధినేత తోటకూర శ్రీనివాసరావు, అంబా కోచ్‌ బిల్డర్‌ అధినేత రామకృష్ణ, కేసీపీ, సెంథినీ ప్రతినిధులు సీఎం చంద్రబాబు ఆలోచనలను కొనియాడారు. బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రకటించారు. కంపెనీల ప్రతినిధులు కొందరికి సాయం అందించేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందించారు. సమాజం మనకు ఎంత ఇచ్చిందో మనం కూడా సమాజానికి అంత అందించాలని, మొక్కుబడిగా ఎవరూ సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం మార్గదర్శులను సీఎం సత్కరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు.

ఉపాధికి సహకరించాలి

నా భర్త కూలి పనులు, నేను కుట్టు పనులు చేసుకుంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టపడి వారిని చదివించుకుంటున్నాం. సొంత ఇల్లు, ఇంటి స్థలం కూడా లేవు. నా భర్తకు ఆటో, నాకు కుట్టుమిషన్‌ ఇప్పిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. ఇంటి స్థలం, ఇల్లు ఇప్పించాలి.

- పగడాల నాగరత్నం (బంగారు కుటుంబం), ముప్పాళ్ల

చదువు ఖర్చు.. ఆటో, కుట్టు మిషన్‌

పగడాల నాగరత్నం కుటుంబానికి నేను పూర్తి సహకారం అందిస్తాను. ఆమె భర్తకు ఆటో ఇప్పించడంతో పాటు పని కూడా నేనే కల్పిస్తాను. ఆమెకు కుట్టు మిషన్‌ ఇప్పిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు పిల్లలు స్థిరపడే వరకూ చదివిస్తాను. తద్వారా 15 ఏళ్ల తరువాత ఆ ఇద్దరు పిల్లలు నాలా మార్గదర్శులుగా మారుతారు.

- గోగినేని రవిచంద్ర, క్రక్స్‌ బయోటెక్‌ అధినేత (మార్గదర్శి)


అద్భుత అవకాశంగా భావిస్తా

పీ4 కార్యక్రమం చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. చంద్రబాబు దార్శనికత వల్లే ఇది ఆవిష్కృతమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను బంగారు కుటుంబాలను ఆదుకుంటాను. నా మిత్రులు, ఇతర పారిశ్రామిక వేత్తలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తా.

- తోటకూర శ్రీనివాసరావు, గ్రీన్‌వే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అధినేత

పాడి గేదెలు కొనివ్వండి

నా భర్త కూలి పనికి వెళతారు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. రెండు, మూడు పాడి గేదెలు కొనిస్తే ఆర్థికంగా ఎదుగుతాను. పిల్లలను చదివించుకోగలుగుతాను.

- రమాదేవి(బంగారు కుటుంబం)

కాఫీలు అందించిన చంద్రబాబు

పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పాళ్లలోని ఒక బంగారు కుటుంబంతో కొద్దిసేపు గడిపారు. కోండ్రు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నివాసానికి వెళ్లి ఆయన సతీమణి వెంకట్రావమ్మ, ఇద్దరు పిల్లలతో మాట్లాడారు. పీ4 ద్వారా ఏ సహాయం చేస్తే బాగుపడతారని వారిని అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వరరావు తల్లిదండ్రులతో ముచ్చటించారు. వంట గదికి వెళ్లి స్వయంగా కాఫీ పెట్టిన చంద్రబాబు.. వారికి అందజేశారు. వారితో కలిసి ఆయన కూడా కాఫీ తాగారు. ముఖ్యమంత్రి రాకతో వెంకటేశ్వరరావు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

గురుకుల పాఠశాలను సందర్శించిన చంద్రబాబు

ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్‌ను తిలకించి, తొమ్మిదో తరగతి విద్యార్థినులు వెన్నెల, కార్తీకలతో ముచ్చటించారు. వారిని వెంటబెట్టుకొని తరగతి గదులు, పరిసరాలు, వంటశాల, వసతి గదులు, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఫొటోలు దిగారు.


దళితుల సంక్షేమం కోసం..

తన ఆలోచనలు ఎప్పుడూ 30 ఏళ్ల ముందు చూపుతో ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల్లో 30 ఏళ్ల క్రితం చాలా సమస్యలు ఉండేవన్నారు. దళితుల్లో వర్గీకరణ అవసరమని ఆనాడే గుర్తించామన్నారు. ఎస్సీలను ఏ, బీ, సీ, డీగా వర్గీకరించాలని ఆలోచించానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును ఇచ్చిందన్నారు. తిరిగి తానే సీఎంగా ఉన్నప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నానని చెప్పారు. దళిత యువకుల కోసం స్టడీ సెంటర్లు, పోటీ పరీక్షలకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 16.44 లక్షల దళిత కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందజేస్తున్నామన్నారు. 20 లక్షల దళిత కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్‌ భరోసా కింద 11.38 లక్షల మంది దళితులకు పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దళితులకు రూ.862 కోట్ల రుణాలు ఇప్పించామన్నారు.

మే నుంచి తల్లికి వందనం

మే నెల నుంచి ‘తల్లికివందనం’ కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామన్నారు. రైతులకు అన్నదాత కింద రూ.14 వేలను మూడు విడతలుగా ఇస్తామన్నారు. మత్స్యకారులకు రూ.20 వేలు చొప్పున జీవనోపాధికి ఇస్తామని తెలిపారు. వైసీపీ పాలకులు రూ.10లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాలని, సంక్షేమ కార్యక్రమాలకు నిధులను కేటాయించాలని, దీనితోపాటు అమరావతి, పోలవరం నిర్మించాలని చెప్పారు.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 05:39 AM