Share News

CM Chandrababu: మహిళా శక్తికి వందనం

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:23 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.

CM Chandrababu: మహిళా శక్తికి వందనం

  • ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం: బాబు

  • ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌, ఏఐ ఉండాలి

  • వెలిగొండకు కృష్ణా, గోదావరి జలాలు

  • ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగేలా భరోసా

  • వారి రక్షణ కోసం శక్తి టీమ్‌ యాప్‌

  • మహిళలకు పెట్టుబడుల్లో 45% రాయితీ

  • ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు

  • ఎందరు పిల్లలున్నా తల్లికి వందనం

  • మార్కాపురంలో మహిళా దినోత్సవ సభ

ఒంగోలు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే రానున్న ఏడాది కాలంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. వివిధ సంస్థలతో ఒప్పందాలు, లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ అనంతరం మహిళలతో ఆయన చర్చావేదిక నిర్వహించారు. వివిధ అంశాలపై వారడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆయా రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలనూ వివరించారు. ‘డ్వాక్రా సంఘాల ఏర్పాటు అనంతరం పేదల జీవితాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రతి కుటుంబ ఆర్థికాభివృద్ధిలో మహిళలు కీలకమయ్యారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో వారిని మరింతగా ప్రోత్సహించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచన చేశాం. అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధితోపాటు పెద్దఎత్తున రాయితీలు, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో పురుషులకు 20ు రాయితీ ఇస్తుండగా.. మహిళలకు 45% ఇవ్వబోతున్నాం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూ శిక్షణ ఇస్తాం. మహిళలు ఆన్‌లైన్‌ కోర్సులు చేయాలి’ అని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.68 లక్షలని, 2047 నాటికి 58 లక్షలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.ఇంకా ఏమన్నారంటే..


వేధిస్తే అదే చివరిరోజు..

ఆడబిడ్డల రక్షణకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. వారిని వేధించేవారికి. అత్యాచారాలు చేసేవారికి అదే ఆఖరి రోజు అవుతుంది. వారి వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వారి ప్రవర్తనకు కారణమైన గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం. మహిళల రక్షణ కోసం ఈ రోజే శక్తి టీమ్‌ యాప్‌ ప్రారంభించాం. ఆపదలో ఉన్న వారు ఆ సేవలను వాడుకోవాలి.

ఎక్కువ మందిని కనండి..

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ వద్దని గతంలో ప్రచారం చేసిన నేను.. ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని చెబుతున్నాను. మారిన పరిస్థితులకు అనుగుణంగా అందరూ జనాభావృద్ధిపై దృష్టి పెట్టాలి. ఎక్కువ మంది పిల్లలుంటే చదువులకు అధిక ఖర్చు అవుతుందని భావిస్తారు. అందుకే ఎంతమంది పిల్లలుంటే.. అంతమందికీ ఏటా రూ.15 వేలు తల్లికి వందనం పేరుతో ఇవ్వనున్నాం. గతంలో మహిళా ఉద్యోగులకు రెండు కాన్పుల వరకే ప్రసూతి సెలవులు ఉండేవి. ఇక నుంచి ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు ఇస్తాం. కట్టెల పొయ్యిపై వంట చేసే సమయంలో ఆ పొగ వల్ల నా తల్లి కంట్లో కన్నీరు చూశాను. అలా ఏ అమ్మా ఇబ్బందిపడకూడదనే గ్యాస్‌ కనెక్షన్లు అందించాం. ప్రస్తుతం ధరలు పెరగడంతో మళ్లీ కొందరు కట్టెల పొయ్యి వైపు చూడడం గుర్తించి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.

పూర్తిచేయకుండానే ప్రారంభించాడు..

వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండానే ఎన్నికల్లో లబ్ధి కోసం గత సీఎం దానిని ప్రారంభించాడు. నిజానికి ఆ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా. నేనే ప్రారంభిస్తా. కృష్ణా జలాలతోపాటు అవసరమైతే పోలవరం-బనకచర్ల పథకం ద్వారా గోదావరి నీటిని కూడా తరలించి ఈ ప్రాంత సాగు, తాగునీటి ఇక్కట్లు తీరుస్తాం. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.


ఉత్తమ సేవలకు సన్మానం..

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది మహిళలను చంద్రబాబు సత్కరించారు. వారిలో డి.సుమతి రామ్మోహన్‌రావు (మృదంగం), శారదా రామకృష్ణ (కూచిపూడి), బాలాత్రిపుర ప్రసూన (రిపోర్టర్‌), పి.విజయలక్ష్మి (కల్చరల్‌), ఎస్‌.భారతి (హరికథ), నడిపల్లి రత్నకుమారి (విద్యారంగం, కెనడీ స్కూల్స్‌), ఎం.స్వర్ణలతాదేవి (సోషల్‌ సర్వీసు), టి.వసంతలక్ష్మి (సేవలు), శిరీష (యోగా), ఎన్‌.ఫణిరత్న (హోంగార్డు), కృష్ణకుమారి (రచయిత్రి), మంజుల (గాత్ర సంగీతం) ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఆనం రామనారాయణరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

నా భార్యను చూసి గర్వపడుతున్నా..

ఇంటి పనులు కూడా తెలియని నా భార్యను వ్యాపారంవైపు ప్రోత్సహించా. అయిష్టంగానే ఆ రంగంలో అడుగుపెట్టిన ఆమె హెరిటేజ్‌ సంస్థను అత్యున్నత స్థానంలో నిలిపింది. నేడు ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా సేవలు విస్తరిస్తున్న ఆమెను చూసి గర్వపడుతున్నా.

24 సంస్థలతో ఒప్పందాలు..

డ్వాక్రా సంఘాలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వారి ఉత్పత్తుల అమ్మకాలు, స్వయం ఉపాధికి సంబంధించి 24 సంస్థలతో సీఎం సమక్షంలో సెర్ప్‌ అధికారులు ఎంవోయూలు చేసుకున్నారు. మహిళ రక్షణ కోసం ఉద్దేశించిన శక్తి యాప్‌, పీఎంజీపీ పథకాలను చంద్రబాబు ప్రారంభించారు. వివిధ రంగాల్లో రాణించిన 10 మంది ఎస్‌హెచ్‌జీ మహిళల విజయగాథలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 14,705 సంఘాలకు రూ.1,826.43 కోట్లు, స్త్రీనిధి కింద రూ.వెయ్యి కోట్ల రుణాలను పంపిణీ చేశారు. పలువురు డ్వాక్రా మహిళలను సన్మానించారు.


పార్టీ పదవుల్లో సగం మహిళలకు

వైసీపీ వారితో లాలూచీ రాజకీయాలు సహించను

నేతలందరూ పద్ధతి మార్చుకోవాల్సిందే

కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ

‘మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. తదనుగుణంగా పార్టీలోనూ నాయకురాళ్లు పెరగాలి. అందుకే ఇక పార్టీ పదవుల్లో వారికి సగం ఇవ్వబోతున్నాను’ అని చంద్రబాబు ప్రకటించారు. డబ్బు, కులపిచ్చి కోసం వైసీపీ వారితో లాలూచీ పడేవారిని సహించనని టీడీపీ నేతలను హెచ్చరించారు. పనిచేయని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలనని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మార్కాపురంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతమంది కార్యకర్తల్లో ఒకే ఒక్క మహిళా కార్యకర్త ఉండడాన్ని వేలెత్తిచూపారు. ‘భవిష్యత్‌లో శాసనసభ స్ధానాల్లో కూడా 33 శాతం మహిళలకు రిజర్వు కాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో 50 శాతం వారికి రాబోతున్నాయి. అందుకనుగుణంగా పార్టీలో మహిళా నాయకులను తయారుచేయాలి. ఇందుకోసం పార్టీ నిర్మాణంలో మార్పులు చేయబోతున్నాం. బూత్‌, యూనిట్‌, క్లస్టర్‌, జిల్లా, రాష్ట్ర పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తాం. అవసరమైతే ఆ పదవులను రెండు విభజించి అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తాం. లేదంటే నాయకులే తమ ఇళ్లలోని మహిళలకు పదవులు ఇచ్చుకుంటారు’ అని చమత్కరించారు. 60 వేల మంది బూత్‌ స్థాయి నాయకులతో రానున్న మూడు నెలల్లో వాట్సాప్‌ ద్వారా టచ్‌లోకి వస్తానన్నారు. ఒకసారి గెలిచి, ఇంకోసారి ఓడితే ఫర్వాలేదనే విధానానికి స్వస్తి పలకాలని, ప్రతిసారీ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపిచ్చారు. మంత్రులు కొందరు వారికప్పగించిన జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదని, అలాగే ఎమ్మెల్యేలు కార్యకర్తల సమావేశాలు పెట్టడం లేదన్నారు. వీరు పద్ధతి మార్చుకుని పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. కూటమి పార్టీలతో సఖ్యతగా ఉండాలని, మూడు పార్టీల కలయిక శాశ్వతం కావాలన్నారు.


బాబు చెప్పిన ఉంగరం రహస్యం

తన వేలి ఉంగరం రహస్యాన్ని చంద్రబాబు వెల్లడించారు. పూజల కోసం పెట్టుకున్నది కాదని, ఆరోగ్య సూత్రాల్లో భాగమని చెప్పారు. ఈ వయసులో కూడా మీరు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.. మీ ఆరోగ్య రహస్యం చెప్పండని ఓ మహిళ అడిగారు. సీఎం స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు పడుకున్నా రెండు నిమిషాల్లో నిద్రపోతా, అలారం మోగగానే నిద్రలేస్తా, పగలంతా కష్టపడతాను కాబట్టి అలా నిద్ర వస్తుంది. (వేలి ఉంగరాన్ని చూపుతూ) ఇందులో రహస్యం ఉంది. ఈ ఉంగరం తెల్లవారుజామున సిగ్నల్స్‌ ఇస్తుంది. సరిపడా నిద్రపోయానా లేదా.. అది కూడా మగతగా పోయానా సంతృప్తిగా పోయానా.. ఇంకాసేపు పడుకోవలసిన అవసరం ఉందా అనే అంశాలపై సూచనలు చేస్తుంది. తదనుగుణంగా నిద్ర విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను’ అని తెలిపారు.

అంతో ఇంతో బేరం చేయాలి కదా..!

ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. చేనేత వస్ర్తాల స్టాల్‌ వద్ద మహిళలను అడిగి పలు రకాల చీరల నేతల గురించి తెలుసుకున్నారు. ఐదారింటిని పరిశీలించి తన సతీమణి భువనేశ్వరి కోసం రూ.25 వేల ఖరీదైన చీర కొన్నారు. అంతో ఇంతో బేరం చేయాలి కదా అంటూ వారు చెప్పిన ధరలో వంద తగ్గించి చెక్కు ఇవ్వండని తన సిబ్బందితో సరదాగా అన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 03:36 AM