CPI Ramakrishna: మత సంస్థలపై బీజేపీ పెత్తనం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:56 AM
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మత సంస్థలపై బీజేపీ పెత్తనం కోసం తెచ్చిందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ, జనసేన వ్యాఖ్యలున్నాయని అన్నారు

క్రైస్తవ ఆస్తులు, ఆలయ భూములపైనా కన్నేసింది: సీపీఐ రామకృష్ణ
విజయవాడ(గవర్నర్‌పేట), ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): దేశంలోని మత సంస్థలన్నిటిపైనా బీజేపీ పెత్తనం చెలాయించేందుకే రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లును ముందుకు తెచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవ ఆస్తులపైనా బీజేపీ కన్నేసిందని, దేవాలయ భూములపైనా నిఘా ఉంచిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా తమ వ్యవహారాలు వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ ఉందని, దానికి విరుద్ధంగా వాటిపై పెత్తనం చెలాయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం ఉందని విమర్శించారు. మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ చర్యలపై పెద్దఎత్తున ఆందోళనలకు సీపీఐ సిద్ధమైందని చెప్పారు. ఈ నెల 13న విజయవాడలో నిర్వహించనున్న సదస్సుకు ప్రముఖ నాయకులు హాజరుకానున్నట్టు తెలిపారు. వక్ఫ్ బిల్లును సమర్థిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు, పేద ముస్లింల అభివృద్ధి కోసమే ఈ బిల్లు తెచ్చినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన 11ఏళ్లలో దేశానికి, హిందువులకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రూ.62వేల కోట్లు అప్పులు తెస్తుండటంపై చర్చ జరగాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ అప్పులపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని, అఖిల పక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్