Share News

రాగిజావ తాగి 14 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:43 AM

ఉప్పలగుప్తం/అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రాథమిక పాఠశాలలో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మఽధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు పులిదిండి సుజాత అందజేసిన రాగిజావను తాగిన విద్యార్థులు తొలుత స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం 12.10 గంటలకు

రాగిజావ తాగి 14 మంది విద్యార్థులకు అస్వస్థత
అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

ఏరియా ఆసుపత్రికి తరలింపు

సమాచారం ఇవ్వలేదని ఎంఈవో, తల్లిదండ్రుల ఆగ్రహం

ఉప్పలగుప్తం/అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రాథమిక పాఠశాలలో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మఽధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు పులిదిండి సుజాత అందజేసిన రాగిజావను తాగిన విద్యార్థులు తొలుత స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం 12.10 గంటలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా పులిహోర, దొండకాయ కూర కలిపి తిన్నారు. అప్పటికే రాగిజావ తాగిన 28 మంది విద్యార్థుల్లో 14 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. 5వ తరగతి చదువుతున్న మాదే అభిలాష్‌ వరుసగా 12 పర్యాయాలు వాంతులు చేసుకుని నీరసించి పోయాడు. పరిస్థితిని గుర్తించిన పాఠశాల హెచ్‌ఎం పి.వరలక్ష్మి అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితిని ఎస్‌.యానాం పీహెచ్‌సీ వైద్య సిబ్బందికి తెలియచేశారు. వెంటనే వైద్యాధికారిణి డాక్టర్‌ లోవసుధ అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి వారిని ఉన్నత వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్‌ ఇసుకపట్ల జయమణీరఘుబాబు, పీఎంసీ చైర్మన్‌ మార్కండేయులు దగ్గరుండి విద్యార్థులకు సేవలందించారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదంటూ ఎంఈవో సత్తి సత్యకృష్ణ, తల్లిదండ్రులు హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు రాగిజావ, పులిహోర, పచ్చడి తయారుచేసి పని ఉందని వెళ్లిపోయిన తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు.

విద్యార్థులకు వైద్య సేవలు

రాగిజావ తాగి అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటీన అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో 2వ తరగతి చదువుతున్న నాతి దినేష్‌, దాసరి రోషన్‌తేజ్‌, మూడో తరగతి చదువుతున్న పోతుల అర్జున్‌, పెట్టా లక్కి, బడుగు హారిక, మాదే నైనిష, మద్దెల ధనుష్‌, 4వ తరగతి చదువుతున్న పోతుల సుధాకర్‌, పోతుల సుహాసిని, మద్దెల రేణుక, 5వ తరగతి చదువుతున్న సాకా భార్గవకుమార్‌, మాదే దుర్గాశ్రీ, మాదే అభిలాష్‌, రొక్కాల నాగసత్యలకు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకరరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందించారు. సమాచారం అందుకున్న అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, ఆర్డీవో కె.మాధవి, తహశీల్దార్లు వాసా ఎస్‌.దివాకర్‌, పలివెల అశోక్‌ప్రసాద్‌ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో తల్లిదండ్రులతో పాటు బంధువర్గీయులు, స్థానికులు అధిక సంఖ్యలో ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, బహుజన సమాజ్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబు పరామర్శించారు.

ఆరోగ్యం మెరుగుపడింది : డీఈవో

అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డీఈవో డాక్టర్‌ షేక్‌ సలీంబాషా తెలిపారు. ఎస్టీయూ జిల్లాశాఖ అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సరిదే సత్యపల్లంరాజు, ఇతర ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయంత్రానికి ఏడుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగు పడడంతో డిశ్చార్జి చేశారు. మరో ఏడుగురు విద్యార్థులు వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతూ రాత్రికి డిశ్చార్జి చేయనున్నట్టు డాక్టర్‌ శంకరరావు తెలిపారు. ఇదిలా ఉండగా పాఠశాలలో ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీ నిర్వాహకురాలిని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు తొలగించినట్టు డీఈవో తెలిపారు.

Updated Date - Feb 26 , 2025 | 12:43 AM