Share News

అద్భుతః

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:42 AM

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన ‘అమరావతి చిత్రకళా వీధి’ ప్రదర్శనకు ఉభయ తెలుగు రాషా్ట్రలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నుంచి కూడా కళాకారులు వచ్చారు. నగర కళాకారులతో పాటు కడప, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల వారు పెయింటింగ్స్‌, ఆకృతులను స్టాల్స్‌లో ఉంచారు.

అద్భుతః

పెన్సిల్‌ ఆర్ట్‌ నుంచి సిలికాన విగ్రహాల వరకు... చూసి ముగ్ధులైన ప్రజలు

రాజమహేంద్రవరం/సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన ‘అమరావతి చిత్రకళా వీధి’ ప్రదర్శనకు ఉభయ తెలుగు రాషా్ట్రలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నుంచి కూడా కళాకారులు వచ్చారు. నగర కళాకారులతో పాటు కడప, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల వారు పెయింటింగ్స్‌, ఆకృతులను స్టాల్స్‌లో ఉంచారు. ప్రభుత్వాస్పత్రి దగ్గరనుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాల్స్‌ ఎక్రిలిక్‌, వాటర్‌ కలర్‌, పెన, పెన్సిల్‌, నిబ్‌ పెయింటింగ్స్‌, చెక్క, మట్టి, కాగితం, వాల్‌పుట్టి తదితర ముడిసరుకులతో చేసిన బొమ్మలతో నిండిపోయాయి. చిరుధాన్యాలతో చేసిన ప్రధాని మోదీ, తిరుమల వేంకటేశ్వరుని చిత్రపటాలు, మనిషిని పోలిన మనిషి విగ్రహాలు ఆశ్చర్యపరిచాయి. మహిళా ప్రత్యేక కారాగారంలోని ఉత్పత్తులు, కేంద్ర కారాగారంలోని ఖైదీలు వేసిన గాంధీజీ తదితర పెయింటింగ్స్‌ ఆకర్షించాయి. కడపకు చెందిన ఈరయ్య యోగి వేమన యూనివర్సిటీలో పని చేస్తున్నారు. ఆయన ఇసుకతో చిత్రపటాలు తయారు చేశారు. పాండిచ్చేరికి చెందిన నూర్జహాన టైలరింగ్‌ షాపులు, వస్త్ర తయారీ మిల్లుల్లో వచ్చిన రద్దుతో చేతి సంచులు, మహిళలకు హ్యాండ్‌ బ్యాగ్స్‌ రూపొందించారు. తిరుపతికి చెందిన బి.అర్చన నిర్మల్‌ పెయింటింగ్‌తో ఆకట్టుకున్నారు. లైవ్‌ ఆర్ట్‌లో కళాకారులు అక్కడికక్కడే పెన, పెన్సిల్‌తో చిత్రాలు వేసి ఇస్తుండడం చాలా మందిని ఆకర్షించింది. వారివారి చిత్రాలను వేయించుకుని మురిసిపోయారు. కొత్తపేటకు చెందిన రాజ్‌కుమార్‌ వడయార్‌ ఫ్యాబ్రిక్‌, సిలికాన మెటీరియల్‌తో చేసిన ప్రముఖుల విగ్రహాల వద్ద సెల్ఫీల హడావుడి కనిపించింది. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న అంబేడ్కర్‌, రాజా రవి వర్మ, దామెర్ల రామారావు, ఆదికవి నన్నయ తదితర విగ్రహాలను జనం ఆశ్చర్యంగా తిలకించారు. పెయింటింగ్స్‌, ఆకృతుల ఖరీదు బాగా ఎక్కువగా ఉండడంతో చాలా మంది బేరమాడి వెనక్కు తగ్గారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కళాకారులను సత్కరించి... ఈ ప్రభుత్వం కళాకారులకు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సుప్రసన్నశ్రీ చిత్రకళా ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ నరసింహకిషోర్‌ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 250 మంది సిబ్బంది, 6 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లను భద్రతా ఏర్పాట్లకు వినియోగించారు.

కళలకు పునరుజ్జీవం: శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు

రాజమహేంద్రవరం/సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కళలకు పునరుజ్జీవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ‘అమరావతి చిత్రకళా వీధి’ ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రకాశనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘చలనచిత్ర కళాకారులు కావచ్చు, నాటకరంగ కళాకారులు కావచ్చు.. కళాకారులంటే నాకు చాలా గౌరవం. అలాంటి ఈ శాఖకు దుర్గేశ, తేజస్విలను ఎంపిక చేసిన రోజు కళలకు మంచి రోజులు వచ్చాయనే నమ్మకం కలిగింది. అది ఈ రోజు నిజమైంది. రానున్న రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రమంతా జరగాలి. కళాకారుల పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి ఇది మచ్చు తునకగా మిగిలింది. కళలను గౌరవించినచోట చక్కని వాతావరణం ఉంటుంది’ అన్నారు. మంత్రి కందుల దుర్గేశ మాట్లాడుతూ... ‘ఇవాళ చిత్రకళా వీధి అనే పేరుతో చైరపర్సన తేజస్వి, మేము ఒక ఆలోచన చేశాం. ఇక్కడ లబ్ధ ప్రతిష్టులైన అనేక మంది కళాకారులు ఉన్నారు. కేవలం చిత్రలేఖనమే కాకుండా శిల్పాలు తయారు చేసే కళాకారులూ ఉన్నారు. వీటిని ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రజల్లో కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కల్పించాలని భావించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన చైర్‌పర్సన తేజస్వి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ డి.మల్లికార్జునరావు కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా నిర్వాహకులను, అధికారులను, వలంటీర్లను మంత్రి దుర్గేశ ప్రత్యేకంగా అభినందించారు. కళాకారుల వద్దకు వెళ్లి పార్టిసిపేషన సర్టిఫికెట్లను అందజేశారు.

Updated Date - Apr 05 , 2025 | 12:42 AM