పెడితే.. తిరిగి రాధే!
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:17 AM
తీగలాగితే డొంక కదిలింది.. కాకినాడ కేంద్రంగా సాగే బెట్టింగ్ ముఠా బయటపడింది.

కాకినాడ కేంద్రంగా బెట్టింగ్ మాఫియా
యాప్ తయారు చేయించి కోట్లలో జూదం
పందేలు కట్టిస్తే లాభాల్లో 10 శాతం వాటా
బుకీలు, సబ్‌బుకీలు నియామకం
రాధే ఎక్సేంజ్ యాప్ ద్వారా కోట్లు
దందాకు వైసీపీ కీలకనేత అండదండలు
తీగలాడితే కదిలిన డొంక
కాకినాడ/ ఆంధ్రజ్యోతి)
‘‘హాయ్..మీకో బెట్టింగ్ యాప్ చెబుతా.. తెలి సిన వారి ద్వారా ఇందులో పందేలు కాయిస్తే వచ్చిన లాభాల్లో 10 శాతం మీకే.. ఇదిగో యాప్ లింకు.. యూజర్ ఐడీ.. పాస్‌వర్డ్.. మీరే కాదు... మీకు నచ్చినంత మందికి ఇవి షేర్ చేసి ఎంత మందితో ఆడిస్తే అంత లాభాలు’’ అంటూ కాకినాడకు చెందిన మణికుమార్ అలియాస్ పండు సొంతంగా తయారుచేసిన ‘రాధే’ అనే బెట్టింగ్ యాప్‌తో రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది బుకీలు, సబ్ బుకీలను నియమించుకున్నాడు.. పోలీసులకు తెలిస్తే తక్షణమే యాప్‌లో అత్యవసర బటన్ ఏర్పాటు చేశాడు.. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లు లాగేశాడు.
కాకినాడ వైసీపీ కీలకనేత అనుచరుడు ఘాజీ (పేరు మార్చాం). గడచిన అయిదేళ్లలో కాకినాడ నగరం కేంద్రంగా పేకాట, బెట్టింగ్ యాప్‌లతో సంపాదించింది అక్షరాలా రూ.70 కోట్లు పైమాటే.. రాత్రయితే నగరంలో ప్రముఖులకు ఖరీదైన బస కల్పించి బెట్టింగ్‌లు ఆడించి తెగ నొల్లేశాడు. ప్రభుత్వం మారాక కూడా కొనసాగిస్తుండగా డెన్ బయటపడి ఇప్పుడు రహస్యంగా ఇళ్లల్లో జూదం, బెట్టింగ్ యాప్‌లు ఆడిస్తున్నాడు. అటు పండు అయినా.. ఇటు ఘాజీ అయినా వీరిద్దరి ఘరానా బెట్టింగ్ నిర్వాహకుల తెరవెనుక వెన్నుదన్ను కాకినాడ వైసీపీ కీలక నేతే. ఇటీవల పండు వరంగల్‌లో పట్టుబడితే అక్కడ మంత్రికి ఫోన్ చేసి కేసు నీరుగార్చేలా చేశాడు.
కాకినాడలో గతంలో ఎక్కడా బెట్టింగ్‌ల వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బెట్టింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. పై రెండు ఉదాహరణలు చాలు కాకినాడ కేంద్రంగా బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూనుకు పోయిందో చెప్పడానికి. ఇక్కడి నుంచే వీరిద్దరు కాకుండా అచ్చం వీళ్ల తరహాలో అనేకమంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఆన్‌లైన్‌లో రమ్మీ, క్రికెట్ బెట్టింగ్, కేసినోలు ఆడిస్తూ వేలాది మంది డబ్బు జూదంలో పోగొట్టుకోగా, వీరు మాత్రం కోట్లకు పడగలెత్తారు.
బెట్టింగ్ యాప్‌ల కేరాఫ్ కాకినాడ..
తీగలాగితే డొంక కదిలింది.. కాకినాడ కేంద్రంగా సాగే బెట్టింగ్ ముఠా బయటపడింది. కాకినాడ నగరానికి చెందినపండు ఏకంగా సొంతంగా రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ తయారుచేసి అనేక రాష్ట్రాల్లో బుకీలు, సబ్‌బుకీలను నియమించుకుని కోట్లకు పడగలెత్తాడు. ఇటీవల వరం గల్‌లో దొరికిన బెట్టింగ్ బాబులను లోతుగా విచారిస్తే కాకినాడ కేంద్రంగా పండు సాగించిన బెట్టింగ్ మాఫియా బయటపడింది. దీంతో పండును అరెస్ట్ చేసి విచారిస్తే పండు ఖాతాలో రూ.5 కోట్లు గుర్తించారు. ఇదంతా బెట్టింగ్ ద్వారా సంపాదించినదేనని తేల్చారు. తాజాగా కృష్ణా జిల్లాలోను పట్టుబడ్డ బుకీలను విచారిస్తే అక్కడా సదరు పండు పేరే బయటకు రావడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేయబోతున్నారు. అయితే అటు తెలంగాణ, ఇక్కడ కృష్ణాలో పట్టుబడ్డ బెట్టింగ్‌బాబులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే కాకినాడ కేంద్రంగా వెలుగు చూస్తున్న బెట్టింగ్ దందా చూసి పోలీసులే నివ్వెరపోయి నోరెళ్లబెడుతున్నారు. దీంతో ఇప్పుడు బెట్టింగ్ యాప్‌ల తీగ లాగితే డొంక కాకినాడలో తేలుతుండడంతో పోలీసులంతా అవాక్కవుతున్నారు.
ఐదేళ్లు.. రూ.70 కోట్లు కమీషన్..
కాకినాడ వైసీపీ కీలకనేత అనుచరులు కొందరు ఇళ్లు అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించేవారు. కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు సదరు నేత కీలక అనుచరుడు నగరంలో జూదరులకు పరిచయం చేశాడు. వారి ద్వారా ఈ యాప్‌ల్లో రోజుకు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వర కు కూడా పందేలు కాయించేవారు. సదరు వైసీపీ కీలకనేత అనుచ రుడికి కమీషన్లు భారీగా రావడంతో రెచ్చిపోయి వ్యాపారం పెంచేశాడు. గడచిన ఐదేళ్లలో సదరు వ్యక్తి పేకాట నిర్వహణ, యాప్‌ల కమీషన్ ద్వారా రూ.70 కోట్ల వరకు సంపాదించాడు. ఇందులో రూ.14 కోట్లతో నగరంలో ఇటీవల ఖరీదైన భవంతిని నిర్మించాడు. అయితే బెట్టింగ్‌ల విషయం తెలిసినా పోలీసులు జోలికిరాకుండా ఉండేందుకు నెలకు లక్షల్లో మామూళ్లు పంపాడు. కొంతకాలం కిందట ప్రభుత్వం మారాక తిరిగి పేకాట ఆడించేందుకు ప్రయత్నించగా దొరికిపోవడంతో ఇప్పుడు యాప్‌ల ద్వారా జూదం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికీ ఐపీఎల్, ఇతర క్రికెట్ మ్యాచ్‌లు వస్తే సదరు వ్యక్తి కోట్లలో యాప్‌లో బెట్టింగ్‌లు నిర్వ హిస్తున్నాడు. ఇటీవల మళ్లీ నగరంలో పలు ఇళ్లను అద్దెకు తీసుకుని యథేచ్చగా పేకాట, ఇతర జూదం ఆడిస్తున్నాడు. పోలీసులకు విష యం ముందే చెప్పి మామూళ్లు పంపేస్తున్నాడు.
కోట్లు ’పండు’లా రాలుతున్నాయి..
సదరు ఘాజీతో జూదంలో పరిచయాలు ఉన్న కాకినాడకు చెం దిన వీరమణికుమార్ అలియాస్ పండు బెట్టింగ్‌ను వ్యాపారంగా మార్చేశాడు. కాకినాడ కేంద్రంగా రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ తయారు చేశాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలం గాణ వరకు ఈ యాప్‌ను అనేక మంది బుకీలు, సబ్ బుకీలకు పరిచయం చేశాడు. యాప్‌లో జూదం ఆడిస్తే వచ్చిన లాభాల్లో పది శాతం కమీషన్ ఎర చూపాడు. వీరందరికి యాప్ లింకు, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందించాడు. వీరంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేలా చేశాడు. అందులో భాగంగా తను తయా రు చేసిన బెట్టింగ్ యాప్‌నకు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కిరణ్‌కుమార్‌ను అడ్మిన్‌గా నియమించాడు. సదరు అడ్మిన్ పది శాతం కమీషన్ ఆశతో బుకీలు,సబ్ బుకీలను నియమించాడు. కిరణ్ ఇటీవల పోలీసులకు దొరికిపోడంతో పండు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లో పోలీసులకు చిక్కిన కొందరు బుకీలు ఇచ్చిన సమాచారంతో పండు అసలు సూత్రధారుడిగా గుర్తించా రు. అతడిని అరెస్ట్ చేసి బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన రూ.5 కోట్ల లాభం ఖాతాలో గుర్తించారు. ఇందులో కోటితో ఇటీవల కాకినాడలో ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశాడు. అయితే పండు అరెస్ట్‌తో అవాక్కయిన కాకినాడ వైసీపీ కీలకనేత అక్కడ తన పాత పరిచయాలతో ఆ మంత్రితో మాట్లాడి కేసులోతుల్లోకి వెళ్ల కుండా ప్రయత్నాలు చేశారు. సదరు పండు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక మంది బుకీలతో ఇప్పటికీ జూదం ఆడిస్తున్నాడు. సదరు పండు యాప్ ద్వారా రూ.40 కోట్ల వరకు సంపాదించినట్టు సమాచారం. కానీ పోలీసులు ఇదెక్కడా పెద్దగా పట్టించుకోవడంలేదు. వరంగల్‌లో అరెస్టయిన సదరు పండును ఇక్కడా విచారిస్తే ఉమ్మడి జిల్లాలో అనేక ఘోరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా పోలీసులు అడుగులు వేస్తారని అనుకోలేం.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలి
కొవ్వూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్ బెట్టింగుల్లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు మండలం పెనకనమెట్టకు చెందిన తాడి వినోద్ (30) ఒరామి సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్నాడు. ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లో రూ.లక్ష పోగొట్టుకోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు మందలించాడు. బెట్టింగ్ గేమ్‌లలో అప్పుల పాలవ్వడంతో ఈనెల 14వ తేదీన కలుపుమందు తాగి వాం తులు చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం అక్కడ నుంచి కాకినాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ బాబూరావు తెలిపారు.