Share News

పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:13 AM

గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి నిర్మూలనకు పెద్దపీట వేసిందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు.

  పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపాలి

మలికిపురం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి నిర్మూలనకు పెద్దపీట వేసిందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు. లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో మాదకద్రవ్యాల నిర్మూలన, శక్తి యాప్‌ అవగాహన సభలో ఆయన మాట్లాడారు. పోలీసులు గట్టిగా తలచుకుంటే ఏదైనా సాధించవచ్చునన్నారు. నిర్లక్ష్యాన్ని విడనాడి మాదక ద్రవ్యాల నిర్మూలనకు పెద్దపీట వేయాలన్నారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి శక్తి యాప్‌ పట్ల ప్రతీ మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు. శక్తి యాప్‌తో పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండానే తమ స్మార్ట్‌ఫోన్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన 7నుంచి 9నిమిషాలలోపు పోలీసు యాక్షన్‌ ఉంటుందన్నారు. గంజాయితో యువత భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు పిల్లల పట్ల దృష్టి పెట్టాలన్నారు. పోలీసులు రాత్రి సమయంలో గస్తీ పెంచాలన్నారు. ఈనియోజకవర్గంలో 10వేల నుంచి 12వేల మంది గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్నారని, నకిలీ ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారని, వీటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. డీఎస్పీ సుంకర మురళీమోహనరావు మాట్లాడుతూ గంజాయి, శక్తియాప్‌, మహిళా రక్షణ బృందాలు గురించి వివరించారు. చదువుంటే అన్నీ ఉన్నట్టేనని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఎక్కువగా ఉందన్నారు. గంజాయి నిశబ్ధంగా విస్తరించిన మహమ్మారి అని అన్నారు. పిల్లల మీద ప్రేమతో తల్లిదండ్రుల కళ్లు కప్పబడుతున్నాయన్నారు. పిల్లలు పాడవడానికి కొంత తల్లిదండ్రులు కూడా కారణమన్నారు. కోనసీమను ప్రశాంత సీమగా ఉంచుదామన్నారు. సభకు విచ్చేసిన యువకులు, యువతులు విద్యార్థులు వివిధ శాఖల సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గుబ్బల శ్రీనివాస్‌, ఎం. చినబాబు, దిరిశాల బాలాజీ, చాగంటి స్వామి, మంగెన భూదేవి, ముప్పర్తి నాని, అడబాల యుగంధర్‌, జిమహేష్‌కుమార్‌, ఎస్‌ఐలు పి.సురేష్‌, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:13 AM