Share News

మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కరుణాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి:ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:44 AM

అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

  మత విద్వేషాలు రెచ్చగొడుతున్న   కరుణాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి:ఎమ్మెల్యే

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. మతం పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ మూకలు చూస్తున్నాయని విమర్శించారు. అమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతుందన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర పాలన సాగితే వైసీపీకి పుట్టగతులు ఉండవని భావించే రాష్ట్రాన్ని అల్లరిపాలు చేసేలా విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గురివింద గింజ సామెత తరహాలోనే టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన కరుణాకరరెడ్డి హయాంలో ప్లాస్మా టీవీల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, టిక్కెట్ల అమ్మకాల కుంభకోణం మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. టీటీడీ గోశాలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఆవులు చనిపోయాయి, వాటిలో ఎన్నింటికి పోస్టుమార్టం చేయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వ్యాధులు సోకి, వృద్ధాప్యంతో గోవులు చనిపోవడం సహజమేనన్నారు. ప్రస్తుతం టీటీడీ గోశాలలో 2668 గోవులు ఉండగా వాటి అన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేయించామన్నారు. వాటి సంరక్షణకు 168 మంది ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని వివరించారు. అసత్యాలను ప్రచారంచేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కరుణాకరరెడ్డిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోతే మరికొన్ని మూకలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆనందరావు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వామక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, మల్లుల పోలయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:44 AM