కల్లోల..కడలి!
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:18 AM
ముప్పు ముంచుకొస్తోంది.. సముద్రతీరం భారీగా కోతకు గురవుతోంది. అలజడి రేపు తోంది..అటు కాకినాడ.. ఇటు కోనసీమ జిల్లాల్లో వేలాది ఎకరాల విలువైన భూములు సముద్రగర్భంలో కలిసిపోతున్నాయి.

ఉప్పాడలో కోతనివారణకు కసరత్తు
సీఎం ఆదేశాలతో కేంద్రానికి కలెక్టర్ లేఖ
రూ.320 కోట్ల నిధులు కోరిన వైనం
కేంద్రం నుంచి సానుకూల స్పందన
శాస్త్రవేత్తలతో ప్రత్యేక అధ్యయనం
కోనసీమలో మునుగుతున్న ఊళ్లు
(కాకినాడ/ అమలాపురం, ఆంధ్రజ్యోతి)
ముప్పు ముంచుకొస్తోంది.. సముద్రతీరం భారీగా కోతకు గురవుతోంది. అలజడి రేపు తోంది..అటు కాకినాడ.. ఇటు కోనసీమ జిల్లాల్లో వేలాది ఎకరాల విలువైన భూములు సముద్రగర్భంలో కలిసిపోతున్నాయి. రహదారులు, సరుగుడు తోటలు, మడ అడవులు కళ్లె దుటే కడలిలో కలిసిపోతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రతీరం వెంబడి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.ఏళ్ల తరబడి ఉప్పాడను వేధిస్తోన్న సముద్రపు కోతకు శాశ్వత పరిష్కారం సాధించే దిశగా ప్రభుత్వం అడు గులు ముమ్మరం చేసింది. ఐదేళ్లుగా కోత తీవ్రతతో నష్టం పెరిగినా అప్పటి వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉప్పా డను సముద్రపు కోత నుంచి కాపాడేందుకు వడివడిగా అడుగులు పడుతు న్నాయి. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సముద్రపు కోతపై జరిగిన చర్చలో కోత నివారణకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టేలా పర్యవేక్షిం చాలని కలెక్టర్ షాన్ మోహన్‌ను సీఎం ఆదేశించారు. దీంతో ఇటీవల కలెక్టర్ కేంద్రానికి లేఖ రాశారు. రూ.320 కోట్లతో 12 కిలోమీటర్ల మేర కోత నివారణకు ప్రణా ళిక సిద్ధం చేశామని వివరించారు. సీఎం ఆదే శాలతో ఈ ప్రతిపా దనపై జాతీయ విపత్తుల నిర్వహణ సం స్థతో సంప్రదింపులు ఆరం భించింది. నష్ట నివారణ నిధుల విడుదలకు దాదా పు సమ్మతించింది.ఈ తర హా ప్రతిపాదనలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టు వివరించింది. ఉ ప్పాడ కోత తీవ్రత దృష్ట్యా త్వరలో నిధులు విడుదలకు మార్గం సుగమం అ వుతుందని అధికారులు భావిస్తున్నారు.
20 ఏళ్లుగా ముందుకు..
కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద స ముద్రం 20 ఏళ్లుగా భారీగా ముందుకు వచ్చేసింది. తుఫాన్లు, అల్పపీడనం సమయాల్లో తీరం అల్లకల్లోలంగా మారుతోంది. కోత వల్ల ఏకంగా 1,360 ఎకరాలు, రెండు ఆలయాలు, 150 వరకు ఇళ్లు సముద్ర గర్భంలో కలిసి పోయాయి.అధికారంలోకి వస్తే కోత నివారణకు శాశ్వత చర్యలు చేపడ తా మని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిం ది.దీనికి తగ్గట్లుగా అడుగులు వేస్తుంది.
కోతకు అడ్డుకట్ట ఇలా
డిప్యూటీ సీఎం పవన్ జోక్యంతో కోత ను అధ్యయనం చేయడానికి నేషనల్ కోస్టల్ రీసెర్చ్ సెంటర్ (ఎన్‌సీఆర్‌సీ) శాస్త్ర వేత్తలు వచ్చి ప్రత్యేక కార్యాచరణ ప్రణా ళిక సిద్ధం చేశారు. ఉప్పాడ వద్ద దక్షిణం, ఉత్తర దిశల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో డ్రాఫ్ట్ రూపొందించారు. ప్రధానంగా ఉప్పాడ వద్ద సముద్రం అలల తీవ్రత చాలా అధికంగా ఉన్నట్టు తేల్చారు.దానిని తగ్గించ గలిగితే కోత బాగా నెమ్మదిస్తుందని అంచనా వేశారు. ఉప్పాడ వద్ద తీరం నుంచి 170 మీటర్ల లోపు సముద్రంలో అత్యంత బలంగా కాంక్రీట్‌తో నిలువునా గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి టెట్రా పాడ్‌లు కలపనున్నారు.టెట్రాపాడ్‌లు మూడు కాళ్ల ఆకారంలో కాంక్రీట్ దిమ్మల్లా చాలా బలంగా ఉంటాయి.వీటిని కాంక్రీట్ గోడపై అమర్చు తారు. ఆపైన మళ్లీ భారీ రాళ్లు పేర్చుతారు. దీనివల్ల ఉప్పాడ వైపు అలల తీవ్రత దాదాపుగా తగ్గి కోత నెమ్మది స్తుంది. ఉప్పాడకు దక్షిణం వైపు కాకినాడ నుంచి వచ్చే దారిలో మలుపు వద్ద సముద్రం పూర్తిగా ముందుకు వచ్చేసింది.ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్త బీచ్ సృష్టించాలని ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. ఉప్పాడకు సమీపంలో కాకినాడ డీప్‌వాటర్ పోర్టు ఉంది. నేరుగా భారీ నౌకలు ఈ పోర్టుకు వస్తాయి.నౌకలు వచ్చే మార్గంలో ఏటా ఇసుక డ్రెడ్జింగ్ చేసి నౌకా మార్గానికి ఇబ్బంది లేకుండా చేస్తారు. డ్రెడ్జింగ్ చేసిన సమయంలో వచ్చే ఇసుకను ఉప్పాడ దక్షిణం వైపు పోసి కొత్త బీచ్ సృష్టించాలని తేల్చారు. ఏడాదికి 50 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున, రెండేళ్లకు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను తెచ్చి ఇక్కడ డంప్ చేయా లని నిర్ణయించారు.ఇలా 12 కిలోమీటర్ల మేర కోత నివారణ చర్యలు చేపట్టడానికి రూ.320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ప్రభు త్వానికి నివేదిక పంపారు.
కోనసీమకూ ..గుండెకోత
కోనసీమలో సముద్రతీరం తీవ్రంగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల భూములు కడలిలో కలిసిపోతున్నాయి. కోనసీమ జిల్లా 8 మండలాల పరిధిలో 48 కి.మీ. మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఒకవైపు ఇసుక మాఫియా ప్రతినిధులు తీరాన్ని తవ్వేస్తుంటే మరో వైపు సముద్రం ముందుకు దూసుకొస్తూ ఊళ్లను ముం చెత్తుతోంది. భైరవపాలెంలోని సముద్రతీర ప్రాంతం నుంచి బ్రహ్మసమేధ్యం, చిర్రయానాం, ఎస్.యానాం, వాసాలతిప్ప, కొమరిగిరిపట్నం,ఓడలరేవు, కేశనపల్లి, కరవాక, చింతలమోరి, అంతర్వేది తీరం వరకు సముద్రం భారీగా కోతకు గురవు తోంది. భవిష్యత్‌లో ఆందోళనకరమైన పరిణామాలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఓడలరేవు తీరప్రాంతంలో వేలాది కోట్ల విలువైన చమురు సంపదను తరలించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ ప్లాంటుకు సంబంధించి భారీ నిర్మాణాలకు చేరువగా సము ద్రం ముందుకొచ్చింది. ఇటీవల తీరం అల్లకల్లోలం కావడంతో గతంలో ఓ కాంట్రాక్టు సంస్థ నిర్మించిన రక్షణ గోడ ఇప్పుడు చిధ్రమై ప్లాంటు గోడ కూడా కోతకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఓఎన్జీసీ అధికారులు ప్రత్యేక కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.110 కోట్ల అంచనా వ్యయంతో సముద్రం వెంబడి పటిష్టమైన, అత్యాధునికమైన టెక్నాలజీతో కూడిన గోడను నిర్మించుకునేందుకు త్వరలోనే ఆ సంస్థ అధికారులు టెండర్లు పిలుస్తారని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. కాగా ఓడలరేవు సముద్ర బీచ్ రిసార్ట్స్‌కు కూడా రాగల రోజుల్లో ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు.