Share News

యువతకు శుభవార్త.. ఉన్న ఊరిలోనే

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:13 AM

సొంత ఊరిలోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు, కంపెనీలకు ఉపయోగపడేలా ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రం హోం) సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం విధానం సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన కార్పొరేట్‌

యువతకు శుభవార్త.. ఉన్న ఊరిలోనే

యువతకు వర్క్‌ ఫ్రం హోం

కూటమి ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్‌

సాఫ్ట్‌వేర్‌పైనే ప్రధాన దృష్టి

ఇంట్లోనే పనిచేసుకునేలా సౌకర్యాల కల్పన

లేదంటే వర్క్‌ఫ్రం హోం సెంటర్‌కి వెళ్లొచ్చు

ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు

ఇప్పటికే పూర్తయిన సర్వే

పని ఉన్నవారు వేలల్లో.. 8 లేనివారు లక్షల్లో

సర్వేలో విద్యార్హతలతో సహా తేలిన లెక్కలు

ఇంటర్‌నెట్‌ కనెక్షన్ల వివరాలూ నిక్షిప్తం

(కాకినాడ/రాజమహేంద్రవరం/అమలాపురం -ఆంధ్రజ్యోతి)

సొంత ఊరిలోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు, కంపెనీలకు ఉపయోగపడేలా ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రం హోం) సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం విధానం సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన కార్పొరేట్‌ సంస్థల్లో కొనసాగుతోంది. కొవిడ్‌-19 తర్వాత చాలా కంపెనీలు దీనిని కొనసాగిస్తున్నాయి. కంపెనీలకు ఈ విధానం సులభంగా ఉండడం, ఆర్థికంగా మేలు జరుగుతుండడంతో పనులు చేయించుకునేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. తద్వారా ఎక్కువమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా వర్క్‌ఫ్రం హోంకు అనువైన కేంద్రాలను గుర్తించే పనులు చేపడుతున్నారు.

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే యువతకు ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తున్నాయి. అది కూడా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతోపాటు, విదేశాల్లో ఉద్యో గాలు చేయాల్సి వస్తోంది. చాలామంది అక్కడి వెళ్లిపోతున్నా.. కొంతమంది మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో పనిచేసినా వచ్చే జీతంలో ఎక్కువ ఖర్చులకే అయి పోవడం, తల్లిదండ్రులు, కుటుంబాలకు దూ రంగా ఉండాల్సి రావడంతో సొంతూరిలోనే ఏదొక వ్యాపారం, వ్యవసాయం, తమ చదువులకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఇంటి వద్దే ఉంటూ ఐటీ కంపెనీల్లో పనిచేయడానికి వీలున్న యు వతను గుర్తించే పనులు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పల్లె లు, పట్టణాలు, నగరాల్లో యువతీయువకులు, అర్హతలు వంటివి సర్వే ద్వారా సేకరించారు.

అందరివీ ‘ఐటీ’ కలలే..

ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఏ విభాగంలో విద్యను అభ్యసించారో కూడా వివరాలు సేకరించారు. అయితే ఈ సర్వేని బట్టి దాదాపుగా అందరూ సాఫ్ట్‌వేర్‌కే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు. దీంతో తొలుతగా ఆ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సాఫ్ట్‌వేర్‌ అభ్యసిం చిన వాళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయారు. కానీ ఐటీ రంగంలో ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన లేదు. ఒకవేళ ఉన్నా సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సెక్టార్‌ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మరింత దుస్థితికి దారితీసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ చదువు కున్న అభ్యర్థుల కష్టాలను గుర్తించింది. కొందరికి వర్క్‌ ఫ్రంహోం సదుపాయాన్ని కంపెనీ కల్పించినా ఇంటి వద్ద సరైన సౌకర్యాలు లేవు. అధిక శాతం మందికి అస లు ఉద్యోగాలే లేవు. స్వల్ప సంఖ్యాకులకు ఉద్యోగం ఉన్నా దూర ప్రాంతాల్లో అతి తక్కువ జీతాలతో నెట్టుకు రావాల్సి వస్తోంది. దూర ప్రాంతాల్లో ఇబ్బందులు పడలేక ఉద్యోగం వదిలేసి సొంతూరికి వచ్చి ఏదొక పని చేసుకుం టున్నవాళ్లూ ఉన్నారు. ఈ సమస్యలకు వర్క్‌ ఫ్రం హోంతో చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కొంది. దానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ చదువరులకు వర్క్‌ఫ్రం హోం కష్టాలు తగ్గించడం, వారికి ఉద్యోగం లేకపోతే ఏదొక కంపెనీ తరపున వర్క్‌ఫ్రం హోం సదుపాయం కల్పించడంపై కసరత్తు జరుగుతోంది. ఒక మండలంలో వివరాల ప్రకారం ఆయా ప్రదేశాల్లో ఒకచోట వర్క్‌ఫ్రం హోంకి అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు. అక్కడ కంప్యూటర్లు, వైఫై వంటి సదుపా యాలు ఉంటాయి. ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం సెంటర్‌కి వెళ్లి విధులు నిర్వహించుకోవచ్చు.

వర్క్‌ ఫ్రం హోం సర్వే లక్ష్యం ఇదే

వర్క్‌ఫ్రం హోం ద్వారా పనిచేసేందుకు ముందుకు వచ్చే నిరుద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి కూటమి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్‌, ఏసీ సదుపాయం ఉన్న భవనాలను గుర్తించే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు? ఉద్యోగాలు చేస్తున్నవారు ఏయే కంపెనీల్లో చేస్తున్నారు?, ఇంటి దగ్గరే ఉండి పనిచేస్తున్నారా?, ఆయా కంపెనీలకు వెళ్లి పనిచేస్తున్నారా? వర్క్‌ఫ్రం చేసేవారు ఎక్క డి నుంచి చేస్తున్నారు?, వారు పనిచేసే రూమ్‌ సైజ్‌ ఎంత?, ఆ రూమ్‌లో వేరొకరికి చోటు కల్పించే అవకాశం ఉందా?, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉందా?, ఎంత స్పీడ్‌లో నెట్‌ను వినియోగిస్తున్నారు? వంటి వివరాలపై సర్వే నిర్వహించారు. అలాగే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు విద్యార్హతలు ఉన్న వారెందరు? ఉద్యోగాలు చేస్తున్నారా? లేదా? చేయకపోతే కారణాలు?, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలని ఎంత మందికి ఆసక్తి ఉంది? ఇలా వివరాలు సేకరించారు. వీరందరూ త్వరలోనే ఇంటి నుంచి పనిచేసుకునేలా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఎక్కడెక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా ఇంటిపట్టునే ఉం టే.. ఉద్యోగం చేసుకునేలా ఉపాధి చూపనుంది. ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో కూటమి సర్కారు పెద్దలు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

Updated Date - Apr 14 , 2025 | 07:21 AM