Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:01 PM
Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులోని జీజీహెచ్ వద్ద హంగామా చేశాడు. ముఖానికి మాస్క్ వేసుకోమంటే.. వేసుకొనంటూ నిరాకరించాడు. అలాగే అతడిని విలేకర్ల సమావేశంలో పెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అతడు ఈ సమావేశానికి రానంటూ పోలీస్ వాహనంలోనే కూర్చొండి పోయారు. దీంతో చేసేది లేక పోలీసులు అతడికి కోర్టులో హజరుపరిచేందుకు తరలించారు.

గుంటూరు, ఏప్రిల్ 11: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ అరెస్ట్ వివరాలను విశదీకరించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో చేబ్రోలు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశామని.. ఆ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న అతడిపై చుట్టగుంట వద్ద గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని తెలిపారు.
అయితే గోరంట్ల మాధవ్.. పోలీసులపై జులుం ప్రదర్శించడమే కాకుండా.. వారి విధులకు సైతం ఆటంకం కలిగించారన్నారు. ఇది నేరపూరత చర్య అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ దాడిలో గోరంట్ల మాధవ్‌తోపాటు మరో ఐదుగురు పాల్గొన్నారని వివరించారు. ఇక ఎస్పీ కార్యాలయం వద్ద సైతం చేబ్రోలు కిరణ్ కుమార్‌పై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు.
వైఎస్ భారతీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌ను.. అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అరెస్ చేసి గుంటూరు తీసుకు వచ్చారు. ఆ క్రమంలో చేబ్రోలు కిరణ్ కుమార్‌పై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. అటు నుంచి నల్లపాడు పీఎస్ తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఇక శుక్రవారం అంటే ఈ రోజు.. గోరంట్ల మాధవ్‌ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు.
గోరంట్ల మాధవ్ హంగామా..
ఇక వైద్య పరీక్షల అనంతరం మాధవ్ ముఖానికి మాస్క్ వేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అందుకు అతడు ససేమీరా అన్నాడు. దీంతో మాస్క్ వేసుకోవాలంటూ మాధవ్‌ను పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. మాస్క్ వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ఇక మీడియా సమావేశానికి రావలంటూ పోలీసుల కోరాగా.. రానంటూ వారికి ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ సమాధానం ఇచ్చాడు. దీంతో గోరంట్ల మాధవ్‌ను పోలీస్ ఉన్నతాధికారులు ప్రాథేయపడుతున్నట్లు తెలిసింది. అయితే.. ఎంపీగా పని చేసిన వ్యక్తిని ఎలా మీడియా సమావేశంలో ప్రవేశపెడతారంటూ గోరంట్ల మాధవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగి.. భీష్మించుకోవడంతో.. అతడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టకుండానే.. నేరుగా కోర్టుకు పోలీసులు తరలించారు.
కోర్టు వద్దకు మాజీ మంత్రులు..
ఇక కోర్టు వద్దకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జునతోపాటు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో కోర్టు వద్ద పోలీసులతో గోరంట్ల మాధవ్‌తోపాటు వైసీపీ నేతలు.. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
For Andhrapradesh News And Telugu News