Share News

MBBS Exam Cheating Inquiry: సిద్ధార్థ కాలేజీలో కాపీయింగ్‌పై విచారణ

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:56 AM

రాష్ట్రంలో మరో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో కొత్త కాలేజీని ప్రభుత్వం అనుమతించింది

MBBS Exam Cheating Inquiry: సిద్ధార్థ కాలేజీలో కాపీయింగ్‌పై విచారణ

  • ఎంబీబీఎస్‌ పరీక్షల్లో ‘చూచిరాత’లపై ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం

  • సమగ్ర విచారణకు డీఎంఈకు ఆదేశం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘‘సిద్ధార్థలో ‘శంకర్‌దాదాలు’’ కథనంపై స్పందించిన ఆయన.. కాపీయింగ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని డీఎంఈ డాక్టర్‌ నరసింహంను ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఏ స్థాయిలో అధికారులు సహకరించారు? అన్న అంశాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. కాపీయింగ్‌కు దారితీసిన వ్యవస్థాగత, వ్యక్తిగత లోపాలపై దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకొనే దిశగా నివేదిక ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగవారం మంత్రి సత్యకుమార్‌ ఒక ప్రకటన చేశారు. సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో గత వారం ఐదుగురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఇందులో నలుగురు మంగళగిరిలోని ఓ ప్రముఖ మెడికల్‌ కాలేజీకి చెందిన వారు ఉన్నారు. కాపీయింగ్‌కు కాలేజీ ఎగ్జామినేషన్‌ విభాగం ఉద్యోగులు, సిబ్బంది సహకరిస్తున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ గతవారం కథనం ఇచ్చింది.


రాష్ట్రంలో మరో హోమియో కాలేజీ

మరోవైపు ఆయుష్‌ వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో హోమియోపతి కాలేజీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవుల గ్రామంలో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో 4 హోమియోపతి కాలేజీలు ఉండగా.. కొత్త కాలేజీ ఏర్పాటుతో వాటి సంఖ్య ఐదుకు చేరుతుంది. ఈ కాలేజీల్లో బిహెచ్‌ఎంఎస్‌ కోర్సులకు సంబంధించి 100 సీట్లు అందుబాటులోకి వస్తాయి.

Updated Date - Apr 16 , 2025 | 07:00 AM