Space Docking : ఇక డాకింగ్‌పై గురి..!
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:30 AM
అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం రాత్రి ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఈ నెల 7న ఉండొచ్చన్న ఇస్రో
ఇస్ట్రాక్ సెంటర్ నుంచి పర్యవేక్షణ
జనవరిలో వందో ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట, డిసెంబరు 31: అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం రాత్రి ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రయోగంలో మిగిలింది అసలు సిసలైన డాకింగ్ (రెండు ఉపగ్రహాల అనుసంధానం) ఘట్టమే. దీనిపై ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. డిసెంబరు 31 నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇస్ట్రాక్ సెంటర్ నుంచి వీటిని పర్యవేక్షిస్తారని చెప్పారు. డాకింగ్ ప్రక్రియ బహుశా జనవరి 7న ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతున్నాయని కొద్ది రోజుల తర్వాత వాటిని దగ్గరకు చేర్చి మరో వారం రోజుల్లో డాకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కాగా.. ఈ మిషన్‌లో పీఎ్‌సఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పోయెమ్-4) ద్వారా పంపిన మరో 24 పేలోడ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సోమనాథ్ తెలిపారు. వాటిలో అంకుర సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థలతోపాటు ఇస్రో కేంద్రాల నుంచి రూపొందించిన పేలోడ్లు ఉన్నాయన్నారు. వాటిని దిగువ కక్ష్యలోకి తీసుకురానున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి అవి అనేక పరిశోధనలు చేస్తాయని వివరించారు. పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో గర్వంగా ఉందని, త్వరలోనే స్పేడెక్స్ మిషన్ లక్ష్యాన్ని కూడా పూర్తిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రైవేటు సంస్థ అందించిన ఉపగ్రహాలు
స్పేస్ డాకింగ్ కోసం ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) అనే జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఒక్కోటి 220 కేజీల బరువుండే ఈ శాటిలైట్లను అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) అనే ప్రైవేటు పరిశ్రమ అందించింది. కొన్నేళ్లుగా ఇస్రోతో అనుబంధం కొనసాగిస్తున్న ఏటీఎల్... ఇస్రో సహకారంతో వాటిని రూపొందించింది. ‘ఇప్పటివరకు ప్రైవేటు పరిశ్రమలు ఇలాంటి పెద్ద ఉపగ్రహాలను సొంతంగా తయారు చేయలేదు. అయితే ఈ రెండు ఉపగ్రహాలను రూపొందించి వాటిని పరీక్షించడం ఇదే తొలిసారి’ అని యూఆర్‌రావు స్పేస్ సెంటర్ (యూఆర్‌ఎ్‌ససీ) డైరెక్టర్ ఎం శంకరన్ తెలిపారు. ఈ మిషన్ విజయవంతమైతే ప్రైవేటు పరిశ్రమ రంగానికి మేలు చేస్తుందని చెప్పారు.
త్వరలో శ్రీహరికోటలో ఇస్రో సెంచరీ
ఇస్రో ప్రధాన కార్యాలయం ఉన్నది బెంగళూరులో అయినా.. రాకెట్ ప్రయోగాలు ఎక్కువగా చేపట్టేది మాత్రం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోనే. ఈ క్రమంలో ఇక్కడి సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) అరుదైన రికార్డుకు చేరువైంది. ఈ జనవరిలో ఇస్రో జీఎ్‌సఎల్వీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది శ్రీహరికోటలో చేపట్టే 100వ ప్రయోగంగా రికార్డులకెక్కనుంది. స్పేడెక్స్ మిషన్ కోసం డిసెంబరు 30న.. ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ప్రయోగం ఇక్కడ 99వది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. కొత్త ఏడాది ఆరంభంలో ఇక్కడ వందో ప్రయోగానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. జీఎ్‌సఎల్వీ ప్రయోగం ద్వారా నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎ్‌స-02ను జనవరిలో ప్రయోగిస్తామని తెలిపారు. 2023 మే నెలలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-01 అనే శాటిలైట్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.