Nara Lokesh: తప్పులు చేయబట్టే జగన్ ప్రజల్లో తిరగలేకపోతున్నారు
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:06 AM
నారా లోకేశ్ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జైలులో ఉన్న వ్యక్తి లాంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలకు ఎలాంటి పరిష్కారం చూపించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు

తప్పుడు ప్రచారాలను ఆపేందుకే రెడ్‌బుక్ మాట
ప్రవీణ్ మృతిపై పారదర్శక దర్యాప్తు: లోకేశ్
మీరు మంచి చేయలేదు.. మేం చేస్తే సహించలేరు
విజనరీ చంద్రబాబుకు, ప్రిజనరీ జగన్‌కు ఎంతో తేడా
రాష్ట్రాభివృద్ధి, యువత ఉపాధికి సీఎం నిరంతర కృషి
పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా దర్యాప్తు
రైతులకు గిట్టుబాటు ధరపై చిత్తశుద్ధితో ప్రభుత్వం
మంగళగిరి నియోజకవర్గంలో ఓ పేద కుటుంబానికి శాశ్వత ఇంటి పట్టా అందజేసిన మంత్రి లోకేశ్
మంగళగిరి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ‘జగన్ ఒక ప్రిజనరీ (జైలుకు వెళ్లిన వ్యక్తి). ఆయనవన్నీ తప్పుడు ఆలోచనలే! నిత్యం తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టే ఆయన ధైర్యంగా ప్రజల మధ్య తిరగలేకపోతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎవర్నీ కలవలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతా కనీసం తన పార్టీ కార్యకర్తలను కూడా కలిసే తీరిక ఆయనకు లేదు. అసలు ఆయనకు ప్రజలను కలిసే ఓపిక ఎక్కడుంది..?’ అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో గురువారం ఒక నిరుపేద కుటుంబానికి ఆయన శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎంపై విరుచుకుపడ్డారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఐదేళ్ల పాటు ఆయన నివసించిన ప్రాంతంలోని ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. పైగా ఆయన ఇంటి దారి కోసం పేదోళ్ల ఇళ్లను కూల్చివేయించారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిసున్నారని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని, తప్పు చేసిన వారెవరైనా వదిలే ప్రసక్తే లేదని లోకేశ్ స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారాలకు దిగితే..
‘జగన్ అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్ష నేతల పర్యటనలను పదేపదే అడ్డుకున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. మేం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. మేం ఎక్కడా ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళ్లను కట్టించలేదు. ఎవరిపైనా తప్పుడు కేసులు బనాయించలేదు. జగన్ స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్లగలిగేలా అవకాశం కల్పించాం. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కంటే ఎక్కువగా జగన్‌కు జడ్ ప్లస్ భద్రత కల్పించాం. ఇంకేం కావాలి? వాళ్లు తప్పుడు ప్రచారాలకు దిగితే.. వాటిని ఎలా తిప్పికొట్టాలో మాకు బాగా తెలుసు’ అని లోకేశ్ పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తాము ప్రాజెక్టులు తెస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మంటగా ఉందని దుయ్యబట్టారు. అందుకే తాను తాజాగా రెడ్‌బుక్ ప్రస్తావన చేయాల్సి వచ్చిందన్నారు. ‘కనిగిరిలో ఉపాధి కోసం 35 వేల మంది వలసలు పోతున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వలసలను నివారిస్తానని మాట ఇచ్చా. అందుకే అక్కడ తొలి రిలయన్స్ సీబీజీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి 50 వేల ఎకరాలను ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పగా.. రిలయన్స్ డైరెక్టర్ స్పందించి 50 ప్లాంట్లను అక్కడే ఏర్పాటు చేయిస్తామని అన్నారు. దీనికే వైసీపీ వాళ్లకు కడుపు మంటగా వుంది. దానిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే.. అలాంటి వారి పేర్లను రెడ్‌బుక్‌లోకి ఎక్కిస్తానని చెప్పాను’ అని లోకేశ్ వివరించారు.
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నిరంతర కృషి
విజనరీ లీడర్ చంద్రబాబుకు, ప్రిజనరీ జగన్‌కు ఎంతో తేడా ఉందని లోకేశ్ పునరుద్ఘాటించారు. రోజురోజుకు వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో నాడు ఐటీని ప్రవేశపెట్టడంతోనే నేడు లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు లభించాయన్నారు. నిరుపేదలను పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తేవాలన్న లక్ష్యంతో పీ-4 విధానానికి రూపకల్పన చేసి, ప్రారంభించారని గుర్తుచేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ తదితరులతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ రైతులు నష్టపోకుండా చూస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 05:07 AM