Visakhapatnam Police: పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపలేదు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:30 AM
పెందుర్తి వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కాన్వాయ్‌ను మధ్యలైన్‌లో పంపినప్పటికీ, సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు

విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ స్పష్టీకరణ
విశాఖపట్నం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ ఐయాన్ డిజిటల్ కేంద్రంలో సోమవారం కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయలేకపోవడానికి డిప్యూటీ సీఎం కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడమే కారణమని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అల్లూరి జిల్లా పర్యటన కోసం సోమవారం ఉదయం 8.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా ఏఎ్‌సఆర్ జిల్లాకు వెళ్లారని చెప్పారు. పవన్ కాన్వాయ్‌ను బీఆర్‌టీఎస్ మధ్య లైన్‌లో పంపించడంతో, దానికి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అనుమతించామని తెలిపారు. కాన్వాయ్ కోసం ఎక్కడా ట్రాఫిక్‌ను ఆపలేదన్నారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను మీడియాకు విడుదల చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోవడానికి కారణం ఏమిటనేది తమకు తెలియదన్నారు.
ట్రాఫిక్‌ను నిలిపేయడం వల్లే పరీక్షా కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నామని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన వీడియోలను మీడియా ప్రతినిధులు ట్రాఫిక్ ఏడీసీపీకి చూపించగా.. ఆయన ఖండించారు. బీఆర్‌టీఎస్ రోడ్డు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డులో ఇతర వాహనాల రాకపోకలు సాగుతున్నట్టు కనిపిస్తుంటే.. వారి ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలా..? లేదా..? అనే విషయాన్ని మీడియానే ఆలోచించుకోవాలని అన్నారు.