Andhrapradesh Division Act: పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:46 PM
Andhrapradesh Division Act: అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖ త్వరిగతిని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం (Central Govt) దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే (Amaravati Hyderabad Greenfield Express Highway) పట్టాలెక్కనుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు, ఉపరితల రవాణా సత్వర చర్యలను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీంతో తొందరల్లోనే అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ ఉత్తర భాగం అనుమతులు రానుండగా.. ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో గత నెల 3న జరిగిన కేంద్ర హోం శాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చట్టంలోని లేని ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అంశాలపైనా పురోగతి లభించింది. ఫిబ్రవరి 3న కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశానికి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కేంద్రం కీలక నిర్ణయాలు
ఏపీ ఎస్‌ఎఫ్‌సీ విభజన, విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులు అప్పులు పంచుకోవడం, రోడ్డు, రైలు, విద్యా సహా అనేక అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖ త్వరిగతిని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
రెండేళ్లలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు షురూ
ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. మరో రిఫైనరీ ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు హోం శాఖ ఆదేశించింది. రెండు ఏళ్ళలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రైల్వే బోర్డు ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ కర్నూల్ కారిడార్ ఏర్పాటును కేంద్ర రైల్వే శాఖ పరిశీలించనుంది.
ఆ ఆస్తులపై ఉత్తర్వులకు ఆదేశం
అలాగే వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్‌కు సంబంధించి ఏపీకి పెండింగ్ ఉన్న మరో రూ.350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవసాయశాఖ వెల్లడించింది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందిందని, కొద్ది రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు అందుతుందని దాని ఆధారంగా ముందకు వెళతామని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలపై పరిష్కారానికి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది. షెడ్యూల్ 9లోని సుమారు 53 కార్పొరేషన్లు, కంపెనీల ఆస్తుల విభజనపై ఉత్తర్వులు విడుదల చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ విభజనపై హైకోర్టులో ఉన్న స్టే ఎత్తివేశాక తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అటార్నీ జనరల్ అభిప్రాయంతో
షెడ్యూలో 9, 10 లోని సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల విభజన పంపకంపై కోర్టు చిక్కులు ఉన్నందున తదుపరి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. చట్టం లేని 12 సంస్థలకు సంబంధించి ఉత్తర్వులను ఏపీ కోరగా అందుకు కేంద్ర హోం శాఖ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధులకు సంబంధించి త్వరితగతిన పరిష్కారానికి కాగ్‌కు కేంద్ర హోంశాఖ లేఖ రాయనుంది. ఉమ్మడి సంస్థల నిర్వహణపై తెలంగాణ పెట్టిన ఖర్చు తిరిగి చెల్లింపుకు సంబంధించి వీలైనంత త్వరగా తేల్చాలని కూడా కాగ్‌ను కోరాలని నిర్ణయించారు. ఏపీలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే 135 కోట్లు విడుదల చేశామని, అయితే పూసా సౌత్ క్యాంపస్‌ను నెలకొల్పాలని ఏపీ చేసిన ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
విజయవాడ, విశాఖ మెట్రోలైన్ ప్రాజెక్టుపై
విజయవాడ, విశాఖ పట్నం విమానాశ్రయాల్లో ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, రెండు విమానాశ్రయాల విస్తరణ పనులు వీలైనంత త్వరగా పూర్తవుతాయని ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ వెల్లడించారు. అప్పటివరకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించేలాని చూడాలని రైల్వే బోర్డుకు కేంద్ర హోం శాఖ సూచించింది. అమరావతి అనంతపూర్ ఎక్స్ ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్‌లు రూపొందించాలని, అనుమతులు ఇవ్వాలని ఏపీ కోరగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా సంబంధిత శాఖకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డును ముందుగా అనుకున్నట్లు 6 లైన్లలో 70 మీటర్ల నిడివితో నిర్మించాలన్న ప్రతిపాదనకు ఇప్పటికే అలైన్ మెంట్ పూర్తయిందని మరో నాలుగు నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదంకు వెళుతుందని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అమరావతి రైల్వే కనెక్టెవిటీ కోసం ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు సెక్షన్ పనులు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో లైన్ ప్రాజెక్టులకు మరింత సమాచారం రావాల్సి ఉందని కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.
జాతీయ రహదారులు రెండింతలు విస్తరణ
వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 2700 గ్రాంట్స్‌పై నీతి అయోగ్ దృష్టికి తీసుకువెళ్ళాలని తెలంగాణా అధికారులకు సూచించింది. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని ఇప్పటికే కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినందున ప్రైవేటు0 సంస్థలతో కలిసి తెలంగాణా ప్రభుత్వం ముందుకు వెళ్ళే ప్రతిపాదననను పరిశీలించాలని తెలంగాణా ప్రభుత్వానికి సూచించింది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అలైన్‌మెంట్ పూర్తి అయిందని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది దశలో ఉందని ఇప్పటికే టెండర్లు పిలిచామని, మరో నాలుగు నెలల్లో డీపీఆర్ పూర్తి అవుతందని రోడ్లు ఉపరితల రవాణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణభాగం అలైన్‌మెంట్, డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాల్సి ఉందని, ఉత్తర భాగం డీపీఆర్‌ను ఖరారు చేశాక దక్షిణ భాగం ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. విభజన అనంతరం అంతకముందు ఉన్న దానితో పోలిస్తే తెలంగాణాలో జాతీయ రహదారులను రెండింతలు విస్తరించామని సంబంధిత అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అలైన్‌మెంట్ పూర్తి అయిందని, ఆమోదం దశలో ఉందని, హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ కూడా ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు.
రెండు నెలలకోసారి సమావేశం
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ ప్రారంభమైందని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. హైదరాబాద్ (ఓఆర్‌ఆర్ ) మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన అంశాలు పరిష్కారం అయ్యాయని పనులు చేపట్టామని అధికారులు చెప్పారు. ఖాజిపేటలో రైల్వే కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు అయిందని కోచ్‌ల ఉత్పత్తి కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని , సమస్య పరిష్కారం అయిందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు తెలంగాణ అధికారులు. తెలంగాణాలో రైల్వే ప్రాజెక్టులు విస్తరణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. తదుపరి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, విద్యా సంస్తల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్ సెంటర్ ఏర్పాటుపై చర్చిద్దామని సమావేశంలో నిర్ణయించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించగా ప్రతి రెండు నెలలకొకసారి సమావేశ నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
Read Latest AP News And Telugu News
Read Latest Telangana News And Telugu News