MLC Ashok Babu: ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:18 PM
MLC Ashok Babu: ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీల్లో భారతీయులే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తు యువతదే అని చెప్పారు.
విజయవాడ: కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ(ఆదివారం) జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శారద దేవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ... ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశానికి యువత ఆస్తి అని.. మంత్రి నారా లోకేశ్ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీల్లో భారతీయులే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తు యువతదే అని చెప్పారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పన మీద దృష్టి సారించిందని అన్నారు. యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 01:39 PM