బోర్డర్ దాటుతున్న ఇసుక
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:26 AM
తిరువూరు మీదుగా తెలంగాణ ప్రాంతానికి యథేచ్ఛగా రోజుకు 15 నుంచి 20 టిప్పర్లు ఇసుకను అనధికారికంగా తరలించుకుపోతున్నాయి.

తిరువూరు మీదుగా తెలంగాణకు రోజుకు 15 నుంచి 20 టిప్పర్లలో తరలింపు
(తిరువూరు-ఆంధ్రజ్యోతి): తిరువూరు మీదుగా తెలంగాణ ప్రాంతానికి యథేచ్ఛగా రోజుకు 15 నుంచి 20 టిప్పర్లు ఇసుకను అనధికారికంగా తరలించుకుపోతున్నాయి. అయినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కంచికచర్ల, నందిగా మ ఇసుక రీచ్‌ల నుంచి టిప్పరుకు 40 టన్నుల ఇసుక లోడు చేసుకుని ఉదయానికి ఎ.కొండూరు ప్రాంతంలోని ఖాళీ స్థలం లో కొన్ని, తిరువూరు బైపా్‌సరోడ్డులోని స్థలంలోకి కొన్ని చేరుకుంటాయి. తిరువూరు ప్రాంతంలో ఈ టిప్పర్లను నిర్వహించే వ్యక్తి తెలంగాణలో ఇసుక ఎవరికి అవసరమో తెలుసుకుని, సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుని వస్తాడని, సాయంత్రానికి కొందరు వ్యక్తులు ఖాకీ దుస్తులు ధరించి, ప్రైవేటు వాహనంలో బోర్డర్ వద్ద రెక్కీ నిర్వహించి, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక టిప్పర్ల వద్ద ఉండే వ్యక్తికి సమాచారం అందిస్తారని, తర్వాతే ఈ టిప్పర్లు బోర్డర్ దాటి తెలంగాణలోకి వెళుతుంటాయని కొందరు చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంత టాక్సీ ప్లేటు వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు టెంపరరీ పర్మిట్ తీసుకోవాలి. కానీ, ఈ టిప్పర్లకు అనుమతులు లేకుండానే నేరు గా బోర్డర్ దాటుతున్నాయి. పట్టణ శివారులోని ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ చెక్‌పోస్టు వద్ద పోలీసు సిబ్బంది లేకపోవడం, గతంలో బైపా్‌సరోడ్డులో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టు తొలగించడంతో, అనధికార రవాణాకు అడ్డంకి లేకుండా పోతోంది. కొన్నిసార్లు పగలే ఇసుక టిప్పర్లు తెలంగాణ ప్రాంతానికి తరలి వెళుతున్నాయి.
అనధికార రవాణా చేస్తే పీడీ యాక్టు పెడతాం
ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రవాణాదారులపై పీడీ యాక్టు పెడతాం. ఇప్పటి వరకు 7 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నాం. బోర్డర్ వద్ద ప్రత్యేక నిఘా పెడతాం.
-కేవీజీవీ సత్యనారాయణ, పట్టణం సెక్టార్-1 ఎస్సై