Deveineni Uma Maheswara Rao: టీడీపీ ఆ విషయం మరోసారి రుజువు చేసింది: దేవినేని ఉమా..
ABN , Publish Date - Mar 10 , 2025 | 02:58 PM
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేలా టీడీపీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్నే సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. టీడీపీ ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ పెద్దల సభలో ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు.

అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుని ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించేలా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారని కొనియాడారు. ముగ్గురు అభ్యర్థులూ పెద్దల సభలో ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొడతారని ఆశిస్తున్నట్లు మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీకి వెన్నెముక లాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారనే విషయం మరోసారి రుజువైందని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.."ముఖ్యమంత్రి చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయాలతో అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. అన్ని వర్గాలనూ ప్రోత్సహిస్తూ విద్యావంతులు, యువతకు టీడీపీ సముచిత అవకాశాలు కల్పిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ యువత, విద్యావంతులు, వివిధ వృత్తులలో ఉన్నవారికి, మహిళలు, గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేసిన ఎన్టీఆర్ విధానాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎస్సీ, బీసీ, మహిళ, విద్యావంతుల సమ్మేళనంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు.. శాసనమండలిలో పార్టీ, ప్రజల వాణిని వినిపించాలని ఆకాంక్షిస్తున్నా.
వీరంతా ప్రతిపక్ష నేతల కుటిల విమర్శలను తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేయాలి. వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలను అవినీతిని ఎండగట్టడంలో ముందుండాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ దాష్టికాలను ఎదిరించిన ప్రతిభా భారతి కుమార్తె, జస్టిస్ పుల్లయ్య మనుమరాలు గ్రీష్మ పెద్దల సభలో సమర్థవంతంగా తన వాణి వినిపించాలి. పార్టీ పదవి ద్వారానే నెల్లూరు జిల్లాలో అందరినీ సమన్వయం చేసి రైతాంగ సమస్యలపై పనిచేసిన బీద రవిచంద్ర యాదవ్.. పార్టీ ఇచ్చిన అవకాశంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటున్నా. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా ఆయనకు, పార్టీ కార్యకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరించి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న బీటీ నాయుడు సైతం ప్రజా సమస్యలపై పోరాడాలని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vamsi Case: వల్లభనేని వంశీ కోరికను అంగీకరించిన జైలు అధికారులు
Anitha: జగన్ పాలన అలా ఉంది.. హోం మంత్రి అనిత ధ్వజం