Srisailam: శ్రీ బ్రమరాంబ దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం
ABN , Publish Date - Apr 15 , 2025 | 08:00 AM
జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరి భ్రమరాంభికగా ఆదిశక్తి పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఏటా ఛైత్ర మాసం కృష్ణ పక్షంలో వార్షిక కుంభోత్సవం జరుగుతుంది.

నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో మంగళవారం శ్రీభ్రమరాంబికా దేవి (Sri Bhramaramba Devi) అమ్మవారికి వార్షిక కుంభోత్సవం (Kumbhotsavam) వైభవంగా జరుగుతోంది. లోకళ్యాణార్ధం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. ఈరోజు సాయంత్రం ఆది దంపతులకు వెండి రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అలాగే సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద అన్నాన్ని రాశిగా పోసి.. ప్రదోశకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో భ్రమరాంబాదేవికి కుంభహారతి సమర్పించనున్నారు. తర్వాత నవకాయ పిండివంటలతో మహానివేదన సమర్పిస్తారు. కుంభోత్సవం నేపథ్యంలో ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Also Read..: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..
సాయంత్రం రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరికాయలు, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పిస్తారు. కుంభహారతి సమయంలో భ్రమరాంబాదేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియను నిర్వహిస్తారు. ఉత్సవం ముగిసిన తర్వాత భక్తులను అమ్మవారి భ్రమరాంబికా దేవి నిజరూప దర్శనానికి అనుమతి ఇస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే కుంభోత్సవం క్షేత్ర రక్షణ కోసం ఏటా ఛైత్రమాసంలో పౌర్ణమి తర్వాత నిర్వహిస్తారు. కాగా ఈ కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవలను రద్దుచేశారు.
కాగా ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమన్వయ సమావేశం పరిపాలన భవనంలో నిర్వహించారు. కుంభోత్సవంలో ఆయా కైంకర్యాలన్నిటినీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక కమిటీకి సూచించారు. క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షి బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతుబలి నిషేధానికి పోలీస్, రెవెన్యూ సిబ్బంది కూడా వారి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలానే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాటు చేస్తామన్నారు. కుంభోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనాల కోసం భక్తులు రద్దీ వల్ల క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా క్యూ లైన్ల నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా
For More AP News and Telugu News