Share News

వైభవంగా భ్రామరి కుంభోత్సవం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:25 AM

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

వైభవంగా భ్రామరి కుంభోత్సవం
రాశిగా పోసిన అన్నం

హారతి ఇచ్చిన స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు

శ్రీశైలంలో నిజరూపాలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

శ్రీశైలం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తోంది. ఇందులో భాగంగానే భ్రమరాంబికాదేవి ఆలయాన్ని గుమ్మడికాయలు, నిమ్మకాయలు, పుష్పాలతో సుందరీకరించారు. ఉదయాన్నే అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. అనంతరం నవావరణ పూజ, ఖడ్గమాల, త్రిశతి, అష్టోత్తర కుంకుమ పూజలు, పారాయణాలు నిర్వహించారు. అలాగే రజకుని చేత అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం వద్ద ఆనవాయితీ ప్రకారం ముగ్గువేయించి కుంభోత్సవానికి నాందిపలికారు. అలాగే హరిహరరాయ గోపురం వద్ద గల మహిషాసురమర్దిని అమ్మవారికి పూజాదికాలు జరిపి ఆ తర్వాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలతో స్వాత్వికబలిని సమర్పించారు. పసుపు, కుంకుమను సమర్పించి అమ్మవారికి శాంతి ప్రక్రియ క్రతువును సంప్రదాయబద్ధంగా పూర్తిచేశారు. సాయంత్రం ప్రదోషకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేసి ఆలయాన్ని మూసివేశారు. అదేవిధంగా అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న సింహ మంటపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా పోశారు. ఆ తర్వాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించారు. ఆ తర్వాత రెండో విడతగా అమ్మవారికి గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో సాత్వికబలిని ఇచ్చారు. చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి పిండివంటలతో మహానివేదన ఇచ్చారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాజకుమారి, ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

నిజరూపాలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

శ్రీశైలంలో జరిగే కుంభోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం భ్రమరాంబికాదేవి అమ్మవారు నిజరూప అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాది కుంభోత్సవం జరిగే రోజున మాత్రమే అమ్మవారు నిజరూప అలంకరణతో దర్శనమివ్వడం ఇక్కడ సంప్రదాయబద్ధంగా వస్తోంది. మిగతా రోజు అమ్మవారు విశేషమైన అలంకరణతో శాంతిస్వరూపిణిగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించేవారు. అయితే కుంభోత్సవం సందర్భంగా భ్రామరి అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అమ్మవారి నిజరూప దర్శన సమయంలో మల్లికార్జునస్వామి దర్శనాన్ని నిలిపివేశారు.

పల్లకీ ఉత్సవం

స్వామి, అమ్మవార్ల పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:25 AM