కార్పొరేట్ హాస్పిటళ్లకు సమానంగా సౌకర్యాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:29 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్పొరేట్‌కు ధీటుగా రోగులకు భరోసా కల్పించేలా మెరుగైన వైద్యం, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ఆసుపత్రిలో సేవలన్నీ కంప్యూటరైజ్డ్
డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో పరీక్షల నివేదికలు త్వరగా ఇవ్వాలి
మరిన్ని క్యాంటీన్లు, జీవనాధార కేంద్రాల ఏర్పాటు
20 నెలల తర్వాత జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్పొరేట్‌కు ధీటుగా రోగులకు భరోసా కల్పించేలా మెరుగైన వైద్యం, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశం కలెక్టర్ పి.రంజిత్ బాషా అధ్యక్షతన జరిగింది. మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ డా.కే.చిట్టి నరసమ్మ హాజరయ్యారు.
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇంకా ఇండెంట్స్ మాన్యువల్‌లో ఉంటున్నాయని, ఏదీ కూడా ఆఫ్‌లైన్‌లో ఉండకూడదని వచ్చే సెప్టెంబరులోపు రోగులకు అందించే అన్ని సేవలు ఆన్‌లైన్‌లో కంప్యూటరైజ్డ్ చేయాలని ఆదేశించారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో పార్కింగ్ ఎందుకుచేయలేక పోతున్నారనీ మంత్రి మండిపడ్డారు. లిఫ్టులు, జనరేటర్ల పనులన్నీ సీఎంసీ కిందకు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఏ పరికరాలైన సీఎంసీ కింద ఉండే విదంగా కొటేషన్ తీసుకోవాలన్నారు.
ఆసుపత్రిలో 24 గంటలు కరెంటు ఉండేలా కరెంటు పోయిన వెంటనే వచ్చే విదంగా ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
పందుల సంచారం ఎక్కువగా ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని, పందుల పెంపకందారులను పిలిపి పోలీసులు మాట్లాడాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అధికారులకు సూచించారు.
ఆసుపత్రిలో మరికొన్ని క్యాంటీన్లు జీవనధార షాపులను రోగులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆసుతప్రికి ఓపీ ల్యాండ్స్ నిధులతో అంబులెన్సులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆమోదించిన తీర్మానాలు
కొత్త సిటీ స్కాన్ కోసం ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో, ఇతర సిబ్బంది నియమిం చేందుకు నివేదికలు ఇవ్వాలి.
ఆసుపత్రిలో రోగుల సంఖ్యను బట్టి మరిన్ని జీవనాధార, క్యాంటీన్లు ఏర్పాటు
ప్రధాన ద్వారం ఇన్‌గేటు ఏర్పాటుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి కమిటీ ఏర్పాటు.
ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు నిర్వహించే సివిల్ పనులు వేగవంతం చేయాలని, క్యాజువాల్టీ బాత్‌రూమ్‌లు, ఇతర విభాగల్లో డ్రైనేజీ లైన్లను ఎస్‌టీపీకి అనుబంధించడం సూపర్ స్ఫెషాలిటీ ఓపీ కౌంటర్లను త్వరగా నిర్మాణాలు చేపట్టాలి.
మార్చురీలో ఆరు బాడీ ఫ్రీజర్లను హెచ్‌డీఎస్, సీడీఎస్ నిధుల కింద కొనుగోలు చేయాలి.
కంప్యూటరైజ్ చేయాలి
ఐపీడీ బ్లాక్ నిధులను తెప్పించడానికి కృషి చేయాలని తీర్మానం చేశారు.
నిర్ధారణ పరీక్షలు త్వరగా ఇవ్వాలి : గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
న్యూ డయాగ్నోస్టిక్ బ్లాకులో రోగ నిర్ధారణ పరీక్షలు నివేదికలు ఆలస్యం అవుతున్నాయని, రోగులకు రిపోర్టులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి సూచించారు. ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల వివరాలు రిపోర్టులను ఇస్తే వైద్యం త్వరగా అందుతుందని, వీలతై వాట్సాప్ మెసేజ్ ద్వారా రిపోర్టులు ఇవ్వాలని కోరారు. మార్చురీలో సౌకర్యాలు కల్పిం చాలని శానిటేషన్, సెక్యూరిటీ సేవలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ట్రాలీలు, వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలి : బొగ్గుల దస్తగిరి, కోడుమూరు ఎమ్మెల్యే
రోగుల పరీక్షల కోసం అవస్థలు పడుతున్నారని, వీల్ చైర్లు ట్రాలీలను అదనంగా ఏర్పాటు చేయాలని కోడుమురు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు. ఐసీయూలో ఫ్లోరింగ్ సరిగ్గా లేదని సిటీ స్కాన్ వద్ద రద్దీ ఉందని, అదనంగా ఏర్పాటు చేయాలని కోరారు.
అడిషినల్ డీఎంఈ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫోరెన్సిక్ విభాగంలోని ఎలక్ర్టిషన్ పనులు పునరుద్దరించాలని, హెచ్‌డీఎస్ నిధులతో మూడు, సీడీఎస్ నిధులతో మూడు, బాడీ ఫ్రీజర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో డా.బి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళ, డీసీహెచ్‌ఎస్ డా.శ్రీనివాసులు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ సింధు సుబ్రమ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, హెచ్‌డీఎస్ సభ్యులు బైసాని పద్మజ, బోయ రామాంజనేయులు, సాయిప్రదీప్, రంగనాథరెడ్డి, డా.ప్రవీణ్ పాల్గొన్నారు.
సమావేశం స్థలం మార్పు ఎందుకో..?
మధ్యాహ్నం తరువాత కలెక్టరేట్‌కు వేదిక మార్పు
కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహణ స్థలం మారింది. సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు హెచ్‌డీఎస్ సమావేశం జీజీహెచ్‌లోని ధన్వంతరీ హాలులో నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతూవచ్చారు. గతంలో కూడా ఆసుపత్రిలోనే హెచ్‌డీఎస్ సమావేశం జరిగింది. హెచ్‌డీఎస్ సమావేశం కోసం అధికారులు ధన్వంతరీ హాలులో అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ జనరేటర్ సౌకర్యం కూడా కల్పించారు. అయితే సోమవారం ఉన్న ఫళంగా మధ్యాహ్నం హెచ్‌డీఎస్ సమావేశం వేదికను కలెక్టరేట్‌కు మార్చడంపై చర్చ జరుగుతోంది. ఆసుపత్రిలో సమావేశం నిర్వహిస్తే వాడివేడిగా చర్చ జరుగుతుంది. కలెక్టరేట్‌లో నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమావేశాన్ని విలేకరులు లేకుండా నిర్వహించడం వెనుక మతలబు ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.