అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:28 AM
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ మహోన్నతుడు అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.

యువతకు మంత్రి టీజీ భరత్ పిలుపు
కర్నూలు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ మహోన్నతుడు అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారి, జాయింట్ డైరెక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని పాతబస్టాండులో భారత రత్న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్ర హానికి మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీవో సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేడ్కర్ సమాజంలో అందరికీ సమానహక్కులు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీయే కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలోని విధి విధానాలను సక్రమంగా అమలు పరుస్తున్నదన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ డా. బీఆర్ అంబేడ్కర్ ఏ ఆశయాలతో అయితే.. రాజ్యాంగ పీఠికను రాశారో.. అందులో భాగంగా తమలాంటి బడుగు బలహీనవర్గాల చెందిన వారు కూడా రాజకీయంగా చైతన్యవంతులై చట్టసభల్లో అడుగులు పెట్టి ప్రజల గొంతును అక్కడ వినిపించే అవకాశం కలిగిందన్నారు. కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ డా. బీఆర్ అంబేడ్కర్ అంద రికీ సమానహక్కులు కావాలని, అంటరానితనాన్ని రూపుమాపాలని పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎస్సీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.