Share News

విహారం.. విషాదం..

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:49 AM

కర్నూలు నగరానికి చెందిన ఓ కుటుంబంలో విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రంజాన్‌ పండుగ ముగిసిన సందర్బంగా విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది.

విహారం.. విషాదం..
సులేమాన్‌ , ఇద్దరు కొడుకులు పర్హాన్‌ , ఫైజాన్‌

తుంగభద్ర నదిలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి

సుంకేసులలో దుర్ఘటన

గూడూరు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరానికి చెందిన ఓ కుటుంబంలో విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రంజాన్‌ పండుగ ముగిసిన సందర్బంగా విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల డ్యాం వద్ద తుంగభద్ర నదిలో మునిగి సులేమాన్‌ (47), ఆయన ఇద్దరు కొడుకులు పర్హాన్‌ (13), ఫైజాన్‌ (9) మృత్యువాత పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు లక్ష్మినగర్‌కు చెందిన సులేమాన్‌ రాజ్‌విహార్‌ సమీపంలో ఓ దుస్తుల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. భార్య నస్రీనా బేగం శకుంతల కల్యాణ మండపం వద్ద మరో వస్త్ర దుకాణం నిర్వహిస్తు న్నారు. వీరికి కుమార్తె సోఫియా, ఇద్దరు కొడుకులు ఫర్హాన్‌, ఫైజాన్‌లు సంతానం. తమకు ఉన్నంతలో ముగ్గురు పిల్లలను ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తు న్నారు. సోఫియా పదో తరగతి పరీక్షలు రాసింది. పెద్ద కొడుకు ఫర్హాన్‌ 7వ తరగతి చదవు తుండగా రెండో కుమారుడు ఫైజాన్‌ 2వ తరగతి చదువుతున్నాడు. రంజాన్‌ పర్వదినం ముగియడంతో పాటు మరోవైపు కుమార్తె పదో తరగతి పరీక్షలు పూర్తి కావడంతో సులేమాన్‌, నస్రీన్‌ బేగం తమ ముగ్గురు పిల్లలతో కలిసి సుంకేసుల డ్యాం వద్దకు విహార యాత్రకు వెళ్లారు. అప్పటికే డ్యాం వద్ద వీరి బందువులు కూడా ఉన్నారు. అందరు కలిసి ఆనందంగా గడుపుతుండగా.. సులేమాన్‌ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు సరదాగా నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో వీరు మునిగిపోయారు. లోతును అంచనా వేయకపోవడంతో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించేందుకు నదిలోకి దిగినా అప్పటికే వారు నదిలో గల్లంతయ్యారు. గంటపాటు గాలించి తండ్రీ కుమారుల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్రం రాజోలి పోలీసులు, కర్నూలు జిల్లా గూడూరు మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాజోలి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. బంధువుల ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక్కసారిగా కుటుంబంలో భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో తల్లి నస్రీన్‌ బేగం రోదనలు మిన్నంటాయి.

Updated Date - Apr 03 , 2025 | 12:49 AM