మిగిలిపోయిన టిడ్కో ఇళ్లకు కొత్త మార్గదర్శకాలు
ABN , Publish Date - Mar 14 , 2025 | 03:59 AM
సిబిల్ స్కోర్ లేని లబ్ధిదారులు ఒకే దఫా చెల్లించే విధంగా ప్రోత్సహించాలని, లేకపోతే ఉమ్మడి విక్రయ ఒప్పందాన్ని తిరిగి రాయించాలని బ్యాంకులకు సూచించారు.

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టిడ్కో నిర్మించిన ఇళ్లలో మిగిలిపోయిన ప్లాట్లను కేటాయించేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులుగా ఉండి ఆ ఇళ్లను స్వీకరించేందుకు ఇష్టపడని వారు, అనర్హులు, వలస పోవడం, మరణించడం, తక్కువ సిబిల్ స్కోర్ ఉండటం, వయోపరిమితి సమస్యల కారణంగా మిగిలిపోయిన కొన్ని ప్లాట్లు తిరిగి కేటాయించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు అనుసరిస్తుందని టిడ్కో ఎండీ తెలిపారు. సిబిల్ స్కోర్ లేని లబ్ధిదారులు ఒకే దఫా చెల్లించే విధంగా ప్రోత్సహించాలని, లేకపోతే ఉమ్మడి విక్రయ ఒప్పందాన్ని తిరిగి రాయించాలని బ్యాంకులకు సూచించారు. ఇళ్ల విషయంలో లబ్ధిదారులు సుముఖంగా లేకుంటే మున్సిపల్ కమిషనర్ 15రోజుల గడువుతో నోటీసు ఇచ్చి అమ్మకపు ఒప్పందాన్ని తిరిగి రాయాలని, నోటీసులకు స్పందించకపోతే, కేటాయింపు/అమ్మకపు ఒప్పందాలు రద్దుచేసి ఆ జాబితాను జిల్లా కమిటీ ఆమోదించాలి.
రద్దయిన జాబితాను ఏపీటిడ్కో పోర్టల్, నోటీసుబోర్డు/ అన్ని వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు. కొత్త లబ్ధిదారుల ఎంపికలో గతంలో లబ్ధిదారు వాటా చెల్లించిన, ప్లాట్ కేటాయించని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, జీఎ్‌సడబ్ల్యూఎస్ సిబ్బంది ధ్రువీకరించిన అర్హత కల కొత్త లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ముందుగా 430చ.అ., 365 చ.అ. ప్లాట్లు, తర్వాత 300 చ.అ. ప్లాట్లను కేటాయించాలని తెలిపారు. గతంలో 365 చ.అ. లేదా 430 చ.అ. ప్లాట్లు పొందినవారికి 300 చ.అ. ప్లాట్లు కేటాయించకుండా మున్సిపల్ కమిషనర్లు నిర్ధారించాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రత్యేక హెల్ప్ డెస్క్ ద్వారా అన్ని పట్టణ స్థానికసంస్థలను సమన్వయ పరచాలన్నారు.