కనులపండువగా చెన్నయ్య కల్యాణం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:44 PM
మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కల్యాణ వేడుక కనులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై చెన్నుడు శ్రీదేవి భూదేవి సమేతుడై సర్వాలాంకరణ భూషితుడై వేంచేశారు.

భక్తజనసందోహంతో పులకించిన మార్కాపురం
మార్కాపురం వన్‌టౌన్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కల్యాణ వేడుక కనులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై చెన్నుడు శ్రీదేవి భూదేవి సమేతుడై సర్వాలాంకరణ భూషితుడై వేంచేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు నడుమ దాదాపు 2 గంటల పాటు ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి, వేములకోటకు చెందిన ఆమంచి వెంకటరమణ, ఉత్సవ కమిటీ చైర్మన్‌యక్కలి కాశీవిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తదితరులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మార్మోగింది. పలువురు ఉభయదాతలు కల్యాణ సమయంలో పట్టువస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను నాదెళ్ల సుబ్రహ్మణ్యం, అచ్యుత పెదవెంకటేశ్వర్లు, మేడా వెంకటసుబ్బారావు, గ్రంథే సురేష్ కుటుంబ సభ్యులు సమర్పించారు. నంద్యాలకు చెందిన సంస్కృత పండితులు దివి హయగ్రీవాచారి కల్యాణ ఘట్టాల గురించి చేసిన వ్యాఖ్యానం ఆద్యంతం ఆకట్టుకుంది. యాగ్నీకులు సోమయాజుల మల్లికార్జునశర్మ, పలువురు వేద పండితులు పాల్గొన్నారు. బచ్చు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కల్యాణం అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.