బెట్టింగ్ భూతం
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:56 AM
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఐపీఎల్ పోటీలు ఊపందుకోవడంతో పందేలను కూడా జోరుగా సాగిస్తున్నాయి. టాస్ పడ్డప్పటి నుంచి బెట్టింగ్‌లు ప్రారంభించి మ్యాచ్ ముగిసే వరకూ కొనసాగిస్తున్నాయి. ధనాధన్ టోర్నీలో సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారుతుండగా.. బంతిబంతికీ బెట్టింగ్ వేసి అనేక మంది ఆర్థికంగా ‘ఔట్’ అవుతున్నారు.

ఐపీఎల్ పోరు.. పందేల జోరు
వీధినపడుతున్న కుటుంబాలు
సింగరాయకొండ కేంద్రంగా మాఫియా
వైసీపీ నేత, పాత నేరస్థులపై నిఘా
పోలీసుల ముమ్మర తనిఖీలు
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఐపీఎల్ పోటీలు ఊపందుకోవడంతో పందేలను కూడా జోరుగా సాగిస్తున్నాయి. టాస్ పడ్డప్పటి నుంచి బెట్టింగ్‌లు ప్రారంభించి మ్యాచ్ ముగిసే వరకూ కొనసాగిస్తున్నాయి. ధనాధన్ టోర్నీలో సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారుతుండగా.. బంతిబంతికీ బెట్టింగ్ వేసి అనేక మంది ఆర్థికంగా ‘ఔట్’ అవుతున్నారు. అప్పులపాలై పొలాలు, స్థలాలు అమ్ముకొని వీధిన పడుతున్నారు. కొందరైతే బెట్టింగ్ మాఫియా బెదిరింపులకు భయపడి ఇంట్లో తెలియకూడదని పారిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. బెట్టింగ్‌లకు అలవాటుపడిన వారి జేబులు ఖాళీ అవుతుండగా, పంటర్స్‌కి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. గతంలో బోర్డులు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా ఆడేవారు. అయితే ప్రస్తుతం యాప్స్‌లో అలవాటు పడ్డారు. రెండు నెలలపాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు బెట్టింగ్ నిర్వాహకుల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : క్రికెట్ బెట్టింగ్ భూతం విరుచుకుపడుతోంది. ముఖ్యంగా యువతను బలితీసుకుంటోంది. సెల్‌ఫోన్ల పుణ్యమా అని జిల్లా అంతటికీ పాకి కుటుంబాలను గుల్లచేస్తోంది. జనాల జేబులకు చిల్లుపడుతుండగా, యాప్‌లలో మాత్రం లక్షలు చేతులు మారుతున్నాయి. గతంలో ఒంగోలు కేంద్రంగా బుకీలు రాకెట్‌ను నడిపించేవారు. ప్రస్తుతం సింగరాయకొండకు మకాం మార్చారని తెలుస్తోంది. అక్కడ వైసీపీ నేత బుకీగా వ్యవహరిస్తూ కొండపి, కందుకూరు, ఒంగోలు ప్రాంతాల్లో పంటర్స్‌ను ఏర్పాటు చేసి పందేలు వేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువగా బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జిలలో మకాం వేసి ఆడేవారిని ప్రోత్సహించి నిత్యం లక్షలు దోచుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది హోటల్స్, రెస్టారెంట్లలో పనిచేసే వెయిటర్స్ ద్వారా కూడా బెట్టింగ్‌లు వేస్తున్నారు. యువకులు గ్రూపులుగా ఏర్పడి రూ.500, వెయ్యితో పందేలు మొదలుపెట్టి లక్షల్లో పోగొట్టుకుని దొంగలుగా మారుతున్నారు. ఇలా గ్రామాల వరకు క్రికెట్ బెట్టింగ్ జాడ్యం పాకింది. కొంతమంది సాయంత్రానికి పట్టణాలకు వచ్చి బార్లలో కూర్చొని ఆట పూర్తయ్యే వరకు బెట్టింగ్‌లు వేసి జేబులు ఖాళీ చేసుకొని ఇంటికి వెళుతున్నారు.
ముఠా గుట్టు బయటపడింది ఇలా...
జరుగుమల్లి మండలానికి చెందిన ఓ యువ కుడు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేర కు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన జరుగుమల్లి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది. తప్పిపోయిన యువకుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతనిని తీసుకొచ్చి విచారించగా తాను బెట్టింగ్‌లు వేసి డబ్బులు పోగొట్టుకున్నానని తెలిపాడు. పైగా అప్పుల పాలై బెట్టింగ్ రాయుళ్ల ఒత్తిడికి తట్టుకోలేక తప్పించుకు తిరుగుతున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు బెట్టింగ్ ముఠాపై దాడులు చేసి ఇరవై మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఒంగోలు, కందుకూరు, కొండపి నియోజకవర్గాలలో ఏజెంట్ల ద్వారా రాకెట్ నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అందుకు సూత్రధారి బుకీగా అవతరామెత్తి గత ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. అదేక్రమంలో వైసీపీ నేత మరి కొంతమందిని భాగస్వాములను చేసుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో ఉన్న నలుగురు ముఖ్యులు పరారీలో ఉన్నారు.
బెట్టింగ్ జరిగే తీరు ఇదీ..
బుకీలు కొంతమంది (పంటర్స్)ని ఎంపిక చేసుకొని బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పంటర్స్ యువత, గతంలో బెట్టింగ్‌కు అలవాటు పడిన వారిని ఎంపిక చేసుకుని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి యాప్ లింక్‌లు పంపిస్తారు. లింక్‌ల ద్వారా తమ సెల్‌ఫోన్ల నుంచే బెట్టింగ్‌లు వేయిస్తారు. యూజర్ నంబరు, పాస్‌వర్డు మాత్రం పంటర్స్ దగ్గరే ఉంటాయి. వారి ఆధ్వర్యంలోనే బెట్టింగ్‌లు ఆడే వారికే యాప్‌లు ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. లింక్‌లు అన్నీ ప్రైవేటు సర్వర్లతో యాడ్ అయి ఉంటాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఇలాంటి వారిని గుర్తించడం కూడా కష్టం. బెట్టింగ్‌లు వేసేవారు 25శాతం పంటర్స్‌కు ఇవ్వాలి. పది వేలు పందెం వేసి గెలిస్తే రూ.7,500 వస్తాయి. ఓడిపోతే పది వేలు చెల్లించాలి. ఇలా బెట్టింగ్‌ల యాప్‌ల షరతులకు అంగీకరించిన వారికే లాగిన్ ఇస్తారు. కాగా కొందరు గెలిచినా సరే డబ్బులు తిరిగి ఇవ్వలేదని సమాచారం. ఓడిపోయిన వారు మాత్రం వెంటనే డబ్బులు కట్టాల్సిందే. లేకుంటే వారికి వేధింపులు తప్పవు. ఇదిలా ఉండగా ఒంగోలు నగరంలో డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు నేతృత్వంలో 15 పోలీసు బృందాలు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా 30 ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. 10 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారిలో కొందరి సెల్‌ఫోన్‌లలో బెట్టింగ్ యాప్‌లు ఉండటంతో పాటుగా, కొంతమంది బెట్టింగ్ ఆడుతున్నట్లు కాల్ హిస్టరీని గుర్తించారు.