RRR Case: కస్టోడియల్ టార్చర్ కేసు.. పోలీసుల కస్టడీకి తులసిబాబు..
ABN , Publish Date - Jan 27 , 2025 | 08:01 AM
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.

ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnam Raju) కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial torture case)లో నిందితుడు (Accused) కామేపల్లి తులసి బాబు (Kamepalli Tulasi Babu)ను గుంటూరు కోర్టు (Guntur Court) మూడు రోజులు పోలీస్ కస్టడీ (Police Custody)కి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తులసి బాబును ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. ఈనెల 8న తులసి బాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా..
సీఐడీ కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఐదో కోర్టు మేజిస్ర్టేట్ లత ఎదుట ఆయన ఆదివారం హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైలులో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతో పాటు అతనితో సరి సమానంగా ఉన్న మరో ఐదారుగురిలో ఆయన గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం జైలు బయట రఘురామ మీడియాతో మాట్లాడారు. తన ఎదుట నిలబడినవారిలో తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. ‘‘నా గుండెలపై కూర్చొని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్ జారింది. అప్పట్లో తులసిబాబును దగ్గర్నుంచి చూడటంతో పరేడ్‌లో ఆయన్ను స్పష్టంగా గుర్తుపట్టాను. తులసిబాబు గురించి టీవీలో చూశా. తులసిదళం అని, గుడివాడలో ఎమ్మెల్యేను ఆయనే గెలిపించాడని అనేక రకాల వార్తలొచ్చాయి.
నాపై హత్యాయత్నం కేసులో నిందితుడికి గుడివాడ ఎమ్మెల్యే సహకారం అందించిన విషయాన్ని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చూసుకుంటారని అనుకుంటున్నా. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పార్టీలో ఎటువంటి పదవి లేదని తెలిసింది. ఆయన్ను పార్టీకి దూరంగా ఉంచుతారేమోనని, సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమోనని భావిస్తున్నా. తులసిబాబు చరిత్ర గుడివాడ ప్రాంత వాసులకే కాకుండా ప్రకాశం జిల్లా వారికి బాగా తెలుసు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కార్యాలయంలోకి ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా లోపలకు వెళ్లగలిగిన స్థాయి తులసిబాబుకు మాత్రమే ఉండేది. అతనితో పాటు నాపై దాడి చేసినవారిలో మరికొందరు అనుమానితులు ఉన్నారు’’ అని రఘురామ పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితురాలు, నాటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పరారీలో ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఏ కలుగులో దాక్కున్నారోనని రఘురామరాజు అన్నారు. ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఆ పిటిషన్‌లో తాను కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇదే కేసులో నిందితుడు విజయ్‌పాల్ తరహాలో ప్రభావతి కూడా పెద్ద లాయర్లను పెట్టుకుంటారేమో చూడాలని రఘురామ చెప్పారు.
లేఖ రాసిన నాటి కలెక్టర్‌ను విచారించాలి
హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడానికి కొద్ది గంటల ముందే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ రాసిన లేఖే తన హత్యకు కుట్ర జరిగిందనడానికి మరో ఆధారమని రఘురామ తెలిపారు. ‘వీఐపీ వస్తున్నారు.. జీజీహెచ్‌లో గుండె వైద్య నిపుణుడిని అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేస్తూ ముందుగానే కలెక్టర్ లేఖ రాశారు. ఆ లెటర్ రాయాల్సి వచ్చిందో విచారణలో తేలాల్సి ఉంది. నాటి సీఐడీచీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైనా ఎందుకు సస్పెండ్ చేయలేదో, ఆయనకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదు. నాపై హత్యాయత్నం కేసులో విచరణ సాఫీగానే జరుగుతుందని భావిస్తున్నా. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని రఘురామ తెలిపారు.
కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈనెల 8న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను తులసి బాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. అనంతరం విజయ్‌పాల్‌ను పంపించి వేసి తులసి బాబు ప్రత్యేకంగా విచారించారు. ఈ క్రమంలో కొంత మేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణకు సహకరించకపోవడంతో పాటు బలమైన ఆధారాలు ఉండటంతో తులసిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News