మారుమూల గ్రామంలో పండుగ వాతావరణం
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:49 PM
‘‘నలభై ఏళ్లుగా ఈ గ్రామం టీడీపీ కంచుకోటగా ఉంది.. కష్టాలెన్ని ఎదురైనా, సమస్యలెన్ని ఉన్నా ఎమ్యెల్యే ఏలూరికి అండగా, పార్టీకు తోడుగా నిలుస్తున్నారు.. ఈ గ్రామానికి రుణపడి ఉన్నా.. అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా’’నని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు

చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో పింఛన్ పంపిణీ చేసిన సీఎం
చంద్రబాబు రాకతో గ్రామానికి మహర్దశ
ముఖ్యమంత్రిని చూసేందుకు పోటీపడిన స్థానికులు
గ్రామాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్న సీఎం
పర్చూరు/చీరాల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : ‘‘నలభై ఏళ్లుగా ఈ గ్రామం టీడీపీ కంచుకోటగా ఉంది.. కష్టాలెన్ని ఎదురైనా, సమస్యలెన్ని ఉన్నా ఎమ్యెల్యే ఏలూరికి అండగా, పార్టీకు తోడుగా నిలుస్తున్నారు.. ఈ గ్రామానికి రుణపడి ఉన్నా.. అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా’’నని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండల పరిధిలోని కొత్తగొల్లపాలెంలో మంగళవారం కోలాహలంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య, జిల్లా కలెక్టర్ వెంకటమురళీ, జేసీ ఫ్రకర్‌జైన్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం పింఛన్‌దారులు బత్తుల జాలమ్మ, వడ్లమూడి సుభాషిణి నివాసాలకు చేరుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వారికి పింఛన్ అందజేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి ఆయా కుటుంబాల్లో నెలకొన్న సమస్యలను సీఎంకు వివరించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చెప్పడంతోపాటు ఒక్కో ఇంట్లో సుమారు 10నిమిషాల వరకు గడిపి వారితో మాటామంతీ కలిపారు. దీంతో వారందరూ ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. అనంతరం సమీపంలోని రామాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని సీఎం కొబ్బరికాయ కొట్టగా, అది సమాంతరంగా పగలడంతో ధర్మకర్త యల్లావుల వెంకటేశ్వర్లు కొబ్బరికాయ చక్కగా పగిలింది.. మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పడంతో అందరిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.