పాలసీతో ప్రాణం
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:26 AM
ఎన్నికల నాటి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న గ్రానైట్ పరిశ్రమను గాడిన పడేలా చేసేందుకు నూతన మైనింగ్ పాలసీని రూపొందించింది. మంగళవారం దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

నూతన మైనింగ్ విధానంతో గ్రానైట్ పరిశ్రమకు పునరుజ్జీవం
50శాతం అదనంగా వసూలు చేస్తున్న కన్సిడరేషన్ అమౌంట్ రద్దు
రెన్యువల్స్ ప్రీమియం సగానికి తగ్గింపు
నూతన లీజుల కాలపరిమితి పెంపు, ఆక్షన్ విధానానికి స్వస్తి
పాతకేసుల పరిష్కారానికి ఓటీఎస్.. జరిమానాలు భారీగా తగ్గింపు
కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా రాయల్టీ వసూలు
నూతన పాలసీకి కేబినెట్ ఆమోదం
హర్షం వ్యక్తంచేసిన పరిశ్రమ వర్గాలు
ఎన్నికల నాటి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న గ్రానైట్ పరిశ్రమను గాడిన పడేలా చేసేందుకు నూతన మైనింగ్ పాలసీని రూపొందించింది. మంగళవారం దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో పరిశ్రమ పూర్తిస్థాయిలో దెబ్బతింది. ఈ పరిస్థితులను సరిదిద్ది పరిశ్రమకు ఊతం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పాదయాత్ర సమయంలో లోకేష్‌కు గ్రానైట్ అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కచ్చ్చితంగా పరిశ్రమను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు. దాని కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిశ్రమ వర్గాలు నూతన పాలసీతో ఊపిరిపీల్చుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
చీమకుర్తి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించిన నూతన పాలసీతో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్ పరిశ్రమకు ప్రాణం పోసినట్లైంది. అందులో ఊరటనిచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కాసిన్ని చేదు గుళికలు సైతం చోటుచేసుకున్నాయి. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానం వలన అనేక పరిశ్రమలు మూతపడగా, ప్రస్తుత సర్కారు నూతన పాలసీ ఊరటనిచ్చింది. ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే కాక ప్రభుత్వంపై నమ్మకం పెంపొందించేలా, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరే విధంగా ఉంది.
మైనింగ్ పాలసీలో ప్రధానాంశాలు ఇవీ..
2021లో కొవిడ్ అనంతరం గ్రానైట్ ఖనిజంపై అప్పటికే పెంచిన రాయల్టీకి అదనంగా 50శాతం కన్సిడరేషన్ అమౌంట్‌ను వసూలు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొవిడ్ వలన కుప్పకూలిపోయిన పరిశ్రమకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దుచేసింది.
- సీనరేజీ ఫీజును సవరిస్తూ భారం లేకుండా రూపొందించారు. టన్నేజీ ఆధారిత ఒకే విధమైన సీనరేజీ ఫీజు ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో చైనాకు ఎగుమతులు చేసే గెలాక్సీ బ్లాకులను టన్నేజీ ఆధారంగా కొనుగోలుకు బయ్యర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ క్యూబిక్ మీటర్లలో జరుగుతుండటం ఎగుమతులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు టన్నేజీ విధానం వలన ఎగుమతుల ప్రక్రియ సులభతరం అవుతుంది.
- గత వైసీపీ ప్రభుత్వం మైనింగ్ లీజుల మంజూరు ప్రక్రియను మార్చివేసింది. అప్పటివరకు అమలులో ఉన్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానాన్ని రద్దుచేసి వేలం ద్వారా లీజుల మంజూరును 2022లో ప్రవేశపెట్టింది. తమకు అనుకూలంగా ఉన్న వారికి లీజులు మంజూరు చేసే దొడ్డిదారి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీని వలన 6వేలకుపైగా దరఖాస్తులు అర్హత
కోల్పోయాయి. ఇపుడు నూతన పాలసీలో ఆక్షన్ పద్ధతిని రద్దు చేసి పాతపద్ధతినే పునరుద్ధరించనున్నారు.
- రెన్యువెల్స్‌కి కూడా వసూలు చేస్తున్న ప్రీమియం 10రెట్ల వార్షిక డెట్ రెంట్ నుంచి 5 రెట్లకు తగ్గించారు. ఇది రెండు దశలలో చెల్లించే వెసులుబాటును కల్పించారు. పూర్తి ప్రీమియం చెల్లించిన తేదీ లేదా దరఖాస్తు సమయానికి సంబంధం లేకుండా అన్ని రెన్యువల్ దరఖాస్తులు ఆరునెలలు పాటు పరిగణిస్తారు. అపుడు తగ్గించిన ప్రీమియంతో వాటిని సమర్పించవచ్చు
--డెట్‌రెంట్లను ఖనిజ ప్రాతిపదికన తిరిగి సవరించారు. ఇప్పటి వరకూ ప్రతికూలంగా ఉండే త్రైమాసిక సెటిల్‌మెంట్‌కు బదులుగా వార్షిక సెటిల్ చేయగలిగే విధంగా మార్చారు. దీనివలన లీజుదారులు తమ నిధులను సమర్థవంతంగా వినియోగించగలుగుతారు.
-కొత్త లీజులు, రెన్యూవల్స్‌కు గరిష్ఠ కాలపరిమితిని పెంచారు. గ్రానైట్‌కు కొత్త లీజుకు 20ఏళ్ల నుంచి 30 ఏళ్లకు, రెన్యూవల్స్‌కు 10 నుంచి 20ఏళ్లకు పెంచారు. పూర్తి ప్రీమియం చెల్లించి గతంలో మంజూరైన రెన్యువల్స్ కూడా ఇపుడు ఈ కొత్త కాలపరిమితికి అనుగుణంగా సర్దుబాటు చేయటం ఓనర్లకు కలిసి వచ్చే అంశంగా ఉంది
-గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పరిష్కారానికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ని తీసుకురానున్నారు. ఒక సంవత్సర కాలపరిమితితో ఓటీఎస్‌ను ప్రవేశపెట్టారు.
-జరిమానాలు కూడా భారీగా తగ్గించారు. పదిరెట్ల సీనరేజి ఫీజు నుంచి రెండు రెట్లు, ఐదు రెట్లు నుంచి ఒక రెట్టుకు తగ్గించారు. దీనివలన మూసివేసిన గనులను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంటుంది. కేసుల భారం తగ్గుతుంది. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సులభంగా వసూలు అవటం ద్వారా ఇటు ప్రభుత్వానికి సైతం లాభదాయకంగా ఉంటుంది.
-డంపింగ్ రాళ్లను అధికారికంగా విక్రయించేందుకు నూతన పాలసీ వెసులుబాటు కల్పించింది. రోడ్ మెటల్‌కు నామినల్‌గా వసూలు చేసే ఫీజును చెల్లించి విక్రయించుకోవచ్చు. దీని వలన అక్రమంగా తరలుతున్న డంపింగ్ రాళ్లకు చెక్ పడటమే కాక ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఓనర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యర్థాల డంపింగ్ కోసం అదనంగా భూమిని పొందే వెసులుబాటును కల్పించారు. అయితే దీనికిగాను మూడు రెట్ల డెట్ రెంట్‌ని వసూలు చేస్తారు.
-కుటుంబ సభ్యులకు లీజు బదిలీపై ఫీజు మినహాయింపునిచ్చారు. తండ్రి, తల్లి, కొడుకు, కుమార్తె వంటి ప్రత్యక్ష కుటుంబ సభ్యులకు లీజులను సులభంగా బదిలీ చేసుకోవచ్చు
--సీనరేజి వసూలు చేసే ప్రక్రియను మార్పుచేశారు. రాష్ట్రం అంతా ఒకేవిధంగా వసూలు బాధ్యతను కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పజెప్పనున్నారు. దీనివలన ప్రభుత్వ ఖజానాకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
-లీజు జీవితచక్రం మొత్తం డిజిటల్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తారు.
--లీజుదారులకు స్టార్ రేటింగ్‌ని నిర్ణయిస్తారు.
-తమకు మంజూరైన లీజుల్లో ఇప్పటివరకూ జరిపిన తవ్వకాలపై డోన్ల ద్వారా సర్వే నిర్వహించి అనుమతులు మేరకు తవ్వకాలు జరిపారా లేదా? అని నిర్ధారించనున్నారు. పాలసీలో కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఓనర్లకు చేదు గుళికలా మారింది. దీనిపై ప్రాక్టికల్‌గా ఎదురయ్యే సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఓనర్లు ఉన్నారు.
-మొదలుపెట్టకుండా ఉన్న లీజు గడువును ఒక సంవత్సరంలో శాస్ర్తీయంగా మూసివేయాలి.