తాగునీటికి ప్రజలు కటకట
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:39 AM
నియోజక వర్గంలో నీటిసమస్య నానాటికి తీవ్రమోతోంది. ఇప్ప టికే 10కిపైగా గ్రామాలలో వివిధ కారణాలతో నీటి సమస్య నెలకొంది.

గిద్దలూరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో నీటిసమస్య నానాటికి తీవ్రమోతోంది. ఇప్ప టికే 10కిపైగా గ్రామాలలో వివిధ కారణాలతో నీటి సమస్య నెలకొంది. భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో రానున్న రోజుల్లో 30కి పైగా గ్రామాల్లో నీటిసమస్య ఎదురయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నీటిసమస్య తీవ్రత లేనప్పటికీ, రాచర్ల రోడ్డు లోని హోసన్న మందిర్ రోడ్డులో నీటిసమస్య కనిపి స్తోంది. మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్లు నిత్యం ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి నీటిని అందిస్తు న్నాయి. మండలంలోని ముండ్లపాడులో సైతం భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. సింగిల్ ఫేజ్ మోటార్లు ఉన్న బోర్లకు మినహా త్రీఫేజ్ మోటార్లకు నీరు రాని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ పరిధిలో 900 అడుగులు వేస్తే ఒక్క అంగుళం నీరు కూడా పడని బోర్లు చాలా ఉన్నాయి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీరు ఎక్కకపోవడంతో బోర్ల వద్దే అధికా రులు నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేనప్పటికీ వేసవి తీవ్రత దృష్ట్యా భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతే 5 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రజలు నీటికి పాట్లుపడాల్సి ఉంటుంది. కొమరోలు మండలం తాటిచెర్లమోటులో నీటి సమస్య ఉంది. కొమరోలు, రెడ్డిచెర్ల, ఇడమకల్లు, దద్దవాడ గ్రామాల పరిధిలో తరచూ బోరుమోటార్లు రిపేరుకు వస్తుండగా నిధుల కొరత కారణంగా మరమ్మతులో జాప్యం జరుగుతోంది. రాచర్లలోని బస్టాండ్ సమీపం లో బోరు మోటారు పనిచేయకపోవడంతో గత రెండు, మూడు రోజులుగా సుమారు 200 కుటుంబాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అలాగే ఆకవీడు, ఆర వీటికోటలో కూడా భూగర్భజలాలు వేగంగా పడిపో తుండడంతో నీటి లభ్యత తగ్గిపోతోంది. బేస్తవారపేట మండలం కొత్తపల్లి ఎస్సీకాలనీలో నీటిసమస్య తాండ విస్తోంది. సమీప పొలాల్లోని రైతుకు చెందిన వ్యవ సాయ బోరు నుంచి తాత్కాలికంగా అధికారులు నీటిని అందిస్తున్నారు. అర్థవీడు మండలం మాగుటూ రు సమీపంలోని కృష్ణానగర్‌లో నీటిసమస్య నెలకొనగా పంచాయతీ అధికారులు ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామం కావడంతో అక్కడ కొత్తగా బోర్లు వేసేందుకు నిబంధనలు అడ్డువస్తున్నాయి. ఇక కృష్ణానగర్ ప్రజలు నీటిసమస్యను ఎదుర్కొంటున్నారు. రంగాపురం, మాగుటూరు తాండా, తదితర గ్రామాలలో కూడా మోటార్ల రిపేరుకు వస్తుండడంతో నీటిసమస్య కనిపిస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లక పోతే మరో రెండు వారాల్లోనే 30కి పైగా గ్రామాలలో నీటిసమస్య తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కంభం : ప్రస్తుత వేసవికాలంలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. అర్థవీడు మండలంలోని రంగాపురం, మాగుటూరు, వెలగలపాయ గ్రామాలలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కృష్ణానగర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సర ఫరా చేస్తున్నారు. గ్రామాలలో భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటిని సరఫరా చేసే మోటార్లు రిపేరుకు వచ్చాయి. వాటిని రిపేరు చేయించేందుకు సర్పంచులు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల వద్దకు వెళ్లి బిల్లులు పాస్‌చేయాలని కోరినా సంబంధిత అధికారు లు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన అర్థవీడు మండల సర్వసభ్య సమావేశంలో కూడా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య వస్తే సర్పంచు లు, అధికారులు తక్షణం స్పందించి నీటి సమస్య తీర్చేందుకు మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
మార్కాపురం రూరల్ : మండలంలోని గోగులదిన్నె గ్రామంలోని యల్లమ్మ బజారులో, ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం పనులు మానుకుని రోజంతా ఓ మనిషి ఇంటి వద్ద ఉండి వేరే ప్రాంతానికి వెళ్లి నీటిని తీసుకురావాల్సి వస్తోంది. మండలంలోని నాయుడుపల్లి గ్రామంలో రామాలయం పక్క బజారులో బోరు మోటార్ మరమ్మత్తులకు గురికావడంతో గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు నీటి కోసం మరో ప్రాంతానికి ప్రజలు వెళుతున్నారు. మండలంలోని గజ్జలకొండ, పడమటిపల్లి, పెద్దనాగులవరం, తిప్పాయపాలెం, బిరుదులనరవ గ్రామాలలో తాగు నీటి సమస్య నెలకొంది.
తర్లుపాడు: మండలంలోని పోతలపాడు, గానుగపెంట, కేతగుడిపి, మేకలవారిపల్లెలో మంచినీటి సమస్య నెలకొంది. ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రులు పోతలపాడు, గానుగపెంటలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. గానుగపెంటలో ఎక్కువుగా మంచినీటి సమస్య నెలకొనడంతో అధికారులు తోలుతున్న 10 ట్రిప్పులు సరిపోక రైతులు సొంత ట్యాంకర్ల ద్వారా దాహార్తిని తీర్చుకుంటున్నారు. పోతల పాడు, గానుగపెంటలో ఎక్కువగా పశుపోషణపై ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్నారు. పొలాల్లోనే బోర్ల ద్వారా గొర్రెలు, మేకలకు నీరు అందిస్తున్నారు.
పొదిలి : వేసవి సందర్భంగా మండలం లోని కొండాయిపాలెం, జువ్వలేరు, ఈగలపాడు గ్రామాలలో నీటిఎద్దడి అధికంగా ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. అదే విధంగా కొండాయిపాలెం 7 ట్రిప్పులు, ఈగలపాడు 6 ట్రిప్పులు, జువ్వలేరు గ్రామాలలో 4 ట్రిప్పు లు ట్యాకర్ నీటిని అధికారులు తోలిస్తున్నారు. మూగచింతల, అక్కచెరువు, సూదనగుంట, దొండ్లేరు, సలకనూతల గ్రామాల్లో ఈ నెలాఖరుకు తాగునీటి సమస్య రావచ్చని ట్రాన్స్‌పోర్టేషన్ చేసేందుకు ఎస్టిమేట్స్ కలెక్టర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
పెద్దారవీడు : మండలంలో కరువు తాండవిస్తోంది. ఇప్పటికే తాగునీటి సమస్య ప్రారంభమైంది. భూగర్భజలాలు అడు గంటాయి. భూమిలోకి నీటి కోసం సుమారు 1000 అడుగుల మేర బోరుతవ్వినా, చుక్క నీరు కూడా పడని పరిస్థితి నెలకొంది. ఎండాకాలం ప్రారంభంలోనే మండలంలోని అన్ని గ్రామాలలో తాగునీటి ఎద్దడి ప్రారంభ మైంది. రానున్న రోజుల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చనుంది.
మండలంలోని వెలిగొండ ప్రాజెక్ట్ పునరావాస గ్రామాలైన సుంకేసుల, గుండంచర్ల, కలనూతలలలో, గుంటూరు-కర్నూలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పోతంపల్లి, చాట్లమడ అగ్రహారం, రేగుమానుపల్లి గ్రామాలలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. పెద్దారవీడు, దేవరాజుగట్టు గ్రామాలలో నీటిలభ్యత ఉండటంతో పంచాయతీ కొళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.
అరకొర ట్యాంకర్లతో అవస్థలు
కొనకనమిట్ల : మండలంలోని పలు గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ, తాగునీటి సమస్య రోజురోజుకు జఠిలమోతోంది. మండలంలో గొట్లగట్టు 8, సిద్ధవరం 8, వెలిగండ్ల 6, గనివినపాడులో 8 ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు చెప్పారు. గొట్లగట్టు గ్రామంలో తీవ్రనీటి సమస్య ఉంది. ప్రస్తుతం గ్రామంలో 8 ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తుండగా, ఆ సంఖ్య 16కు పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు. బస్టాండ్ సమీపంలోని ఎస్సీ కాలనీ, పూర్తిగా ట్యాంకర్ నీటిపై ఆధారపడాల్సి వస్తోందని కాలనీవాసులు తెలిపారు. అంతే కాకుండా ఏప్రిల్ నెల చివరనాటికి తాగునీటి సమస్య మరింత జఠిలం అవుతుందని, అధికారులు ముందస్థు ప్రణాళికలు లేకపోతే తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొనే అవకాశం ఉంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని అధికారులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : పట్టణంలో సాగర్ నీరు వస్తున్నప్పటికీ అన్ని ప్రాంతాలకు సరఫరా కావడం లేదు. పలు వీధులలో కొంత మంది మోటార్ల ద్వారా పైపుల్లోని నీటిని తోడేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న సామాన్యులకు నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరిం చేందుకు మండలంలోని తమ్మడపల్లి, బోయలపల్లి, రేగులపల్లి, అమానిగుడిపాడు, గుర్రపుశాల, మిల్లం పల్లి, కాశికుంట తండా, పిల్లికుంట తండా, బట్టువానిపల్లె, చిన్న కొలుకుల తదితర గ్రామాలలో ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి జాట్సన్‌పాల్ తెలిపారు.