Share News

కనులపండువగా రఘునందనుడి కల్యాణం

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:14 PM

ప్రసిద్ధిగాంచిన చదలవాడలోని శ్రీరఘునాయక స్వామి 240వ వార్షిక కల్యాణం సోమవారం కన్నులపండువగా జరిగింది. అలంకరించిన స్వామివార్లను పల్లకిలో దేవస్థానం వద్దనున్న కల్యాణ వేదికపైకి తీసుకొచ్చి ఈవో దొంత అనీల్‌ కుమార్‌, ప్రధాన అర్చకులు దేవేంద్ర ఆధ్వర్యంలో యాజ్ఞిక స్వామి వెంకటాచార్యులు బృందం వేదమంత్రాల నడుమ అశేష భక్తజనం సాక్షిగా ఉదయం 10 గంటలకు కల్యాణ క్రతువును ప్రారంభించారు.

కనులపండువగా రఘునందనుడి  కల్యాణం
రథోత్సవం(ఇన్‌సెట్లో) స్వామి వారు

గరుడ పక్షి రాకతో తన్మయత్వం చెందిన భక్తులు

వైభవంగా రథోత్సవం

పాల్గొన్న ఎంఎల్‌ఏ బీఎన్‌

నాగులుప్పలపాడు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధిగాంచిన చదలవాడలోని శ్రీరఘునాయక స్వామి 240వ వార్షిక కల్యాణం సోమవారం కన్నులపండువగా జరిగింది. అలంకరించిన స్వామివార్లను పల్లకిలో దేవస్థానం వద్దనున్న కల్యాణ వేదికపైకి తీసుకొచ్చి ఈవో దొంత అనీల్‌ కుమార్‌, ప్రధాన అర్చకులు దేవేంద్ర ఆధ్వర్యంలో యాజ్ఞిక స్వామి వెంకటాచార్యులు బృందం వేదమంత్రాల నడుమ అశేష భక్తజనం సాక్షిగా ఉదయం 10 గంటలకు కల్యాణ క్రతువును ప్రారంభించారు. పొన్నూరి వెంకటశ్రీనివాసులు కల్యాణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మద్దిరాలపాడుకు చెందిన ఉభయదాతలు పెనుబోతు వంశీయులు స్వామికి నూతన పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. 11 గంటల సమయంలో ఆకాశంలో గరుడ పక్షి కల్యాణ వేదిక చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో భక్తులు తన్మయత్వం చెందారు. రామనామ స్మరణం జపించారు. అనంతరం స్వామికి కల్యాణ తలంబ్రాలు పోసి ఆ ఘట్టాన్ని పూర్తిచేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తిలకించారు. భక్తులకు స్వామి కల్యాణ తలంబ్రాలను ప్రత్యేక కౌంటర్‌ ద్వారా అందజేశారు. అన్నదానం చేశారు.

రథోత్సవంలో పాల్గొన్న ఎంఎల్‌ఏ బీఎన్‌

రఘునాయక స్వామి కల్యాణోత్సవంలో భాగంగా సాయంత్రం స్వామి రథోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఎంఎల్‌ఏ బీఎన్‌ విజయ్‌కుమార్‌ రఘునాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదాతలు తూమాటి రాంబోట్లు చౌదరి దంపతులతో కలసి రధంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో రఽథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు యువకులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎంపీపీ అప్పలకుమార స్వామి, ఎంపీటీసీ సభ్యుడు పమిడిముక్కల శివకృష్ణ, కొంజేటి ధనుష్‌, ఆలయ ధర్మకర్త ఉప్పల లక్ష్మీనరసింహాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు చదలవాడ వెంకట కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:14 PM