Share News

రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:52 AM

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం కురిచేడు మండలం గంగదొనకొండలో ఏర్పాటుకానున్న రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌కు శాపంగా మారింది. భూముల కేటాయింపులో ఏర్పడిన సమస్యతో ఆ సంస్థ చేపట్టిన పనులు నిలిచిపోయాయి.

రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌
పనులు ఆపి పక్కన ఉంచిన ఎక్స్‌కవేటర్లు

సీబీజీ ప్లాంట్‌కు గంగదొనకొండలో 799.40 ఎకరాలు కేటాయింపు

పనులను ప్రారంభించిన రిలయన్స్‌ సంస్థ

ఆ భూమి తమదని అడ్డుకున్న ఫారెస్టు అధికారులు

ఎఫ్‌ఎల్‌ఆర్‌లో ఆఊసే లేదంటున్న రెవెన్యూ

సమన్వయ లోపంతో నిలిచిన పనులు

కురిచేడు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం కురిచేడు మండలం గంగదొనకొండలో ఏర్పాటుకానున్న రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌కు శాపంగా మారింది. భూముల కేటాయింపులో ఏర్పడిన సమస్యతో ఆ సంస్థ చేపట్టిన పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనలో టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా ఉంది. రిలయన్స్‌ సంస్థ 500 సీబీజీ ప్లాంట్‌ల ఏర్పాటు కు సిద్ధం కావడంతోపాటు మొట్టమొదట పీసీపల్లి మండలంలో భూమి పూజ కూడా చేశారు. అదే తరహాలో కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో ప్లాంటు ఏర్పాటుకు 799.40 ఎకరాలు కేటాయించారు. దీంతో పదుల సంఖ్యలో యంత్రాలతో శుక్రవారం నుంచే రిలయన్స్‌ ప్రతినిధులు పెద్దఎత్తున పనులు ప్రారంభించారు. శనివారం అటవీ శాఖాధికారులు వచ్చి నిలిపివేయించారు.

రెవెన్యూ రికార్డులో గయాలు భూమి

కురిచేడు మండలం గంగదొనకొండ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 88లో 548.95 ఎకరాలు, సర్వే నంబరు 90లో 250.45 ఎకరాలు మొత్తం 799.40 ఎకరాల భూమిని సీబీజీ ప్లాంటుకు కేటాయించారు. భూమికి రెవెన్యూ అధికారులు క్లియరెన్స్‌ ఇవ్వగా కలెక్టర్‌ అప్రూవల్‌ చేశారు. అది పూర్తిగా గయాలు భూమి అని రెవెన్యూ రికార్డులలో ఉంది. భూమికి అప్రూవల్‌ రావడంతో రిలయన్స్‌ సంస్థ శుక్రవారం నుంచి పనులు ప్రారంభించింది. అందుకు సంబంధించి 40కు పైగా ఎక్స్‌కవేటర్లు, పెద్ద యంత్రాలు తీసుకువచ్చి చిల్లచెట్లు తొలగించే పని చేపట్టారు. శనివారం సాయంత్రానికి 150 ఎకరాలలో శుభ్రం చేశారు. ఇదే సమయంలో అటవీ శాఖ డీఆర్‌వో కేబీ నాయక్‌, ఎఫ్‌బీవో వై.ధనలక్ష్మిలు ప్లాంటు నిర్మాణ స్థలానికి వచ్చారు. ‘ఆ భూమి అటవీ శాఖదని, మా అనుమతులు లేకుండా పనులు చేయవద్దని’ అడ్డుకున్నారు. ఆభూమిలో గతంలో తాము నీరు నిలిచే ట్రెంచింగ్‌ చేశామని, మేము నిర్మించిన పిల్లర్లు కూడా ఉన్నాయని వారు వాదించారు. రెవెన్యూ అధికారులేమో ఎఫ్‌ఎల్‌ఆర్‌లో అది పూర్తిగా గయాలు భూమి అని ఉన్నదని, అటవీ శాఖ భూమి అందులో లేదని అందుకే అనుమతులు ఇచ్చామని చెబుతున్నారు. గతంలో మా అనుమతులు లేకుండా ట్రెంచింగ్‌ తీశారని వారు అంటున్నారు. అంతేకాక 1974లోనే 88 సర్వే నంబరులో 55 మంది రైతులకు 168.40ఎకరాలు, సర్వే నంబరు 90లో 9 మంది రైతులకు 28 ఎకరాలు అసైన్డ్‌ భూమి ఇచ్చామని చెబుతున్నారు. చాలా కాలంపాటు ఆభూములలో రైతులు పంటలు సాగు చేశారని, అప్పుడు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా కూటమి ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే ఆశలు ప్రజల్లో చిగురిస్తున్న తరుణంలో రెండు శాఖ మధ్య సమన్వయ లోపంతో ప్లాంటు పనులు ఆగాయి. వెంటనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్లాంటు పనులు చేపట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుకుంటున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 01:52 AM