ఎస్సీ కార్సొరేషన్‌కు పూర్వవైభవం
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:21 AM
ఐదేళ్లుగా మూలనపడ్డ ఎస్సీ కార్పొరేషన్‌కు కూటమి ప్రభుత్వం పూర్వ వైభవాన్ని తెస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అమలు చేసిన అన్ని పథకాలను మూలన పడేసింది. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే కాదు బడుగుల ఆర్థికాభివృద్ధి కోసం పనిచేసే బీసీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లకు కూడా నిధుల లేకుండా చేసింది.

ఐదేళ్ల తర్వాత తిరిగి రుణాలు
11 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఎస్సీల్లో చిగురిస్తున్న ఆశలు
జగన్ హయాంలో మూలనపడ్డ పథకాలు
ఒంగోలు నగరం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ఐదేళ్లుగా మూలనపడ్డ ఎస్సీ కార్పొరేషన్‌కు కూటమి ప్రభుత్వం పూర్వ వైభవాన్ని తెస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అమలు చేసిన అన్ని పథకాలను మూలన పడేసింది. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే కాదు బడుగుల ఆర్థికాభివృద్ధి కోసం పనిచేసే బీసీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లకు కూడా నిధుల లేకుండా చేసింది. వాటి ద్వారా ఎన్నో ఏళ్లుగా అమలవుతున్న అన్నిరకాల పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో రాష్ట్రంలోని బడుగు వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కూటమికి పట్టం కట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లోనే కార్పొరేషన్లకు జవసత్వాలు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ ద్వారా వేలాది మందికి యూనిట్లను అందించేందుకు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా పేదలకు రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
వచ్చేనెల 10 వరకూ దరఖాస్తుల స్వీకరణ
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఉన్న అన్ని పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ముందుగా బ్యాంకు లింకేజీతో ఎస్సీలకు పెద్దఎత్తున రుణాలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈనెల 11వతేదీ నుంచి ఎస్సీలకు రుణాల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.800కోట్లకుపైగా రుణాల రూపంలో ఎస్సీలకు అందజేయనుంది. మే 10 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మే 20వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తవుతుంది. 60శాతం, 40శాతం సబ్సిడీతో యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రుణాలను మంజూరు చేయనుంది. రూ.10లక్షలకుపైగా యూనిట్ విలువతో ఇవి మంజూరు కానున్నాయి. ఇందులో లబ్ధిదారుల వాటాగా 5శాతం చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ గరిష్ఠంగా రూ.లక్ష అందజేయనున్నారు. రాష్ట్రప్రభుత్వం ముందుగా బ్యాంకు లింకేజీ రుణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా కొద్దిరోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన అన్ని పథకాలను తిరిగి పునఃప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.